సెక్యులర్ స్నేహం
పిల్లలమర్రి అనూరాధ మచిలీపట్నంలో పుట్టారు.షెహనాజ్ షరీఫ్ వైజాగ్‌లో పుట్టారు.సబితా ఎబినెజర్ చెన్నైలో పుట్టారు.ముగ్గురు జన్మించిందీ బంగాళాఖాతం తీరాన్నే.కానీ... వీరిని కలిపిన బంధం సముద్ర తీరం కాదు.‘భారతీయత’ చుట్టూ అల్లుకున్న స్నేహబంధం.
సైనిక్‌పురి, వాయుపురి అంటే... ఒక కశ్మీరీ కుటుంబం, ఆ పక్కనే ఓ గుజరాతీ, పంజాబీ కుటుంబాలు, వాటికెదురుగా కేరళ వాళ్లు, వారి పొరుగున ఈశాన్య రాష్ట్రాల వాళ్లూ వీరి మధ్యన అక్కడక్కడా కొన్ని తెలుగు కుటుంబాలు నివసించే ప్రదేశం. ఓ మినీ మహాభారతం. దీనిని వదిలి బయట జీవించడం తమకు తెలియదంటారు ఈ స్నేహితులు.
‘వియ్ ఆర్ ఆల్ స్వీట్ సిక్ట్సీస్’ అని సరదాగా సంతోషంగా చెప్పే వీరి స్నేహానికి దాదాపుగా ముప్ఫై ఏళ్లు. ప్రాంతం, మతం, భాష వంటి పరిధులేవీ తమ స్నేహానికి ఆటంకాలు కాదంటున్నారు. సికింద్రాబాద్‌లోని సైనిక్‌పురి, రామకృష్ణాపురం, మారేడ్పల్లిల్లో ఉండే ఈ ముగ్గురినీ కలిపిన వేదిక ఆర్మీ పబ్లిక్ స్కూల్. వీరి భర్తలు భారత వైమానిక దళంలో అధికారులు కావడంతో వీరి కెరీర్ కూడా రక్షణ రంగానికి అనుబంధంగానే అల్లుకుంది. ఉన్నత విద్యావంతులైన అనూరాధ, షెహనాజ్, సబితలు ఆర్మీ స్కూల్లో లెక్కలు, సైన్స్, సోషల్, ఇంగ్లిష్ సబ్జెక్టులు బోధించేవారు.
సంతోషాలూ... దుఃఖాలూ...
‘ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్‌డీడ్’... అన్నట్లే కనిపిస్తారు ఈ స్నేహితులు. దీపావళి పండుగకు మిగిలిన ఇద్దరూ కుటుంబాలతో సహా అనూరాధ ఇంట్లోనే పండుగ చేసుకుంటారు. ఈద్ రోజుకు అంతా షెహనాజ్ ఇంట్లోనే. క్రిస్టమస్ వేడుకకు సబిత ఇల్లే వీరి వేదిక. ‘పుట్టిన రోజులు, పెళ్లి రోజులే కాదు, సత్యనారాయణ వ్రతం కూడా అంతా కలిసి చేసుకుంటాం’ అంటున్నారు.
‘‘నేను చెన్నైలో పుట్టి పెరిగాను, పెళ్లయిన తర్వాత హైదరాబాద్‌కి వచ్చాను. ఈ ప్రదేశం, పరిసరాలు అలవాటు కావడానికి షెహనాజ్, అనూరాధ ఇద్దరూ సహాయం చేశారు’’ అన్నారు సబిత. ‘‘మా వారికి ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో ఉంటే షెహనాజ్, సబిత కుటుంబాలే అండగా నిలిచాయి. నేను రాత్రంతా హాస్పిటల్లో ఉండి ఉదయం నేరుగా స్కూల్‌కి వెళ్లేదాన్ని. అప్పటికే నా కోసం ఒకరు ఫ్లాస్కులో టీ, మరొకరు బ్రేక్‌ఫాస్ట్ తెచ్చేవారు.
సబిత భర్త ఎబినెజర్ అయితే మా వారికి ఆహారం తీసుకెళ్లడం నుంచి దగ్గర కూర్చుని ఆయనకు ధైర్యం చెప్పేవారు. అంతకంటే పెద్ద విషయం ఏమిటంటే... సబిత వాళ్లు ఇల్లు కట్టుకుని గృహప్రవేశానికి తేదీ నిర్ణయించుకున్నారు. ఆ సమయానికి మా వారు పోయారు. నేను బాధలో ఉన్నప్పుడు నన్నలా వదిలి వెళ్లలేక వాళ్లు గృహప్రవేశం తేదీ మార్చుకున్నారు. నా సంతోషాన్నే కాదు, నా దుఃఖాన్ని కూడా పంచుకున్న స్నేహితులు వీళ్లు’’ అంటూ షెహనాజ్, సబితలను దగ్గరకు తీసుకున్నారు అనూరాధ.
స్వచ్ఛంద బృందం...
‘డిఫెన్స్ వెటరన్ వాలంటీర్ గ్రూప్ ఆఫ్ హైదరాబాద్’ అనే స్వచ్ఛంద బృందంలో వీరంతా చురుగ్గా పని చేస్తుంటారు. షెహనాజ్ ఇంగ్లిష్ పరిజ్ఞానం పెద్దగా లేని జవాన్లకు ఇంగ్లిష్ పాఠాలు చెప్తారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా అందుబాటులోకి వస్తున్న పరికరాలను ఉపయోగించడంలో మెళకులవను వృద్ధులకు నేర్పిస్తుంటారు. ఇక అనూరాధ... పిల్లలు ఉద్యోగరీత్యా విదేశాల్లో లేదా ఇతర ప్రాంతాల్లో ఉండడంతో ఒంటరిగా జీవిస్తున్న వృద్ధుల కుటుంబాలను సందర్శిస్తూ వారికి అవసరమైన మందులు సమకూర్చడం, క్లినిక్‌కు తీసుకెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించడం వంటివి చేస్తారు.
అవయవదానం, ఆస్తి వీలునామా రాయడం వంటి పనులతోపాటు ఎవరైనా హఠాత్తుగా మరణిస్తే పార్థివ దేహాన్ని వారి పిల్లలు వచ్చే వరకు భద్రపరచడం వంటి పనుల్లో సబిత పాల్గొంటారు. వీటితోపాటు ఈ బృందంలోని సభ్యులు... మరణించిన వారి ఇంటికి పది రోజుల పాటు భోజనాలు పంపిస్తారు. ఈ వివరాలు చెబుతూ ‘‘ఆనందంగా, సౌకర్యంగా, సంతోషంగా జీవించడానికి మమ్మల్ని మేము సిద్ధం చేసుకుంటుంటాం.
మా చుట్టూ ఉన్న వారిని కూడా ప్రోత్సహిస్తాం. తుదిశ్వాస వరకు మా స్నేహం ఇలాగే ఉంటుంది’’ అని సబిత అంటుంటే... అనూరాధ బాధగా ఆమెను వారిస్తూ ‘‘స్నేహానికి మరణం ఉండదు’’ అన్నారు. స్నేహం అనే కొమ్మకు పూచిన పూలు అలా వికసిస్తూనే ఉంటాయి... ఎప్పటికీ... ఎన్నాళ్లయినా... ఎన్నేళ్లయినా.
- వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి