ఆ బాధ్యతంతా పీఎస్యూలదే
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న మొండి బకాయిల (ఎన్పీఏ) బాధ్యత ప్రభుత్వ రంగ బ్యాంకులదేనని ఆర్థిక మంత్రి పి.చిదంబరం స్పష్టంచేశారు. ఇందుకు ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించటం సమంజసం కాదన్నారు. శనివారమిక్కడ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) 20వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్పీఏల బాధ్యత ఆయా బ్యాంకుల బోర్డులదే. రికవరీ విధానాలు ప్రస్తుతం కొంత సరళంగా ఉన్న మాట నిజం. అవి మారాల్సి ఉంది. అయితే బ్యాంకుల రుణ రేటు పెరుగుతోంది కనక ఎన్పీఏలు పెరిగినా సరే ప్రభుత్వం వాటికి తాజా మూలధనాన్ని అందిస్తోంది’’ అని వివరించారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే...
మార్కెట్ అక్రమాలను నిరోధించడానికి వీలుగా రెగ్యులేటర్ సెబీకి మరిన్ని అధికారాలు కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనికి సంబంధించి సభా సంఘం తన నివేదికను ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు సమర్పించకపోతే మూడో సారి సైతం ఆర్డినెన్స్‌ను పొడిగించాల్సి ఉంటుంది. జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని ఎఫ్ఎస్ఎల్ఆర్సీ సిఫారసుల ప్రకారం ద్రవ్య పరపతి విధానం రూపకల్పన, బ్యాంకింగ్ రెగ్యులేషన్ మినహా ఆర్బీఐ నిర్వహిస్తున్న ఇతర కార్యకలాపాలు కొన్నింటిని సమీక్షించాల్సి ఉంది. వీలైతే ఆయా అధికారాలను ప్రభుత్వం లేదా ఇతర నియంత్రణ సంస్థలకు అప్పగించాలి.