విత్తనంపై విముఖత
– జాడలేని వర్షం, చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితులు
– వీటికి తోడు నాసిరకం, అరకొర రాయితీ కారణం
అనంతపురం అగ్రికల్చర్ : రాయితీ విత్తనంపై ‘అనంత’ రైతులు అనాసక్తి చూపుతున్నారు. గత నాలుగు రోజుల విత్తన వేరుశనగ పంపిణీ సరళిని విశ్లేషిస్తే రైతుల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. 10 నుంచి 15 మండలాల్లో పంపిణీ బాగానే ఉన్నా మిగతా మండలాల్లో కౌంటర్లు బోసిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అందులోనూ 10 మండలాల్లో పంపిణీ నామకేవాస్తే అన్నట్లుగా కొనసాగుతోంది. జిల్లాకు కేటాయించిన 4.01 లక్షల క్వింటాళ్లలో ఏపీ సీడ్స్, ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్, ఎన్ఎస్సీ, వాసన్ సంస్థల ద్వారా 3.78 లక్షల క్వింటాళ్లు 63 మండలాల్లో నిల్వ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కే–6 రకం క్వింటాల్ పూర్తి ధర రూ.7,700 కాగా అందులో 40 శాతం రాయితీ రూ.3,080 పోనూ రైతు వాటాగా రూ.4,620గా నిర్ణయించి గరిష్టంగా ఒక్కో రైతుకు 4 బస్తాలు (120 కిలోలు) ఇస్తున్నారు. గతంలో గరిష్టంగా మూడు బస్తాలు (90 కిలోలు) ఇచ్చేవారు. ఈ సారి ఒక బస్తా అదనంగా పెంచినా... పంపిణీలో విత్తనకాయ తీసుకునేందుకు రైతులు పెద్దగా ముందుకు రాకపోవడం విశేషం.
కౌంటర్లు వెలవెల
ఈనెల 24న జిల్లావ్యాప్తంగా విత్తన వేరుశనగ పంపిణీ ప్రారంభించారు. తొలిరోజు 2,335 క్వింటాళ్లు, రెండో రోజు 12,452 క్వింటాళ్లు, మూడో రోజు 16,820 క్వింటాళ్లు. నాలుగో రోజు 19,977 క్వింటాళ్లు... మొత్తం 51,585 క్వింటాళ్లు రైతులకు పంపిణీ చేశారు. రోజుకు 15 వేలు, 16 వేలు క్వింటాళ్లు ఇస్తే 4.01 లక్షలు క్వింటాళ్లు పూర్తీ కావడానికి దాదాపు నెల రోజులు పట్టే అవకాశం ఉంది. కానీ.. నెల రోజుల పాటు పంపిణీ కొనసాగించే పరిస్థితి లేదు. 10 నుంచి 12 రోజుల పాటు పంపిణీ చేసి ముగించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. గత మూడు రోజుల పంపిణీ విషయానికి వస్తే... తలుపుల మండలంలో అతి తక్కువగా కేవలం 45 క్వింటాళ్లు అమ్ముడుబోయాయి. పుట్లూరులో 53 క్వింటాళ్లు, గాండ్లపెంటలో 59 క్వింటాళ్లు, హిందూపురంలో 65 క్వింటాళ్లు, ఎన్పీ కుంటలో 83 క్వింటాళ్లు, బెళుగుప్పలో 98 క్వింటాళ్లు మాత్రమే పంపిణీ జరిగింది. కళ్యాణదుర్గం, వజ్రకరూరు, బెళుగుప్ప, కంబదూరు, రామగిరి, సీకే పల్లి, రొద్దం లాంటి మండలాల్లో వేరుశనగ పంట విస్తీర్ణం ఎక్కువగా ఉన్నా విత్తన పంపిణీలో అంతంత మాత్రంగానే ఉండటం విశేషం.
చేతిలో చిల్లిగవ్వ లేక..
వేరుశనగ విత్తన కౌంటర్లు వెలవెలబోవడానికి ప్రధాన కారణంగా రైతుల చేతుల్లో చిల్లిగవ్వ లేకపోవడమేననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గత ఖరీఫ్‌కు సంబంధించి ప్రీమియం కట్టినా ఇప్పటికీ వాతావరణ బీమా (ఇన్సూరెన్స్) కింద రూ.434 కోట్లు పరిహారం మంజూరు కాకపోవడం, రూ.1,023 కోట్లు పెట్టుబడిరాయితీ (ఇన్‌పుట్‌సబ్సిడీ) ఇవ్వకపోవడం, రెన్యువల్స్ మినహా కొత్తగా పంట రుణాలు అందకపోవడం, మూడో విడతకు సంబంధించి రూ.416 కోట్లు రుణమాఫీ సొమ్ము విడుదల కాకపోవడంతో రైతులు ఆర్థికంగా కుదేలయ్యారు. వరుణుడు జాడ లేక జిల్లా అంతటా ఇప్పటికీ తొలకర్లు పడకపోవడంతో ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధం కాని పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా రాయితీ ధరలు, బయట లభిస్తున్న విత్తన ధరల మధ్య పెద్దగా వ్యత్యాసం లేకపోవడం, ప్రభుత్వం ఇస్తున్న విత్తనం నాసిరకంగా ఉండటం వల్ల విత్తనంపై రైతులు అనాసక్తి ప్రదర్శిస్తున్నట్లు చెబుతున్నారు.
వంద శాతం సర్టిఫైడ్ సీడ్ అంటున్నా... విత్తనకాయలో నాసులు, పుల్లలు, రాళ్లు, రప్పలు, కల్తీ కాయలు ఉండటంతో చాలా మండలాల్లో నాణ్యతపై రైతులు పెదవి విరుస్తున్నారు. వీటితో పాటు గతంలో టీఎంవీ–2, జేఎల్–24, పొలాచీ, నారాయణి, ఐసీజీవీ–91114, ధరణి, కే–6, కే–9... తదితర రైతులకు అవసరమైన మరికొన్ని రకాలు ఇస్తుండటంతో కొంత వెసులుబాటు ఉండేది. కానీ... ఈ సారి కేవలం కే–6 రకానికి పరిమితం కావడంతో అది కూడా ఓ కారణంగా విశ్లేషిస్తున్నారు. ఇప్పటికీ కొన్ని మండలాల్లో టీఎంవీ–2, కే–9, ధరణి, నారాయణి లాంటి కొన్ని రకాలు కావాలంటున్నా వ్యవసాయశాఖ అధికారులు వాటిని ఇవ్వలేని పరిస్థితి ఉండటంతో విత్తన పంపిణీ అంతంత మాత్రంగానే కొనసాగుతోంది.