జూలై 16కు ముందే సీడ్ కేపిటల్ డెవలప్మెంట్ ప్లాన్
సింగపూర్ ప్రతినిధుల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 16వ తేదీకి ముందే సీడ్ కేపిటల్ డెవలప్మెంట్ ప్లాన్‌ను సమర్పిస్తామని సింగపూర్ కంపెనీల ప్రతినిధులు రాష్ట్రప్రభుత్వానికి తెలిపారు. ఇప్పటికే కేపిటల్ రీజియన్ మాస్టర్ ప్రణాళికను, కేపిటల్ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. సీడ్ కేపిటల్ ప్లాన్‌పై సింగపూర్ కంపెనీ ప్రతినిధులు సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు.
ప్రధానంగా మున్సిపల్ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి గిరిధర్ అరమానెతో పాటు ఇతర అధికారులను సీడ్ కేపిటల్ ప్రణాళికలో ఏఏ అంశాలు ఉండాలని సింగపూర్ ప్రతినిధులు అడిగి తెలుసుకున్నారు. సీడ్ కేపిటల్లో సచివాలయం, రాజ్‌భవన్, ప్రభుత్వ కార్యాలయాలు, అసెంబ్లీ, ముఖ్యమంత్రి నివాసం, మంత్రుల నివాసగృహాలు తదితర భవనాలపై చర్చకు వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వివరించిన మేరకు సీడ్ కేపిటల్ ప్రణాళికను రూపొందించి వచ్చే నెల 16వ తేదీకి ముందుగానే ప్రభుత్వానికి సమర్పిస్తామని అధికారులకు సింగపూర్ ప్రతినిధులు వివరించారు. దీని తర్వాత ప్రారంభోత్సవ తేదీలు నిర్ణయం, ప్రధాని, రాష్ట్రపతి వంటి వారిని ఆహ్వానించడం చేస్తామని అధికారులు చెబుతున్నారు.