నిజాం ‘కాలం’లో..
బన్సీలాల్‌పేట్: నిజాం పాలనలో వాచీ అంటే ఖరీదైన వస్తువు కింద లెక్క. సామాన్యులకు చేతి గడియారం పెట్టుకునే స్తోమత ఉండేది కాదు. అయితే, జంట నగరాల ప్రజలు టైం తెలుసుకోవడానికి వీలుగా పలు ప్రధాన రహదారుల్లో నాడు క్లాక్ టవర్లు ఏర్పాటు చేశారు. గడియారాలు అంతగా ప్రాచుర్యం లేని రోజుల్లో ఇవి ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయి. నాటి పాలకులు కళాపోషకులు కావడంతో ఈ క్లాక్ టవర్లను సైతం సుందరంగా నిర్మించారు.
మహబూబ్ చౌక్..
ఇండో-యూరోపియన్ శైలిలో మహబూబ్ చౌక్ మసీదుకు ఎదురుగా 1850లో క్లాక్‌టవర్ నిర్మాణం చేపట్టారు. రెండేళ్ల తర్వాత అంటే 1852లో దీని నిర్మాణం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. సాలార్జంగ్-1 చొరవతో ఈ క్లాక్‌టవర్ నిర్మాణం పూర్తి అయ్యిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ క్లాక్‌టవర్ చుట్టూ చక్కని పార్కును తీర్చిదిద్దారు.
సికింద్రాబాద్ క్లాక్‌టవర్..
బ్రిటీష్ కంటోన్మెంట్ ప్రగతికి చిహ్నంగా 1860లో సికింద్రాబాద్ గార్డెన్ హోటల్ ముందు క్లాక్ టవర్‌ను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యాట్ని వైపు వెళ్లే మార్గంలో ఈ క్లాక్‌టవర్ దర్శనమిస్తుంది. గతంలో తెలంగాణ అమరవీరుల స్థూపం.. క్లాక్‌టవర్ రెండు కలిసి ఎంసీహెచ్ పార్కులో ఉండేవి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా ఆ పార్కును కుదించి మధ్య నుంచి రోడ్డు వేశారు. పచ్చని పచ్చిక మధ్య అహ్లాదకరవాతావరణంలో ఈ క్లాక్‌టవర్ సందర్శకులను ఆకర్షిస్తోంది.
సుల్తాన్‌బజార్ క్లాక్‌టవర్
కోఠిలోని బ్రిటీష్ రెసిడెన్సీ నిర్మాణం పూర్తయ్యాక.. బ్రిటీష్ రెసిడెంట్ అధికారులు 1865లో సుల్తాన్ బజార్ క్లాక్ టవర్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రి సమీపంలో ఈ గడియారం స్తంభం ఉంది.
ఎంజీ రోడ్డు జేమ్స్ స్ట్రీట్‌లో..
ఎంజీ రోడ్డులోని రాంగోపాల్‌పేట్ పోలీసు స్టేషన్ వద్ద 1900 సంవత్సరంలో ప్రముఖ సంఘసేవకుడు, వ్యాపారి అయిన సేఠ్ రాంగోపాల్ మలాని క్లాక్ టవర్‌ను ఏర్పాటు చేశారు. యూరోపియన్ శైలిలో నిర్మితమైన ఈ క్లాక్‌టవర్ ఆరో నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ పాలన కాలంలో ఎంతో శోభాయమానంగా వెలుగొందింది.
ఫతేమైదాన్ క్లాక్‌టవర్
1903లో ఏడో నిజాం ఆస్థానంలోని రక్షణ మంత్రి నవాబ్ జఫర్‌జంగ్ బహదూర్ చేతుల మీదుగా ఫతేమైదాన్ క్లాక్‌టవర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 1904లో నిజాం ప్రభువు ఈ క్లాక్ టవర్‌ను లాంఛనంగా ప్రారంభించారు.