307 బస్తాల సబ్సిడీ వేరుశనగ కాయల సీజ్
రొళ్ల (మడకశిర) : వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీతో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న వేరుశనగ విత్తన కాయలను దళారులు అక్రమంగా నిల్వ చేసుకున్నట్లు అందిన సమాచారంతో విజిలెన్స్ అధికారులు బుధవారం రాత్రి దాడి చేశారు. 307 బస్తాల కాయలను సీజ్ చేశారు. విజిలెన్స్ ఎస్పీ అనిల్‌బాబు ఆదేశాల మేరకు రొళ్ల మండలం హెచ్ఎంపల్లిలో ఓ వ్యాపారి రెండు ఇళ్లలో సబ్సిడీ వేరుశనగకాయలు నిల్వ చేసినట్లు సమాచారం అందిన వెంటనే విజిలెన్స్ సీఐ రెడ్డప్ప తమ సిబ్బందితో కలసి దాడి చేశారు.
రూ.7.91 లక్షల విలువ చేసే 307 బస్తాల విత్తన కాయలను సీజ్ చేశారు. పంచనామా అనంతరం వాటిని ఏఓ అబ్దుల్ ఆలీకి అప్పగించారు. విజిలెన్స్ ఏఓ ఉమాపతి, హెడ్‌కానిస్టేబుల్ చిరంజీవి, వీఆర్ఏలు అశ్వర్థప్ప, రంగనాథ్ పాల్గొన్నారు. కాగా పైన పట్టుకున్న వేరుశనగ బస్తాల గురించి జాయింట్ కలెక్టర్‌కు నివేదించనున్నట్లు ఏఓ తెలిపారు.