September 17
-
సెప్టెంబర్ 17.. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం
హైదరాబాద్, సాక్షి: సెప్టెంబర్ 17పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజున తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 17రోజున తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాను ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాలని పేర్కొంది. జిల్లాల్లో జెండా ఆవిష్కరణ చేసే ప్రజాప్రతినిధుల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది.గత బీఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినోత్సవంగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్లో అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించింది. చదవండి: అణచివేతపై సాయుధ పోరాటం!చదవండి: నలువైపులా ముట్టడి.. ‘ఆపరేషన్ పోలో’ పేరిట భారత ఆర్మీ సైనిక చర్యచదవండి: అవును... చరిత్ర వక్రీకరణ మహానేరం! -
అమిత్ షాతో కిషన్ రెడ్డి, బండి సంజయ్ భేటీ
Updates.. ► తెలంగాణలో పార్టీ కార్యవర్గంపై అమిత్ షా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పార్టీలో కోఆర్డినేషన్‌పై పలు అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో అమిత్ షా చర్చించినట్లు సమాచారం. అందరినీ కలుపుకుని పోవాలని నాయకులకు సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్‌తో భేటీ అయ్యారు. ► కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షులు బండి సంజయ్‌లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కొన్ని రోజుల క్రితం వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేలు తెలంగాణ నియోజకవర్గాల్లో పర్యటించి సమర్పించిన నివేదికలపై ప్రస్తుతం జరిగిన భేటీలో చర్చించారు. తెలంగాణ నియోజకవర్గాల్లో పార్టీ బలబలాలపై వివిధ రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు గతంలో సంచరించి ఓ నివేదికను రాష్ట్ర అధిష్ఠానానికి సమర్పించిన విషయం తెలిసిందే. ► అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట యోధులకు వందనాలు. ఉస్మానియాలో వందేమాతం పేరుతో ఆందోళనలు జరిగాయి. పటేల్ లేకుంటే తెలంగాణకు విమోచనం కలిగేది కాదు. తెలంగాణ ప్రజలపై జనరల్ డయ్యర్ బుల్లెట్ల వర్షం కురిపించారు. రజాకార్ల అరాచకాలకు పరకాల సజీవసాక్ష్యంగా నిలుస్తుంది. పరకాలలో అనేక మంది అమరులయ్యారు. తెలంగాణ చరిత్రను 75ఏళ్ల పాటు వక్రీకరించారు. ► చంద్రయాన్-3 విజయంతో భారత్‌కు అంతర్జాతీయ కీర్తి. డిజిటల్ రంగంలో భారత్ దూసుకుపోతోంది. స్వాతంత్ర్య పోరాటాన్ని కూడా కాంగ్రెస్ వక్రీకరించింది. మోదీ ప్రధాని అయ్యాక ఆ పొరపాటును సవరించాం. ఈరోజు మోదీ పుట్టినరోజు సేవాదివస్గా జరుపుకుంటున్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపలేదు. ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసమే విమోచన దినోత్సవాన్ని వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారు. విమోచనంపై రాజకీయం చేసేవారిని ప్రజలు క్షమించరు. సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినోత్సవం జరిపించడానికి కారణాలున్నాయి. భవిష్యత్ తరాలకు నాటి పోరాటయోధులను గుర్తుచేయడం, పోరాట యోధులను సన్మానించడమే అని అన్నారు. ► పారామిలటరీ బలగాల గౌరవవందనం స్వీకరించిన అమిత్ షా. ► సర్ధార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళులర్పించిన అమిత్ షా. ► జాతీయ జెండా ఎగురవేసిన అమిత్ షా. ► వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పించిన అమిత్ షా. ► తెలంగాణ సాయుధ పోరాట వీరులకు అమిత్ షా నివాళులు అర్పించారు. అనంతరం, గౌరవ వందనం స్వీకరించారు. ► కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. ► పరేడ్ గ్రౌండ్ చుట్టూ సీఆర్పీఎఫ్ బలగాలు మోహరించాయి. ► తెలంగాణ బీజేపీ ఆఫీసులో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి.. ఆదివారం ఉదయం పార్టీ ఆఫీసులో జాతీయ జెండాను ఎగురవేశారు. ► ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు రాష్ట్ర విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ.. ప్రతీ ఏడాది పార్టీ ఆఫీసుల్లో వేడుకలను నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్, బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేస్తోందన్నారు. నిజాం సైన్యం అనేక మందిని ఊచకోత కోసింది. తెలంగాణకు 13 నెలలు స్వాతంత్ర్యం ఆలస్యంగా వచ్చింది. ఎంతో మంది బలిదానంతో తెలంగాణకు స్వేచ్చ లభించింది. ► తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ► ఆదివారం పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాల నేపథ్యంలో పోలీసు విభాగం గతానికి భిన్నంగా పటిష్ట బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తోంది. ► ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అటు పరేడ్ గ్రౌండ్, ఇటు పబ్లిక్ గార్డెన్స్ కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా తీసుకుంటున్న చర్యలను నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్, నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌ను శనివారం నాటికే పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ► ప్రత్యేక బాంబు నిర్వీర్య బృందాలతో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతల విభాగంతో పాటు టాస్క్‌ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, సీఏఆర్ విభాగాలు, సాయుధ బలగాలు బందోబస్తులో పాల్గొంటున్నాయి. మొత్తమ్మీద దాదాపు 2500 మంది సిబ్బందిని రెండు చోట్ల మోహరిస్తున్నారు. -
Sep 17: అటు సోనియా.. ఇటు అమిత్ షా?
సాక్షి, హైదరాబాద్: ఈసారి సెప్టెంబర్ 17వ తేదీ.. తెలంగాణ రాజకీయాలు జాతీయస్థాయిలో చర్చకు కేంద్ర బిందువు కానుంది. కాంగ్రెస్-బీజేపీలు పోటాపోటీ బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ తుక్కుగూడలో.. బీజేపీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో పెద్ద ఎత్తున జనంతో సభలు నిర్వహించాలని ప్రయత్నిస్తున్నాయి. తుక్కుగూడ సభకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ హాజరవుతారని పార్టీ ప్రకటించగా.. పరేడ్‌గ్రౌండ్‌లో విమోచన దినోత్సవ వేడుకలకు కిందటి ఏడాదిలాగే అమిత్ షా హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నెల 17వ తేదీన కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. పది లక్షల మంది ఈ సభకు హాజరు అవుతారని కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే ప్రకటించింది. తుక్కుగూడను అందుకు వేదికగా ఎంచుకుంది. ఆ తేదీ, అంతకు ముందు రోజు నగరంలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగబోతున్నాయి. సోనియా గాంధీ సైతం తుక్కుగూడ సభకు హాజరు కానున్న నేపథ్యంలో.. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది తెలంగాణ పీసీసీ. అయితే.. కాంగ్రెస్ తుక్కుగూడ సభకు పోటీగా బీజేపీ సైతం నగరంలో సభను ప్లాన్ చేసింది. పరేడ్ గ్రౌండ్‌లోనే తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలను కిందటి ఏడాది తరహాలోనే కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించాలని.. ఈ క్రమంలో భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. వీలైనంత ఎక్కువ జనసమీకరణ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకేరోజు.. అదీ తెలంగాణ విమోచన దినోత్సవం. ఈ దినం రాగానే హైదరాబాద్ నగరంలో పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీ కార్యక్రమాలకు పోటీ పడుతుండడం.. రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇరు పార్టీలు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకుంటాయనేది ఊహించిందే అయినప్పటికీ.. పరస్పర విమర్శలు ఏ స్థాయిలో ఉంటాయనేది చర్చనీయాంశంగా మారిందిప్పుడు. ఇదీ చదవండి: ఎటూ తేలలేదు.. 100 సీట్లలో ఒక్కో పేరే! -
మునుగోడు కోసమే ‘విమోచన’
తెలంగాణలో సెప్టెంబర్ 17 అన్నది విలీనమా, విమోచనా, విద్రోహమా లేక విద్వేషమా అనే వాదనను పక్కన పెడితే, ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన కనీస చారిత్రక అంశాలు కొన్ని ఉన్నాయి. అసఫ్ జాహీ వంశస్థులు మొఘల్ పాలన నుంచి విడిపోయి, నిజాం పాలకులుగా (1724–1948) పేరొందారు. నిజాంలు మత ప్రాతిపదికన ఏలినవారు కాదు, స్వతంత్రులూ కారు. ‘ట్రియటీ ఆఫ్ సబ్సిడియరీ అలయెన్స్’ పేరిట, 1800లో బ్రిటిష్ వారికి అధీనులుగా ఒప్పందం చేసుకొన్న అనేక మంది హిందూ రాజుల వంటివారే. తెలంగాణలో నిజాం వ్యతిరేక పోరాటం ఉద్ధృతంగా ఉన్న సమయంలో కూడా హిందూ ఫ్యూడల్స్ నిజాం మంత్రులుగా పనిచేశారు. వారిలో అత్యధికులు కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత కూడా పోలీసు చర్య జరిగే వరకూ కాంగ్రెస్ టోపీలు పెట్టు కోలేదు! విలీన చర్చల్లోనూ హిందూ సలహాదారులు నిజాం పక్షానే ఉన్నారు. ఆ చర్చల్లో కేంద్రం పక్షాన, నిజాం తరఫున ఇరు వైపులా బ్రిటిషువారే ఉన్నారు. పటేలుకు 1948 మార్చిలో గుండెపోటు రావడం వల్ల ఎక్కువగా మౌంటుబాటెనే కీలక సమావేశాల్లో పాల్గొ న్నారని విలీన వ్యవహారాల కార్యదర్శి, పటేలు కుడిభుజం అయిన వీపీ మీనన్ తన పుస్తకంలో రాశారు. నిజాం పాలన కానీ, విలీన వ్యతిరేకత కానీ, ఆ మాట కొస్తే నిజాం వ్యతిరేక ప్రతిఘటన కానీ ఏవీ మతం ఆధారంగా లేవు. రజాకార్లు కూడా నిజాం పాలన మొదటి నుంచీ లేరు. తర్వాతి దశలో 1938లో ఏర్పడిన ‘వాలంటీర్ల’ సంస్థకు చెందినవారు. ఆ సంస్థ 1947 తర్వాతే కిరాయి ప్రైవేటు సైన్యంలా దౌర్జన్యకర పాత్ర నిర్వహిం చింది. 1915లోనే ఏర్పడిన హిందూ మహాసభ గానీ, 1925లో ఆవిర్భవించిన ఆరెస్సెస్ గానీ నిర్వహించిన నిజాం వ్యతిరేక పాత్ర అక్షరాలా సున్నా. నిజాం నిరంకు శత్వం నుండి తెలంగాణను పటేల్ విముక్తి చేశారనీ, నెహ్రూ ముస్లిం పాలకుడి పట్ల మెతకగా ఉన్నారనీ అసత్య ప్రచారాలు మాత్రం జరిగాయి. నిజాంని 1947 ఆగస్టు తర్వాత కూడా ఏడాదిపాటు కొనసాగించటానికి యథా తథ స్థితి ఒప్పందం చేసుకొన్నది నెహ్రూ, పటేల్‌లతో కూడిన నాయకత్వమే. ఆ విషయంలో వారి మధ్య విభేదాల్లేవు. పటేలు మరణించిన 1950 చివర్లో, ఆ తర్వాత 1951 చివరి దాకా మిలిటరీ తెలంగాణలో స్వైర విహారం చేసింది. దానివల్ల నాలుగు వేల మంది రైతాంగ కార్యకర్తలు హతులయ్యారు. లక్షమంది జైళ్ల పాలయ్యారు. అలా చూస్తే ఇది రైతాంగ విప్లవం నుంచి ఫ్యూడల్ రాజు నిజాంకు లభించిన విమోచన తప్ప వేరేమీ కాదు. (క్లిక్ చేయండి: బీఆర్ఎస్ అంటే ఏంది?) ఈ ఏడాది సెప్టెంబర్ పదిహేడు... 75 ఏళ్ల చారిత్రక ఘట్టమే. మరి ఉత్సవాలను నిర్వహించాలని ముందే నిర్ణయం ఎందుకు తీసుకోలేదు? మొన్నటి జూలైలో బీజేపీ అఖిలభారత సమావేశం హైదరాబాదులో జరిగినప్పుడు, ఆ తర్వాత ఆగస్టు 15న కానీ తీసుకోలేదు. సెప్టెంబరు 3న హడావుడిగా తీసుకున్నారు. ఆనాడు లేనిదీ, నేడున్నదీ మునుగోడు ఎన్నిక! ఇదంతా బీజేపీ దేశభక్తి కాదు, 2023 తెలంగాణ ఎన్నికల్లో ముక్తి కోసమే. దానికి మునుగోడు అసెంబ్లీ ఎన్నిక రిహార్సల్. ప్రజలు గమనించకుండా ఉంటారా! – సీహెచ్.ఎస్.ఎన్. మూర్తి ఎఫ్ఐటీయూ ప్రధాన కార్యదర్శి -
అవును... చరిత్ర వక్రీకరణ మహానేరం!
‘చరిత్ర వక్రీకరణ మహానేరం’ పేరిట సెప్టెంబర్ 22 నాటి మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసాన్ని చదివిన తరువాత వక్రీకరణ వాస్తవంగా ఎక్కడ, ఎలా మొదలౌతుందో అర్థమైంది. దేశ విభజనానంతరం సంస్థానాల విలీనం విషయంలో ఒక అబద్ధం ప్రచారమౌతోంది. సంస్థానాధీశులకు భారత్‌లో కలిసేందుకు, లేదా పాకిస్తాన్లో కలిసేందుకు, లేదా స్వతం త్రంగా ఉండేందుకు బ్రిటిషర్లు అధికారాన్ని కల్పించారనేది అబద్ధం. బ్రిటిష్ ప్రభుత్వం వారికి భారత్ లేదా పాకిస్తాన్లో విలీనమయ్యే అవకాశాన్ని మాత్రమే కల్పించింది. స్వతంత్రంగా ఉండేలా మూడో ఆప్షన్ లేదు. అలా ఉన్నట్టయితే దయతో తదనుగుణమైన బ్రిటిష్ ప్రభుత్వ డాక్యుమెంట్లను చూపించాలి (ఏ ఆధారమూ చూపని కొన్ని ఇంగ్లీషు పుస్తకాలను కోట్ చేస్తే సరిపోదని సవినయ మనవి). బ్రిటిషర్లు విలీనానికి మతంతో కూడా ముడిపెట్టలేదు. ప్రిన్సిపుల్ ఆఫ్ కంటిగ్యుటీ (సామీప్యతా సూత్రం) అంటే భారత్ సమీపంగా ఉంటే భారత్‌లో, పాకిస్తాన్ సమీపంలో ఉంటే పాకిస్తాన్లో ఉండేలా నిర్ణయం తీసుకోవచ్చు. దీని ప్రకారం హిందూ జనాభా అధికంగా ఉండి, హిందూ రాజు ఉన్న రాజస్థాన్‌లోని అమర్ కోట్ సంస్థానం పాకిస్తాన్లో చేరింది. కశ్మీర్ తప్ప మిగతా సంస్థానాధీశులు వారు కోరుకున్నా పాకిస్తాన్లో విలీనం కాలేరు. కాబట్టి భారతదేశం లోపల ఉండే హైదరాబాద్ స్వతంత్రంగా ఉండే ఆప్షన్ లేనే లేదన్నది స్పష్టం. మౌంట్ బాటన్ స్వయంగా ఈ విషయాన్ని నిజాంకి, ఆయన ప్రతినిధులైన వాల్టర్ మాంక్టన్, నవాబ్ ఆఫ్ ఛత్తారీలకు పలుసార్లు స్పష్టం చేశాడన్నది చారిత్రక వాస్తవం. నిజాం చేసుకున్న యథాతథస్థితి ఒప్పందం (స్టాండ్ స్టిల్ ఒప్పందం) కూడా స్వతంత్రంగా ఉండేందుకు కాదు. విలీనాన్ని ఒక సంవత్సరం జాప్యం చేసేందుకే. పాకిస్తాన్ అన్న ఆలోచనను బ్రిటిషర్ల సహకారంతో 1930వ దశకంలో సృష్టించిన చౌధురీ రహమత్ అలీ భారత్‌లో మూడు ముస్లిందేశాలు ఉండాలని ప్రతిపాదించాడన్నది మరిచిపోరాదు. మొదటిది పాకిస్తాన్. రెండవది నేటి బంగ్లాదేశ్. దానిని బంగిస్తాన్ అన్నాడు. మూడవది ఉస్మానిస్తాన్. అంటే హైదరాబాద్. ఉస్మానిస్తాన్ ఆలోచన వెనుక దాగున్న మతోన్మాద సూత్రాన్ని మరిచిపోరాదు. పాశ్చాత్య కూటమిలో చేరకూడదన్న భారత నేతల నిబద్ధతాపూర్వకమైన నిర్ణయం వల్లే బ్రిటిషర్లు భారత్‌ను దిగ్బంధనం చేసేందుకు పశ్చిమాన పాకిస్తాన్, తూర్పున తూర్పు పాకిస్తాన్ (తరువాత బంగ్లాదేశ్), ఉత్తరాన ముస్లిం జనాధిక్య జమ్మూ కశ్మీర్ సంస్థానం, దక్షిణాన ఉస్మానిస్తాన్ ఏర్పాటయ్యేలా ప్రయత్నించారు. హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉండాలన్న నిజాం కుట్రలకు ఫ్రాన్స్, అమె రికా, కొలంబియా, కెనడా, సిరియా, బెల్జియం, అర్జెంటీనా వంటి పాశ్చాత్య కూటమి దేశాలు అందుకే సమర్థించాయి. రష్యా, చైనా, యుక్రేన్ వంటి కమ్యూనిస్టు దేశాలు భారత అలీన విధానాన్ని సమర్థించి, ఈ సామ్రాజ్యవాద యత్నానికి పురిట్లో సంధికొట్టాయి. లక్ష్మయ్య సర్వసాధారణ కమ్యూనిస్టులందరిలాగానే జన్నారెడ్డి ప్రతాపరెడ్డి, విసునూరు రామచంద్రారెడ్డిలను ప్రస్తావించారు. కానీ జటప్రోలు, రెంటచింతల, గద్వాల, కొల్లాపూర్, వనపర్తి, పాల్వంచ, సంస్థాన్ నారాయణపూర్ వంటి ఉప సంస్థానాల్లో విస్నూరు, మానుకోటల్లో లాగా ఎందుకు తిరుగుబాటు రాలేదో ప్రస్తావించలేదు. ఆదిలా బాద్, నిజామాబాద్, జహీరాబాద్, మహబూబ్ నగర్ వంటి తెలంగాణ జిల్లాల్లో, ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో అంతర్భాగంగా ఉన్న మరాఠ్వాడా ప్రాంతాలైన బీడ్, పర్భనీ, నాందేడ్, లాతూర్, ఉస్మానాబాద్‌లలో, కళ్యాణ కర్ణాటక లోని బీదర్, రాయచూర్, గుల్బర్గాలలో సంస్థానాధీశులు లేరా? కొంత నల్గొండ, కొంత వరంగల్, కాసింత రంగారెడ్డి జిల్లాకి మాత్రమే ప్రధానంగా పరిమితమైన కమ్యూనిస్టుల పోరాటం ఈ మరాఠ్వాడా, హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాల్లో ఎందుకు విస్తరించలేదు? మల్లె్లపల్లి లక్ష్మయ్య కన్వీనియంట్‌గా ప్రస్తావించని మరో విషయం ఉంది. ఘనత వహించిన నిజాం ప్రభువు 1943లో కమ్యూనిస్టులపై నిషేధాన్ని ఎందుకు ఎత్తివేశారు? దాశరథి రంగాచార్య తన ‘జీవన యానం’లో, వందేమాతరం రామచంద్రరావు తన ‘హైదరాబాద్‌పై పోలీసు చర్య’లో సెప్టెంబర్ 17 తరువాత రజాకార్ల ఆయుధాలన్నీ కమ్యూనిస్టుల చేతికి చేరాయని రాశారు. కమ్యూనిస్టులు దీనిని ఎందుకు ఖండించరు? సెప్టెంబర్ 17, 1948 తరువాత 1951 వరకూ కమ్యూనిస్టులు ఎవరిపై సాయుధ పోరాటం చేశారు? లేని నిజాంపైనా? ఉన్న భారత ప్రభుత్వం పైనా? భారత సేనలు అన్న పదానికి బదులు ‘యూనియన్ సేనలు’ అనే పదాన్ని ఉపయోగించి భారత వ్యతిరేక పోరాటానికి ఎందుకు రంగులద్దుతున్నారు? రావి నారాయణ రెడ్డి ఈ సాయుధ పోరాటాన్ని వ్యతిరేకించారు. ప్రజలు భారత ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నా దానిపై పోరాటం చేయడం సరైనది కాదని చెప్పారు. సుందరయ్య–బసవపున్నయ్య–చండ్ర రాజేశ్వర త్రయం దానిని తోసిపుచ్చారు. ఈ మొత్తం ఉదంతాన్ని చాపకిందకి తోసి, సగం చరిత్ర చెప్పడానికి కారణమేమిటి? హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉండాలన్నది కమ్యూనిస్టుల లక్ష్యం. 1948–1951 వరకూ భారత్‌పై కమ్యూనిస్టులు పోరాడి, భారత ప్రభుత్వం పంపిన రాయబారి ద్వారకానాథ్ కాచ్రూను కలవడానికి నిరాకరించి, ఆ తరువాత 1952లో ఎలాంటి గ్యారంటీలూ పొందకుండానే, ఏమీ సాధించకుండానే మూడేళ్ల రక్తసిక్త పోరాటం ఆపి, ఎన్నికల్లో పాల్గొని తగుదునమ్మా అంటూ ఎంపీలు అయ్యారు. మరో అవాస్తవం సుందర్ లాల్ కమిటీ గురించి. దానిని భారత ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, నిజాం ప్రభువు కానీ నియమించలేదు. అది నెహ్రూ వ్యక్తిగతంగా పంపిన సుహృద్భావ ప్రతినిధి బృందం. పండిత్ సుందర్ లాల్, కాజీ మహ్మద్ అబ్దుల్ గఫార్లతో కూడిన ఈ బృందం ముస్లింలను కలిసి, భారత ప్రభుత్వం వారిని ఇబ్బంది పెట్టబోదని నమ్మకం కలిగించింది. (క్లిక్ చేయండి: పుస్తక ప్రచురణపైనా పెత్తనమేనా?) వాస్తవానికి హైదరాబాద్ సంస్థాన చరిత్రను మూడు వేర్వేరు ముక్కలుగా చదువుతున్నాం. కర్ణాటకలోని మూడు జిల్లాలు, మరాఠ్వాడాలోని జిల్లాల చరిత్రను తెలంగాణ చరిత్రతో కలిపి చదివితేనే సమగ్రత వస్తుంది. లేని పక్షంలో గుడ్డివాళ్లు ఏనుగుని వర్ణించినట్టు చదవడం జరుగుతుంది. అలా చేసినంత కాలమూ రెండు మూడు జిల్లాల చరిత్రనే మొత్తం 82 వేల చ.కి.మీ. వైశాల్యమున్న, కోటికి పైగా జనాభా ఉన్న, 17 జిల్లాలున్న సువిస్తృత సంస్థాన చరిత్రగా లక్ష్మయ్య గారు భ్రమించినట్టు భ్రమించడం జరుగుతుంది. (క్లిక్ చేయండి: చరిత్రను కాటేయ జూస్తున్నారు!) - కస్తూరి రాకా సుధాకర రావు సీనియర్ జర్నలిస్ట్ -
చల్నేదో బాల్ కిషన్
కతలు జెప్తున్నరు. చెవుల పూలు బెడ్తున్నరు. చెట్టు పేరు జెప్పి కాయలమ్ము కుంటున్నరు. కాయలను గాదు. ఏక్ దమ్ పండ్లనే అమ్ముకుంటున్నరు. ఎవలమ్ముకుంటున్నరు? ఎందు కమ్ముకుంటున్నరు? ఎవరంటె మన లీడర్లే. ఇంతకు గా చెట్టేంది? గది ఏందో గాదు. నిజాం చేత్లకెల్లి గుంజుకొన్న తెలంగాననే. బందూకులు బట్కోని రజాకార్ల తోని కొట్లాడినోల్ల గురించి మొన్నటిదాంక తప్పిజారి ఒక్క లీడర్ గుడ్క మాట్లాడలే. గియ్యాల గా లీడర్లే తీస్ మార్ కాన్ లెక్క ఫోజు గొడ్తున్నరు. గాల్లే నిజాం సర్కార్‌ను కూలగొట్టి తెలంగానకు సతంత్రం తెచ్చినట్లు మాట్లాడ్తున్నరు. గా దినం అయితారం. అంబటాల్లయింది. కడ్పులు ఎల్కలు చెంగడ బింగడ దుంకుతున్నయి. తలె ముంగట గూసున్న. కోడికూర తోని నా పెండ్లాం బువ్వ బెట్టింది. అంచుకు ఎల్లిగడ్డతొక్కు ఏసింది. సరింగ గప్పుడే మా తాత బోన్గిరి కెల్లి వొచ్చిండు. గాయిన పెండెం వాసుదేవ్, జైని మల్లయ్య గుప్త, గుండా కేశవులు, ముత్యం ప్రకాశ్, మాదాసు యాదగిరి అసువంటోల్లతోని గల్సి బందూకు బట్టి రజాకార్లతోని కొట్లాడినోడు. ‘‘తాతా! బువ్వ తిందురాయె’’ అన్న. గాయిన కాల్లు చేతులు గడుక్కోని నా పక్క పొంటి వొచ్చి గూసున్నడు. బువ్వ దినుకుంట ముచ్చట బెట్ట బట్టిండు. ‘‘ఇంతకుముందు టీఆర్ఎస్ మోటర్ బోయిన తొవ్వ మీదికెల్లే కడ్మ పార్టీలు బొయ్యేటియి. గని గిప్పుడు బీజేపీ ఏసిన తొవ్వ మీది కెల్లే టీఆర్ఎస్ మోటార్ బొయ్యే గతి బట్టింది’’ అని అన్నడు. ‘‘తాతా! నువ్వెప్పుడు రాజకీయాలే మాట్లాడ్తవేందే’’ ‘‘రాజకీయాలు గానిదేమన్న ఉన్నాదిర. బారతం రాజకీయమే. రామాయనం గూడ రాజకీయమే’’. ‘‘రామాయనం రాజకీయమెట్ల అయితదే?’’ ‘‘రాముని దిక్కు దుంకె బట్కె విబీషనుడు లంకకు రాజయిండు. నిజం జెప్పాలంటె పార్టీ ఫిరాయింపులు గాయినతోనే షురువైనయి’’ ‘‘బీజేపీ ఏసిన తొవ్వ మీదికెల్లే టీఆర్ఎస్ మోటర్ బోయిందంటివి. గదేందో జెర కుల్లకుల్ల జెప్పు తాతా’’ ‘‘మొన్న 17 తారీకు పరేడ్ మైదాన్ల సెంటర్ల ఉన్న బీజేపీ సర్కార్ తెలంగాన విమోచన దినం జేసింది. గా దాన్కి సెంటర్ హోం మంత్రి అమిత్ షా వొచ్చిండు. ‘మా సర్కారొస్తె సెప్టెంబర్ 17 తారీకు నాడు తెలంగాన విమోచన దినం జేస్తమన్నోల్లు గాల్ల సర్కారొచ్చినంక రజాకార్ల బయంతోని తెలంగాన విమోచన దినం జెయ్యలేదు. గియ్యాల మేము జేస్తుంటె అన్ని పార్టీలు జేస్తున్నయి’ అన్కుంట గాయిన స్పీచ్ గొట్టిండు’’. ‘‘ఇంతకుముందు కేసీఆర్ తెలంగాన విమోచన దినం ఎందుకు జెయ్యలేదు?’’ ‘‘విమోచన గాదు, మన్నుగాదు. గది జేస్తేంది, చెయ్యకుంటేంది. గదొక పెద్ద ఎజెండనా? గది జెయ్యకుంటె గీ దేసం ఏమన్న మున్గుతదా అని అసెంబ్లీల అన్న కేసీఆర్ ఇయ్యాల బీజేపీ సెట్ జేసిన ఎజెండలకే వొచ్చిండు. సమైక్యత వజ్రోత్సవం అన్కుంట కేసీఆర్ 17 తారీకు పబ్లిక్ గార్డెన్ల మూడు రంగుల జెండ ఎగిరేసిండు. ‘మత పిచ్చిగాల్లు దేసంను ఆగమాగం జేస్తున్నరు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తం. దలిత బందు తీర్గనే గిరిజన బందు బెట్టి ఒక్కో గిరిజన కుటుంబానికి పది లచ్చల రూపాయల వొంతున ఇస్తం’ అన్కుంట కేసీఆర్ స్పీచ్ గొట్టిండు’’ అని మా తాత జెప్పిండు. ‘‘హుజూరాబాద్ బై ఎలచ్చన్లు వొచ్చినప్పుడు దలిత బందు అన్నడు. మునుగోడు బై ఎలచ్చన్లు రాంగనే గియ్యాల గిరిజన బందు అంటున్నడు తాతా!’’ ‘‘అవ్ ఎలచ్చన్లు వొస్తేనే ముక్యమంత్రికి జెనం యాది కొస్తరురా’’ (క్లిక్: గటు దిక్కు బోవద్దు గన్పతీ!) ‘‘అమిత్ షాను బీజేపోల్లు అబినవ సర్దార్ పటేల్ అంటె, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కెసీఆర్‌ను అబినవ అంబేడ్కర్ అని అంటున్నడే’’ ‘‘వారీ! ఎల్క తోలును ఒక్క తీర్గ యాడాది ఉత్కితె యాడనన్న తెల్లగైతదా? అమిత్ షా సర్దార్ వల్లభాయ్ పటేలైతడా? కేసీఆర్ యాడనన్న అంబేడ్కర్ అయితడా?’’ అని మా తాత అడిగిండు. బువ్వ దిన్నంక గాయిన మంచం మీద ఒరిగిండు. (క్లిక్: బాలకిష్న ముక్యమంత్రి అయితడు.. పాదయాత్రలు మనకెంద్కు బిడ్డా) తోక: పొద్దు మీకింది. ఎప్పటి లెక్కనే చౌరస్తల ఉన్న పాన్ డబ్బకాడ్కి బోయిన. గాడ పాన్లు దినుకుంట మా దోస్తులు ముచ్చట బెడ్తున్నరు. ‘‘నమీబియాకెల్లి గాలిమోటర్ల ఎన్మిది చిర్తపులులను మనదేసం దెచ్చిండ్రు. గవ్విట్ల మూడు చిర్తపులులను కన్జరేషన్ బాక్సులకెల్లి కునో జాతీయ పార్క్‌లకు ప్రతాని మోదీ ఇడ్సి పెట్టిండు’’ అని యాద్గిరి అన్నడు. ‘‘నెలొద్దుల ముందుగాలనే గ్యాస్ బండ, పిట్రోలు అనేటి రెండు చిర్తపులులను ప్రతాని జెనం మీద్కి ఇడ్సిపెట్టిండు’’ అని మా సత్నారి అన్నడు. నివొద్దే గదా! - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
చరిత్ర వక్రీకరణ మహానేరం
చరిత్రను వక్రీకరించడం జనసంహారం చేసే ఆయుధాల కన్నా ప్రమాదకరం. అది ప్రజలను తరతరాలుగా తప్పుదోవ పట్టిస్తుంది. చరిత్ర ఒక జ్ఞాపకం మాత్రమే కాదు, అది భావి తరాలకు మార్గదర్శి. తమ రాజకీయ, ఆర్థిక, సామాజిక అవసరాలకు చరిత్రను ఒక సాధనంగా చూడటమనేది స్వార్థ చింతన. చరిత్రకు మసిపూసి మారేడు కాయ చేయడమనేది ఒక రాజకీయ దృక్పథంగా మారిపోవడం విషాదం. ప్రస్తుతం తెలంగాణ సమాజం అదే విధమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నది. తెలంగాణ విమోచన, విలీనం, విద్రోహం, సమైక్యత అనే వాదాలు, వివాదాలు కొనసాగుతున్నాయి. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం అనేది నిష్పాక్షిక దృష్టితో చూడాల్సిన బాధ్యత తెలంగాణ గడ్డపై ప్రతి ఒక్కరికీ ఉంది.తమ రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరిస్తోన్న శక్తుల సంఖ్య గణ నీయంగా పెరిగిపోతున్నది. అందుకుగానూ అసత్యాలను, అర్ధ సత్యాలను తమ అస్త్రాలుగా ప్రయోగిస్తున్నారు. సమత, మమత, కరుణ, ప్రేమలకు ప్రతీకగా ఉన్న తెలంగాణ సమాజాన్ని విద్వేషపు విషంతో నింపాలని చూస్తున్నారు. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. హైదరాబాద్ రాష్ట్రం మూడు భాషాప్రాంతాల కలయిక. హిందూ, ముస్లిం, ఇతర సామాజిక వర్గాల సమ్మేళనంతో కలిసి నడిచిన గంగా–జమునా తెహెజీబ్. హైదరాబాద్ రాజ్యం కేవలం ముస్లింలు పాలించినది కాదు. రాజ్యానికి కేంద్రం నిజాం అయితే, గ్రామీణ ప్రాంతాలు హిందూ సామాజిక వర్గానికి చెందిన జమీం దారులు, జాగీర్దారుల కబంధ హస్తాల్లో ఉండేవి. నిజానికి పరోక్షంగా నిజాంలు సాగించిన దుర్మార్గాల కన్నా, ఎందరో జమీందారులు, జాగీర్దారులు సాగించిన అమానుషాలు ఎన్నో రెట్లు ఎక్కువ. కానీ నిజాం పాలన అనగానే కేవలం నిజాం గుర్తుకు రావడమే సహజంగా జరుగుతోంది. ‘మానుకోట’(ఇప్పటి మహబూబాబాద్) జెన్నారెడ్డి ప్రతాపరెడ్డి, విసునూరు రామచంద్రారెడ్డి లాంటి జమీందారులు జరిపిన దారుణాలు మనం చరిత్రలో మరెక్కడా చూడం. వీటన్నింటికీ రజాకార్ల దాడులు, దౌర్జన్యాలు తోడయ్యాయి. హిందూ జమీందార్లు, ముస్లిం రజాకార్లు ఒక కూటమిగా ఏర్పడ్డారు. రజాకార్ ఉద్యమం 1938లో ప్రారంభమైంది. కానీ 1947 నుంచి దౌర్జన్యాలకు వేదికగా తయారైంది. రజాకార్ అంటే స్వయం సేవకులు అని అర్థం. రజాకార్లలో కొందరు హిందువులు కూడా ఉండేవారు. ప్రభుత్వానికి అండగా ఉండడానికి రజాకార్లను వినియోగించాలన్న కొందరు ముస్లిం జమీదారుల ఒత్తిడికి తలొగ్గి వారికి ప్రత్యేకమైన అధికారాలను ప్రకటించారు. దీనితో రజాకార్లు కమ్యూనిస్టులపైనా, ఇతర ఉద్యమకారులపైనా దాడులు కొనసాగించారు. 1947 జూలై 30 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు రజాకార్లు విచ్చలవిడి దౌర్జన్యాలు చేసిన మాట నిజం. వాళ్ళను ప్రతిఘటించి ప్రజలకు రక్షణగా నిలి చింది కమ్యూనిస్టులే. జమీందారుల, భూస్వాముల దౌర్జన్యాలకు పరాకాష్ఠగా నిలిచిన దొడ్డి కొమరయ్య హత్యతో అంటే 1946 జూలై 4న కమ్యూనిస్టులు తమ సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే 1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశం స్వతంత్రమైంది. ఆనాటికి 565 సంస్థానాలు ఉన్నాయి. స్వాతంత్య్రం సిద్ధించేనాటికి హైదరాబాద్ స్వతంత్ర పాలనా ప్రాంతంగా ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు చేసు కొన్నప్పకీ అన్ని విషయాల్లో స్వేచ్ఛగానే నిర్ణయాలు తీసుకునేది. బ్రిటిష్ ప్రభుత్వం తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి తన సైన్యాన్ని హైదరాబాద్‌లో ఉంచింది. అదే మనం ఇప్పుడు చూస్తోన్న హైదరా బాద్‌లోని కంటోన్మెంట్. 1947లో స్వాతంత్య్రం పొందిన భారతదేశం అన్ని సంస్థానాలను భారత యూనియన్‌లో కలపాలని అడిగింది. అందరూ ఒప్పుకున్నారు. కశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు తాము స్వతంత్రంగా ఉంటామని ప్రకటించుకున్నాయి. అందుకుగానూ భారత ప్రభుత్వం, హైదరాబాద్ రాజ్యం ఒక ఒడంబడికను కుదుర్చు కున్నాయి. దానినే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటారు. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చేటప్పుడు కొన్ని నిబంధ నలను పెట్టింది. అందులో ఒకటి, ఇప్పటివరకూ బ్రిటిష్ పాలనలో లేని సంస్థానం అటు పాకిస్తాన్‌లోగానీ, ఇటు భారతదేశంలో గానీ చేర వచ్చు. లేదా స్వతంత్రంగా ఉండవచ్చు. అయితే నిజాం స్వతంత్ర పాకి స్తాన్ ఆహ్వానాన్ని తిరస్కరించాడు. భారతదేశంతో మాత్రం స్నేహంగా ఉండడానికి అంగీకరించాడు. 1947లో ఉనికిలోకి వచ్చిన రజాకార్ల దాడులను ఆసరాగా తీసుకొని భారత ప్రభుత్వం నిజాం మీద ఆంక్షలను పెంచింది. ఆర్థికంగా దిగ్బంధనం చేసింది. భారత ప్రభుత్వం పెంచుతోన్న ఒత్తిడిని తట్టుకోలేక నిజాం ప్రభుత్వం 1948 ఆగస్టు 9న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని ఆశ్రయించింది. భారత ప్రభుత్వం కొన సాగిస్తున్న ఆంక్షలను ఎత్తివేయాలనీ, తాము స్వతంత్రంగా కొనసాగే అవకాశం కల్పించాలనీ నివేదించింది. అది 1948 ఆగస్టు 21న చర్చలకు వచ్చింది. ఆ అభ్యర్థనను స్వీకరించాలా లేదా అనేది చర్చకు వచ్చినప్పుడు అందులో ఉన్న పది దేశాల్లో ఫ్రాన్స్, అమెరికా, కెనడా, కొలంబియా, సిరియా, బెల్జియం, అర్జెంటీనా అభ్యర్థనను స్వీకరించ డానికి తమ మద్దతును తెలియజేశాయి. రష్యా, చైనా, ఉక్రెయిన్ తటస్థంగా ఉన్నాయి. ఇది 1948 సెప్టెంబర్ 16న జరిగింది. అయితే దానిని ఒక రెండు రోజులు వాయిదా వేయాలని భారత ప్రభుత్వ ప్రతినిధులు తెరవెనుక కథ నడిపారు. అప్పటికే భారత సైన్యం హైదరాబాద్‌లో సైనిక చర్యలను ప్రారంభించింది. దాదాపు హైదరా బాద్ సంస్థానం పూర్తిగా ఆక్రమణకు గురైంది. తెల్లారితే సెప్టెంబర్ 17. ఆరోజు హైదరాబాద్‌ను హస్తగతం చేసుకున్నారు. సెప్టెంబర్ 17 మధ్యాహ్నంకల్లా నిజాం చేత భారత ప్రతినిధి కె.ఎం.మున్షీ ఒక ప్రకటన చేయించారు. హైదరాబాద్ ప్రభుత్వం తరఫున భద్రతా మండలిలో చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నామనేది అందు లోని ప్రధానాంశం. సెప్టెంబర్ 12న మొదలుపెట్టిన సైనికదాడి మొదటి లక్ష్యం ఐక్యరాజ్య సమితి నుంచి ఫిర్యాదును వెనక్కి తీసుకునేటట్టు చేయడం. సైనిక చర్య జరిగిన సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు సైన్యం చేతిలో గానీ, అక్కడక్కడా జరిగిన ఘర్షణల్లోగానీ 25 వేల నుంచి 30 వేల మంది వరకు మరణించినట్టు నిజాం ప్రభుత్వం నియమించిన సుందర్‌లాల్ కమిటీ నివేదిక వెల్లడించింది. ఇది ఒక ఘట్టం. దీనినే మనం విమోచన అంటున్నాము. విమోచన అంటే శత్రువును పదవీ చ్యుతుడిని చేయాలి. కానీ అలా జరగలేదు. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేరుమీదనే 1950 జనవరి 26 వరకు ప్రభుత్వం నడిచింది. ఆ తర్వాతనే హైదరాబాద్ భారత ప్రభుత్వంలో అధికారికంగా భాగమైంది. 1948 సెప్టెంబర్ 17న నిజాంను లొంగదీసుకున్న తరువాత భారత సైన్యం కమ్యూనిస్టులపై యుద్ధం ప్రకటించింది. అప్పటి వరకు ప్రజలను దోచుకున్న దొరలు, భూస్వాములు, జమీందారులు, జాగీర్దార్లు కమ్యూనిస్టుల పోరాటంతో ఊళ్ళొదిలి పెట్టారు. భారత సైన్యం రావడంతో, కాంగ్రెస్ టోపీలు పెట్టుకొని మళ్ళీ పల్లెలకు వచ్చారు. భారత సైన్యం, భూస్వాములు, గూండాలు కలిసి ఊరూరునీ వల్లకాడుగా మార్చేశారు. 1948 సెప్టెంబర్ 17 నుంచి 1951 అక్టోబర్ సాయుధ పోరాట విరమణ వరకూ దాదాపు 4 వేల మంది కమ్యూనిస్టులతో పాటు, వేలాది మంది సాధారణ ప్రజలు చనిపోయారు. మరి 1948 సెప్టెంబర్ 17న విమోచన అయితే, 1951 వరకు భారత సైన్యం తెలంగాణ పల్లెలపై ప్రకటించిన యుద్ధం ఎవరి విమోచనం కోసం జరిగింది? కాబట్టి సెప్టెంబర్ 17న జరిగింది నిజాం బలవంతపు లొంగుబాటుగానే చరిత్ర మనకు చెబుతున్నది. ఆ తర్వాత మూడేళ్ళ పాటు తెలంగాణ పల్లెల్లో నెత్తురు ప్రవహించింది. అందువల్ల మనం సెప్టెంబర్ 17న జరపాల్సింది సంబురాలు కాదు. మనల్ని మనం సింహావలోకనం చేసుకోవడమే. రజాకార్ల దౌర్జన్యా లనూ, అమానుషాలనూ ఎండగట్టాల్సిన సమయమిదే. కానీ భారత సైన్యం జరిపిన నరమేధాన్ని తక్కువ చేసి చూడటం ముమ్మాటికీ సరికాదు. తెలంగాణ ప్రజలు అటు నిజాం రాజు, జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్ల దోపిడీ, దౌర్జన్యాలకు బలైపోయారు. రజాకార్ల అమానుషాలను అనుభవించారు. అదేవిధంగా భారత సైన్యం చేసిన విధ్వంసాన్ని, వినాశనాన్ని కూడా చవిచూశారు. ఇదే వాస్తవం. ఇదే నగ్న సత్యం. - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
భిన్నత్వంలో ఏకత్వమే మా లక్ష్యం
సాక్షి, సిరిసిల్ల: భిన్నత్వంలో ఏకత్వం తమ లక్ష్యమని, అరవైఏళ్ల స్వీయ అస్తిత్వ పోరాటం తర్వాత అవతరించిన తెలంగాణ.. అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. శనివారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17వ తేదీ.. తెలంగాణ రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పరిపాలనకు పరివర్తన చెందిన రోజన్నారు. సీఎం కేసీఆర్ దార్శనిక పాలనలో విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయం, పరిశ్రమలు, అభివృద్ధి, ప్రజా సంక్షేమం వంటి రంగాల్లో దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలిచిందన్నారు. నిరుపేదల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ హెల్త్ ప్రొఫైల్‌ను ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో చేపట్టామని వివరించారు.అంబేడ్కర్ పేరును రాష్ట్ర సెక్రటేరియట్‌కు పెట్టి మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో కొందరు మత పిచ్చితో మంటలు రేపాలని చూస్తున్నారని, మన మధ్య ఐక్యతను కాపాడుకుంటూ ముందుకు సాగుదామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: గిరిజనులకు దేశవ్యాప్తంగా సమాన హోదా -
మతోన్మాద శక్తులు వస్తున్నాయి.. జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: ‘‘దేశంలో, రాష్ట్రంలో మతోన్మాదశక్తులు పేట్రేగిపోతున్నాయి. సంకుచిత ప్రయోజనాల కోసం మనుషుల మధ్య ముళ్లకంపలు నాటుతున్నాయి. విద్వేషపు మంటలు రగిలిస్తూ, విష వ్యాఖ్యలతో ఆజ్యం పోస్తున్నాయి. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి.. స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చు కునే నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నాయి. నాటి చరిత్రతో, పరిణామాలతో వీసమెత్తు సంబంధం లేని ఈ అవకాశవాదులు చిల్లర రాజకీ యాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీక రించి మలినం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. శనివారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. కార్యక్రమంలో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. దుష్టశక్తుల యత్నాలను తిప్పికొట్టాలి ‘‘గత ఎనిమిదేళ్లలో తెలంగాణ జీవన ముఖచిత్రం ఎంతో మారిపోయింది. పచ్చని పొలాలతో, చక్కని మౌలిక వసతులతో ప్రగతిబాటలో పయనిస్తోంది. కానీ ఇప్పుడు మతతత్వ శక్తులు బయలుదేరి తెలంగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయి. మనుషుల మధ్య విభజన, మతం చిచ్చు సరికాదు. ఇవి ఈ విధంగా విజృంభిస్తే దేశం, రాష్ట్రాల జీవికనే కబళిస్తాయి. ఆ దుష్టశక్తుల యత్నాలను బుద్ధి కుశలతతో తిప్పికొట్టాలి. ఏ కొంచెం ఆదమరిచినా.. ఎంత బాధాకరమైన వస్తాయనేదానికి మన గత తెలంగాణే ఉదాహరణ. ఒకనాడు జరిగిన ఏమరుపాటుతో తెలంగాణ 58 ఏళ్లు శాపగ్రస్త జీవితం అనుభవించింది. అస్తిత్వాన్ని తిరిగి నిలబెట్టుకోవడం కోసం ఎంతో పోరాడాల్సి వచ్చింది. అటువంటి వేదన మళ్లీ రాకూడదు. ఈ నేల శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలే తప్ప.. అశాంతితో అట్టుడికిపోవద్దు. నాటి ప్రజలంతా భాగస్వాములే.. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నాం. తెలంగాణ సమాజం ప్రజాస్వామిక స్వేచ్ఛ వైపు పరివర్తన చెందడానికి నాడు అవలంబించిన వ్యూహాలు, జరిపిన పోరాటాలు, నెరిపిన త్యాగాల్లో.. నాటి తెలంగాణ ప్రజలందరూ భాగస్వాములే. ఆనాటి ఘట్టాలు జాతి జనుల జ్ఞాపకాల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయి. చిరస్మరణీయులైన యోధులను తలుచుకోవడం మన కర్తవ్యం. కొమురంభీం, దొడ్డి కొమురయ్య, రావి నారాయణరెడ్డి, చాకలి ఐలమ్మ, ఆరుట్ల రామచంద్రారెడ్డి దంపతులు, సురవరం ప్రతాపరెడ్డి, మగ్దూం మొహియొద్దీన్, షోయబుల్లాఖాన్‌లకు శిరసు వంచి నమస్కరిస్తున్నా.. నాడు, నేడు తెలంగాణ అగ్రగామే! తెలంగాణ దేశంలో అంతర్భాగంగా మారిన తర్వాత 1948 నుండి 1956 వరకు సొంత రాష్ట్రం హైదరాబాద్ స్టేట్‌గా వెలుగొందింది. మిగులు నిధులతో అభివృద్ధి దిశగా ప్రణాళికలు నిర్మించుకొని అడుగులు వేసింది. తర్వాత పడిన తప్పటడుగుల నుంచి విముక్తి పొంది 2014 జూన్ 2న తెలంగాణ తిరిగి సాకారమైంది. అప్పుడూ, ఇప్పుడూ అన్నిరంగాల్లోనూ పురోగమిస్తూ దేశానికే దారిచూపే టార్చ్‌బేరర్‌గా నిలిచింది’’. ఇదీ చదవండి: కేంద్రం తీరుతో సమాఖ్య స్ఫూర్తి క్షీణిస్తోంది -
అబుదాబిలో తెలంగాణ దినోత్సవ వేడుకలు
సాక్షి, రాయికల్: అబుదాబిలోని తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాలను ఎగురవేశారు. తెలంగాణ విమోచన ప్రాముఖ్యత గురించి పలువురు వక్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు రాజ శ్రీనివాస్‌రావు, వంశీక్రిష్ణ, గంగారెడ్డి, గోపాల్, సన్ని, సంతోష్, బాబు, జగదీశ్, నారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, రంజిత్, చరణ్ పాల్గొన్నారు. -
ఓడినా పైచేయి నిజాందేనంటూ.. మజ్లిస్ పత్రిక ప్రచారం
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థకు ‘మీజాన్’ పేరుతో ఓ పత్రిక ఉంది. నరరూప రాక్షసుడిగా ముద్రపడ్డ ఖాసింరజ్వీ నేతృత్వంలో ఉన్న సంస్థ కావటంతో దాని పత్రిక కూడా నిజాం సేనలకు అనుకూల వార్తలతో జనాన్ని తప్పుదోవ పట్టించే యత్నం చేసింది. ఓవైపు భారత సేనలు హైదరాబాద్‌ను చుట్టుముట్టడంతో నిజాం సైన్యం తోకముడిచినా.. ఎంఐఎం పత్రిక మీజాన్ మాత్రం, నిజాం సైన్యానిదే పైచేయి అంటూ తప్పుడు కథనాలను జనంలోకి వదిలింది. మరోవైపు నిజాం నియంత్రణలో ఉన్న హైదరాబాద్ రేడియో కూడా నిజాం సేనలు వీరోచితంగా పోరాడుతూ భారత సైన్యాన్ని అడుగడుగునా అడ్డుకుంటున్నాయని వార్తలు వెలువరించింది. సెప్టెంబర్ 17 సాయంత్రం వరకు జరిగిన ఈ తంతు ఆ తర్వాత ఆగిపోయింది. తప్పుడు వార్తలే కాదు, తుదకు ఆ పత్రిక, రేడియో కూడా ఆ తర్వాత మూగబోయాయి. సైన్యానికి స్వాగతం పలికిన జనంపై రజాకార్ల దాడులు భారత సైన్యం రాకను అడ్డుకోలేకపోయిన నిజాం సేనలు, ఆ అక్కసును సాధారణ ప్రజలపై చూపించాయి. నగరానికి చేరుకున్న భారత సైనిక పటాలాలను చూసి సంబరపడ్డ జనం, హారతులిచ్చి స్వాగతం పలికాయి. బొల్లారం మిలటరీ కేంద్రం వద్ద పండగ వాతావరణం నెలకొంది. సెప్టెంబరు 17న రాత్రి అక్కడికి దొంగచాటుగా చేరుకున్న రజాకార్ల బృందం సాధారణ ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. దీంతో అమాయకులు బలయ్యారు. విషయం తెలుసుకున్న భారత సైనికులు గాలించి మరీ ముష్కరులను పట్టుకుని కోర్టులో హాజరు పరిచారు. చదవండి: (బురఖా ధరించి మహిళ వేషంలో గోడ దూకి పరారైన... నిజాం నవాబు ప్రధాని) -
జాతీయాలతో జాతి భాష సంపన్నం
సెప్టెంబర్ 17, 2005. తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటోన్న వేళ ఉదయం 10 గంటలకు వేముల పెరుమాళ్లు లేరన్న విషయం తెలిసింది. తెలంగాణ భాష కోసం, తెలంగాణ జాతీయాల కోసం, తెలంగాణ జానపదుల కోసం, తెలంగాణ సామెతల కోసం, తెలంగాణ పల్లె పదాల కోసం జీవితాంతం కృషి చేసిన వేముల పెరుమాళ్లు.. సరిగ్గా తెలంగాణ విమోచనం రోజే లోకాన్ని వీడడం యాధృచ్చికమే కావొచ్చు కానీ మరిచిపోలేని జ్ఞాపకంగా తన మరణాన్ని మార్చుకోవడం మాత్రం గొప్ప విషయం. తెలుగు సంస్కృతి అంతా ఒక్కటే! అయినా తెలంగాణ సంస్కృతిలో కొంత భిన్నత్వం ఉంది. భాషలో యాసలో ప్రత్యేకత ఉంది. అందుకు కారణం సుమారు ఎనిమిది వందల సంవత్సరాలకు పైగా పరాయి పాలనలో తెలుగు చదవడం, రాయడం నిషేధింపబడ్డ రోజుల్లో కూడా తెలంగాణ ప్రజలు వారి భాషను, యాసను పదిల పరుచుకున్నారు. వారి సామెతల్ని, జాతీయాల్ని , మౌఖిక సాహిత్యాన్ని, లిఖిత సాహిత్యాన్ని భద్ర పరుచుకున్నారు. నిజాం పాలకులు సృష్టించిన ప్రతికూలమైన పరిస్థితులలో కూడా ఇక్కడి ప్రజలు వాటిని కాపాడుకోవడం ఒక సాహసవంతమైన చర్య. "సాలు పొంటి సాలు తీరు"గా వారి అవ్వ నుంచి మారుమూల గ్రామీణుల నుంచి వాళ్ల వాక్కును కల్తీ కాకుండా తన భాషగా చేసుకుని కాలగర్భంలో కలిసిపోగా మిగిలిన (పోయింది పొల్లు ఉన్నది గట్టి) జాతీయాల్ని ఏర్చికూర్చి "తెలంగాణ జాతీయాలు"గా గ్రంథస్తం చేశారు. ఉడుం పట్టు, దీక్ష కార్య శూరత్వం గల వారు ఎలాంటి మహాకార్యాన్నయినా అలవోక గా చేయగలరని తెలంగాణ జాతీయాలు పుస్తకం చూస్తే తెలుస్తుంది. వేముల పెరుమాళ్లు స్వస్థలం నాటి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల తాలుకా రాయికల్ గ్రామం. రాయికల్, కోరుట్ల, జగిత్యాలలో విద్యాభ్యాసం చేసిన పెరుమాళ్లు.. శ్రీకాళహస్తిలోని గ్రామసేవక్ శిక్షణా కేంద్రం నుంచి గ్రామీణాభివృద్ధిలో డిప్లమో చేశారు. 1963 నుంచి 18 ఏళ్ల పాటు గ్రామీణాభివృద్ధి అధికారిగా మల్యాల, జగిత్యాల పంచాయతీ సమితులలో ఉద్యోగం చేశారు. 1981లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి జగిత్యాల పంచాయతీ సమితి అధ్యక్ష ఎన్నికలతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మండల వ్యవస్థ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాయికల్ మొదటి మండలాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉద్యోగం, రాజకీయం.. ఏ రంగంలో ఉన్నా.. సాహిత్యాన్ని మాత్రం మరవలేదు పెరుమాళ్లు. దశాబ్దకాలంగా కష్టనష్టాలకు ఓర్చి, పేర్చి కూర్చిన ఈ గ్రంథం తెలంగాణ జాతీయాలకు, సామెతలకు నిఘంటవుగా నేటికి ప్రతిబింబిస్తుంది. నోసుక పుట్టినట్టు వీరి మరణానంతరం తెలంగాణ జాతీయాల్ని ఇంటర్ ప్రథమ సంవత్సరం పాఠ్యాంశంగా స్వీకరించి వీరి శ్రమకు, తెలంగాణ భాషకు, యాసకు సముచిత గౌరవాన్ని కల్పించడం వీరికే కాదు తెలంగాణ జాతీయాలకు అగ్రాసనం వేసినట్టయింది. పెరుమాళ్లు తాత కైరం భూమదాసు గొప్ప వైష్ణవ భక్తుడు, కవి, గాయకుడు. కైరం భూమదాసు వ్రాతప్రతులను పరిష్కరించిన పెరుమాళ్లు 2002లో "వరకవి కైరం భూమదాసు కృతులు" గ్రంథాన్ని ప్రచురించారు. 1958 నుంచి 1968 మధ్య కాలంలో జరిగిన ఎన్నో జాతీయ పరిణామాలను వీరు పద్యాలుగా మలిచారు. వీరు రచించిన శ్రీ రాజరాజేశ్వర, శ్రీ ధరమపురి నృకేసరి శతకాలు సంబంధిత దేవాలయాలు ప్రచురించాయి. బాల సాహిత్యంలో వీరు చేసిన కృషి ఫలితంగా కిట్టూ శతకం (బాలనీతి), నిమ్ము శతకం (పర్యావరణ) వెలువడ్డాయి. మహాత్ముని మహానీయ సూక్తులను "గాంధీమార్గం" త్రిశతిగా రచించారు. "లోగుట్టు" వీరు రచించిన రాజనీతి చతుశ్శతి. ఎంతో కాలం వీరు సేకరించిన జాతీయాలు, సామెతలతో వెలువడిన గ్రంథం "తెలంగాణ జాతీయాలు". పెరుమాళ్లు మరణానంతరం వెలువడిన గ్రంథం మానవతా పరిమళాలు. 1983 నుంచి 2001 వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి చేసిన "జ్యోతిపథం" లఘు ప్రసంగాల సంకలనం. జానపద సాహిత్యం కూరాడుకుండ లాంటిది. దానిని మైల పరచకుండా చూసే బాధ్యతని సాహితీప్రియులందరిపై వేశారు పెరుమాళ్లు. జానపదుడు రుషీసుంటోడు, ఆయన నోట వెలువడ్డ జాతీయం, సామెత గంగలో రాయిలాంటిది. ఎన్నో వందల సంవత్సరాలు అది ప్రజల నోళ్లలో నాని రగిడిల్లింది. తెలంగాణ జాతీయాలు తరతరాల మన సామాజిక చరిత్రకు సజీవ సాక్ష్యం. చిల్లి బొక్కతీరు లక్షల్లో వున్న తెలంగాణ జాతీయాల్ని వేలలో "పోయింది పొల్లు, ఉన్నది గట్టి తీరు"గా గ్రంథస్తం చేశారు పెరుమాళ్లు. ఇంకా ఎన్నో ప్రాంతాల్లో సజీవంగా జానపదుని నాలుకపై తచ్చాడుతున్న జాతీయాల్ని.. ఔత్సాహికులు మరింత శ్రమించి కొత్త సంపదను జాతికి ఇవ్వాలన్న వారి కోరిక తీర్చాల్సిన తరుణం మళ్లీ వచ్చింది. అదే తెలంగాణ సాహిత్యానికి తిరిగి చెల్లించాల్సిన రుణం. వి.ప్రభాకర్, తెలంగాణ కవి, రిటైర్డ్ రిజిస్ట్రార్, సహకారశాఖ -
Telangana Liberation Day 2022: మందు పాతరలు.. చివరి అస్త్రం
సాక్షి, హైదరాబాద్: భారత ప్రధాన సైన్య విభాగం బొల్లారం చేరకుండా చివరి ప్రయత్నంగా నిజాం సైన్యం మందుపాతర్లను ప్రయోగించింది. షోలాపూర్–హైదరాబాద్ రహదారి మీదుగా వస్తున్న మేజర్ జనరల్ చౌదురీ నేతృత్వంలోని సైనిక బృందాన్ని హతమార్చేందుకు నిజాం సైన్యం సికింద్రాబాద్‌కు 20 మైళ్ల దూరంలో పెద్ద సంఖ్యలో మందుపాతర్లను అమర్చింది. అదే సమయంలో భారత సైన్యానికి పట్టుబడ్డ కొందరు నిజాం సైనికులు ఈ విషయాన్ని వెల్లడించారు. వాటిని తొలగించాల్సిందిగా భారత సైన్యం ఆదేశించింది. కానీ, వాటిని జాగ్రత్తగా వెలికితీసే విధానంపై అవగాహన లేకపోవడంతో ఆ సైనికులు చేతులెత్తేశారు. దీంతో భారత సైన్యంలోని నిపుణులు ఐదు గంటలు కష్టపడి వాటిని గుర్తించి, నిర్వీర్యం చేశారు. ఈ మందుపాతర్ల వ్యవహారం వల్ల భారత సైన్యం ఐదు గంటలు ఆలస్యంగా బొల్లారం చేరుకుంది. సాయంత్రం నాలుగున్నరకు సికింద్రాబాద్ శివార్లలో నిజాం సైన్యాధ్యక్షుడు మేజర్ జనరల్ ఎడ్రూస్ ఎదురేగి చౌదురీ బృందానికి స్వాగతం పలికాడు. నిజాం సేనల లొంగుబాటు పత్రాన్ని సమర్పించాడు. ఇండియన్ ఆర్మీని తోడ్కొని భారత ప్రభుత్వ ప్రతినిధి మున్షీ భవనానికి తీసుకెళ్లాడు. 20 మంది భారత సైనికులు మృతి హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకునేందుకు జరిగిన ఆపరేషన్‌లో భారత సైన్యం 20 మంది జవాన్లను కోల్పోయింది. అతి తక్కువ ప్రాణనష్టంతో గొప్ప విజయాన్ని సాధించినట్టయింది. 600 మంది నిజాం సైనికులు, 1,000 మందికిపైగా రజాకార్లు ఈ ఆపరేషన్ పోలోలో మరణించినట్లు అప్పట్లో లెక్కలు తేల్చారు. (క్లిక్ చేయండి: అణచివేతపై సాయుధ పోరాటం!) కృత్రిమ వరదలకు కుట్ర భారత సైన్యాన్ని అడ్డుకునే క్రమంలో మూసీ నదిలో రజాకార్లు కృత్రిమ వరదలు సృష్టించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్‌కు మంచినీరు సరఫరా చేసే హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల గేట్లను ధ్వంసం చేసి మూసీలోకి భారీగా వరద వచ్చేలా చేశారు. నదిలో వరద నిండుగా ఉంటే భారత సైన్యం ముందుకు రాలేదన్నది వారి ఆలోచన. కానీ, ఈ ప్రతిబంధకాలను విజయవంతంగా అధిగమించి భారత సైన్యం నగరంలోకి చొచ్చుకొచ్చింది. రజాకార్ల దుశ్చర్యతో హైదరాబాద్‌ను కొంతకాలం పాటు తాగునీటి కష్టాలు చుట్టుముట్టాయి. (క్లిక్: జిన్నా చనిపోయిన రోజే ముహూర్తం.. చకచకా పావులు కదిపిన సర్దార్ పటేల్) -
సెప్టెంబర్ 17 వేడుకల్లో అపశృతి.. జాతీయ జెండాను అలాగేనా ఎగురవేసేది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సెప్టెంబర్ 17 సందర్బంగా అధికార టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భూపాలపల్లిలో జరిగిన వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. భూపాలపల్లి కలెక్టరేట్లో జాతీయ పతాక ఆవిష్కరణకు ప్రభుత్వం తరఫున ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం, అనురాగ్ శర్మ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ క్రమంలో జాతీయ జెండాకు వందనం సమర్పించిన తర్వాత తప్పిదం గమనించారు. జెండాను తలకిందులుగా ఎగురవేసినట్టు గ్రహించారు. దీనికి కారణమైన ఆర్ఎస్ఐ సదానందంను జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి సస్పెండ్ చేశారు. ఇలాంటి ఘటనే డిచ్‌పల్లిలో సైతం చోటుచేసుకుంది. ఎంపీడీవో ఆఫీసులో జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. దీంతో అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంపీపీ అధ్యక్షుడు భూమన్న డిమాండ్ చేశారు. చదవండి: (అమిత్ షా కాన్వాయ్‌కు అడ్డొచ్చిన టీఆర్ఎస్ నేత కారు.. అద్దం పగులగొట్టి..) -
జిన్నా చనిపోయిన రోజే ముహూర్తం.. చకచకా పావులు కదిపిన సర్దార్ పటేల్
సాక్షి, హైదరాబాద్: ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి 13 నెలలు గడుస్తోంది. దక్షిణ భారతంలో కీలకమైన హైదరాబాద్ సంస్థానం మాత్రం ఇండియన్ యూనియన్‌లో విలీనమయ్యే ప్రసక్తే లేదని మొండికేస్తోంది. అంతేకాదు పాకిస్థాన్‌కు అనుకూలంగా మారుతోంది. విలీనం కోసం భారత్ ఒత్తిడి తెస్తే పాకిస్తాన్ జోక్యం చేసుకోవాలంటూ హైదరాబాద్ నుంచి రేడియో సందేశాలు వెళ్తున్నాయి. మరోవైపు హైదరాబాద్ సంస్థానం రజాకార్లు, నిజాం సైన్యం అకృత్యాలతో అట్టుడుకుతోంది. ఇక కఠిన చర్యలకు సిద్ధం కావాల్సిందే’.. నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ మదిలో ఇదే ఆలోచన. అదును దొరికితే చాలని వేచి ఉన్నారు. దేశ విభజనకు కారణమైన పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా 1948 సెప్టెంబరు 11న మృతి చెందారు. ఇంకేం అదును దొరికింది. ఆ సమయంలో కాశ్మీర్లో ఉన్న సర్దార్ పటేల్.. తుపాకీ చూపి నిజాంను దారికి తెచ్చేందుకు ఆ చల్లని వాతావరణంలో వేడివేడి వ్యూహాలను సిద్ధం చేశారు. సైనిక చర్యకు దిగితే ఎలా ఉంటుందో నిజాంకు తెలిసేలా కబురు పంపారు. లొంగిపోవాలా.. ఎదిరించాలా? భారత ప్రభుత్వం తరఫున మేజర్ జనరల్‌గా ఉన్న మున్షీ హైదరాబాద్‌కు వచ్చి నిజాంతో మాట్లాడి, పరిస్థితిని వివరించారు. భారత్ సైనిక చర్యకు దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో స్పష్టం చేశారు. దీంతో తాను భారత సైన్యాన్ని ఎదురించనని, విలీనానికి సహకరిస్తానని నిజాం సంకేతాలు ఇచ్చారు. ఈ విషయాన్ని రజాకార్లకు, నిజాం సైన్యానికి చెప్పలేదు. లొంగిపోయాక తనపై సైనిక విచారణ, శిక్ష లేకుండా చూసుకోవడం, రాజభరణం, ఇతర సదుపాయాలు అందుకోవడంపైనే దృష్టిపెట్టారు. హైదరాబాద్ సంస్థానం మంత్రి వర్గాన్ని అత్యవసరంగా సమావేశపర్చి.. అందరినీ రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించారు. అందరూ రాజీనామా చేసి, నిజాం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని ప్రకటించారు. నిజాం ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తెలిపి, సైన్యాన్ని ఎదురించబోనని మాటిచ్చారు. ప్రతిగా విలీనం తర్వాత తనకు ప్రాధాన్యమున్న హోదా ఇవ్వాలని, 200 కోట్ల నగదు ఇవ్వాలని, తన బిరుదులను కొనసాగించాలని, తన ఆస్తులు తనకే దక్కాలని కోరారు.ఇవి తెలియని రజాకార్ల బృందాలు, నిజాం సైన్యం.. భారత సైన్యం దాడి మొదలుపెట్టినప్పుడు ప్రతిఘటించాయి. కీసర సరిహద్దులో భీకర దాడితో.. నిజాం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో.. భారత సైన్యాలను ఎదుర్కొనే విషయంగా నిజాం సైన్యం దీటుగా వ్యవహరించలేకపోయింది. కొద్దిపాటి ప్రతిఘటనతోనే లొంగిపోవడమో, పారిపోవడమో జరుగుతూ వచ్చింది. ఆంధ్రా–తెలంగాణ సరిహద్దులో ఉన్న కీసర ప్రాంతంలో మాత్రం భీకర దాడి జరిగింది. కీసర వద్ద నిజాం ఔట్‌పోస్టు వద్దకు భారీగా రజాకార్ల దండు చేరుకుని.. భారత సైన్యంపై దాడికి దిగింది. చాలాసేపు పోరాడాక భారత సైన్యం యుద్ధ ట్యాంకుతో దాడి చేస్తే.. నిజాం ఔట్‌పోస్టు నామరూపాల్లేకుండా పోయింది. ఇలాగే ఖమ్మం వద్ద కూడా దాడి జరిగింది. వందల మంది చనిపోతుండటంతో నిజాం సైన్యం వెనకడుగు వేసింది. కాశీం రజ్వీ దీన్ని తట్టుకోలేక నిజాంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్‌పై దాడి చేసి తమకు సహకరించాలని పాకిస్తాన్‌ను కోరాడు. పాకిస్తాన్ స్పందించలేదు. నిజాం లొంగిపోగా హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనమైంది. (క్లిక్ చేయండి: అణచివేతపై సాయుధ పోరాటం!) అక్రమంగా విమానం ద్వారా ఆయుధాలు ఆస్ట్రియా వ్యాపారి కాటన్ ద్వారా నిజాం రాజు అక్రమంగా ఆయుధా లు సమకూర్చుకున్నాడు. పాకిస్తాన్‌కు వెళ్తున్న విమానంగా చూపి, కారుణ్య సహాయం పేరుతో విమానాన్ని బీదర్ ఎయిర్‌పోర్టులో దింపేవారు. అక్కడి విమాన స్ట్రిప్‌లో ఆయుధాలను అన్లోడ్ చేసేవారు. ఇది బయటపడడంతో బీదర్ బదులు వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయానికి మకాం మార్చారు. లంకాస్టర్ అనే 4 ఇంజిన్లుండే ఈ విమానం ద్వారా 1948 మే నుంచి జూన్ 20 వరకు నిరాటంకంగా ఈ అక్రమ వ్యవహారం సాగింది. భారత ప్రభుత్వం వినతితో బ్రిటిష్ వారి జోక్యంతో తర్వాత ఆగిపోయింది. (క్లిక్ చేయండి: ‘కొరియర్’గా.. వారియర్‌గా!) -
Kandimalla Pratap Reddy: ‘కొరియర్’గా.. వారియర్‌గా!
హిమాయత్‌నగర్: పసి వయసు నుంచి కసిగా నిజాం వ్యతిరేక, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భాగస్వామి అయిన వ్యక్తి ఆయన. అప్పుడాయన వయసు 13 ఏళ్లే. ఆయనే తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ కార్యదర్శి కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి. స్వస్థలం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం జొన్నలగడ్డగూడెం. ‘సెప్టెంబర్ 17’నేపథ్యంలో అప్పటి పోరాటంలో పాల్గొన్న ప్రతాప్‌రెడ్డి అనుభవాలు ఆయన మాటల్లోనే.. ‘స్వాతంత్య్రం వచ్చేనాటికి నాటికి నాకు సుమారుగా 13 ఏళ్లు. మా తండ్రి రంగారెడ్డి నన్ను నల్లగొండ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతిలో చేర్పించారు. దేశానికి స్వాతంత్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానానికి రాలేదంటూ చెలరేగిన ఉద్యమానికి బడులన్నీ మూతపడ్డాయి. అనంతరం నేను ఓ వేపచెట్టు కింద విద్యార్థి నాయకులు, దళాలు చేపట్టిన సాయుధ పోరాట కార్యక్రమంలో తొలిసారిగా పాల్గొన్నాను. ఆ వేపచెట్టుపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాను. గ్రామాల్లోకి వచ్చిన దళాలను రహస్య ప్రాంతాల్లో దాచేవాడిని. నన్ను కమ్యూనిస్టు పార్టీ బాలసంఘం సెక్రెటరీగా నియమించారు. కొరియర్‌గా ఇటు ప్రజలకు, అటు దళాలు, విద్యార్థి నాయకులకు దగ్గరగా ఉండేవాడిని. వీరితో పాటు ప్రజలకు నేనే సమాచార వారధిగా ఉండేవాడిని. తుపాకీని ముట్టనిచ్చేవాళ్లు కాదు.. మా ఉద్యమాన్ని అణచివేసేందుకు రజాకార్లు గుర్రాలపై, జీపులపై గ్రామాల్లోకి చొరబడేవాళ్లు. రజాకార్లను ఎదుర్కొనేందుకు దళాలు కూడా ఊళ్లలోకి వచ్చేవి. తుపాకీని పట్టుకోవాలనే ఆశ నాకున్నప్పటికీ బాలుడిని కావడంతో దళసభ్యులు ముట్టనిచ్చేవాళ్లు కాదు. రజాకార్లను అడ్డుకునేందుకు తిప్పర్తి వంతెనను మూడు, నాలుగు గ్రామాలవాళ్లం కొంతవరకు కూల్చివేశాం. మేం కోదాడ, నల్లగొండ ప్రధాన రహదారులపై ఉన్న సమయంలో షోలాపూర్, కోదాడల మీదుగా పెద్దపెద్ద సైన్యాలు హైదరాబాద్ వైపు వెళ్లడాన్ని గమనించాం. ఈ సైన్యాలు వెళ్లిన మూడు రోజులకు, అంటే సెప్టెంబర్ 17న హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు నిజాం రాజు నుంచి వెలువడిన వార్త మా దాకా వచ్చింది. ఎంతో సంతోషంగా ఈ వార్తను ఒక కొరియర్లా తీసికెళ్లి పలు గ్రామాల్లో చెప్పాను. -
అణచివేతపై సాయుధ పోరాటం!
సాక్షి, హైదరాబాద్: నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దాష్టీకాలు ఓ వైపు.. జమీందార్ల దుర్మార్గాలు మరోవైపు.. దారుణమైన బతుకుల నుంచి బయటపడేందుకు పుట్టిన ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటం. 1946 సెప్టెంబర్ 11న మొదలై 1951 అక్టోబర్ 21 దాకా ఐదేళ్లకుపైగా సాయుధ ఉద్యమం కొనసాగింది. ప్రపంచ చరిత్రలోని గొప్ప పోరాటాల్లో ఒకటిగా నిలిచింది. 1946లో చాకలి ఐలమ్మ సాగుభూమి మీద జమీందారు విసునూరు రాంచంద్రారెడ్డి కన్ను పడింది. ఆ భూమిని, పంటను స్వాధీనం చేసుకునేందుకు గూండాలను పంపాడు. భీమిరెడ్డి నర్సింహారెడ్డి, చకిలం యాదగిరిరావు, నల్ల ప్రతాపరెడ్డి తదితరుల సహకారంతో ఐలమ్మ తిరగబడింది. భీమిరెడ్డి నర్సింహారెడ్డి వంటి వారిని పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారు. అయితే ఐలమ్మ భూమిని, ధాన్యాన్ని భూస్వాములు స్వాధీనం చేసుకోలేక పోయారు. దీంతో ఆవేశం పట్టలేక కడివెండి గ్రామ నాయకులను హత్య చేయాలని పథకం వేశారు. 1946 జూలై 4న దేశ్‌ముఖ్ మనుషులు గ్రామ నాయకుల ఇళ్ల మీద రాళ్లు వేయడంతో.. ప్రజలు లాఠీలు, వడిసెలు చేత బట్టుకుని ప్రదర్శనగా బయలు దేరారు. ఈ ఊరేగింపు జమీందారు ఇంటి దగ్గరికి రాగానే.. జమీందారు మనుషులు కాల్పులు జరపడంతో గ్రామ నాయకుడు దొడ్డి కొమరయ్య బలయ్యాడు. ఈ విషయం దావానలంలా వ్యాపించి.. ఊరూరా జనం తిరుగుబాటు మొదలు పెట్టారు. ఆ ప్రతిఘటనను అణచి వేసేందుకు జమీందార్ల మనుషులు, రజాకార్లు, నిజాం పోలీసులు దాడులకు దిగారు. అయినా ప్రజలు తిరుగుబాటు ఆపలేదు. ఈ క్రమంలోనే కమ్యూనిస్టు పార్టీ 1946 సెప్టెంబర్ 11న సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది. పేదలకు 10 లక్షల ఎకరాలు పంపిణీ.. అణచివేత, దోపిడీలకు వ్యతిరేకంగా మొదలైన సాయుధ ఉద్యమం భూపోరాటంగా మారి దున్నేవాడికే భూమి దక్కాలని నినదించింది. నిజాం రాచరికం, జమీందార్ల అరాచక పాలన మీద తిరుగుబాటుగా మారింది. భూమి కోసం, భుక్తి కోసమేగాక సామాజిక వివక్షపైనా పోరాటం జరిగింది. మూడు వేల గ్రామాలకు ఉద్యమం విస్తరించింది. భూస్వాములు, జమీందార్ల నుంచి పది లక్షల ఎకరాలకుపైగా భూమిని రైతులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తాకట్టులో ఉన్న భూములను విడి పించుకున్నారు. రుణపత్రాలను రద్దు చేసి.. పశువులను పంపిణీ చేశారు. ఈ పోరాటాల్లో ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటి మహిళలూ ముందు నిలిచారు. 4 వేల మంది వీర మరణంతో.. రైతాంగ సాయుధ పోరాటం నడుస్తుండగానే 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఎన్నో సంస్థానాలు ఇండి యన్ యూనియన్‌లో విలీనమైనా.. నిజాం సంస్థానం మాత్రం ఒప్పుకోలేదు. దీనికి నాటి భారత ప్రభుత్వం అంగీకరించింది. నిజాం రాజుతో 1947 నవంబర్ 29న యథాతథ ఒప్పందంపై సంతకాలు చేసింది. కానీ తెలంగాణ ప్రజలు నిజాం పాలన అంతం కావాలని, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావాలని పోరాటాలు చేశారు. అందులో భాగంగా సాయు ధ పోరాటం ఉధృతంగా కొనసాగింది. రజాకార్లు, నిజాం సైన్యాల దాడుల నుంచి రక్షణకోసం.. పదివేల మంది గ్రామదళ సభ్యులు, దాదాపు రెండు వేల గెరిల్లా దళ సభ్యులతో శక్తివంతమైన సాయుధ బలగాన్ని నిర్మించుకోగలిగారు. కానీ నిజాం పాలకులు, జమీందార్లు కలిసి.. నాలుగు వేల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు, రైతులను హతమార్చారు. మరెన్నో వేల మందిని నిర్బంధ శిబిరాల్లో, జైళ్లలో బందీలను చేశారు. అయినా సాయుధ పోరాటం ఉధృతంగా సాగింది. ఈ పోరాటం తమ గెరిల్లా పోరాటం కంటే గొప్పదని క్యూబా ఒక సందర్భంలో వ్యాఖ్యానించడం గమనార్హం. విమోచన కాదు.. అది విలీన ఒప్పందం: మొయిన్ గోల్కొండ: అప్పటి హైదరాబాద్ సంస్థానం విలీనం సందర్భంగా యూనియన్ ప్రభుత్వానికి, నిజాం చివరి పాలకుడికి మధ్య విలీన ఒప్పందం జరిగిందని ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు ఎంకే మొయిన్ అన్నారు. దీనిని కొన్ని రాజకీయ పార్టీలు వక్రీకరించి విమోచన దినంగా చెబుతూ సంబరాలు జరుపుకోవడం సరికాదన్నారు. ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లకు హిందూ జమీందారులైన దేశ్‌ముఖ్‌లు అండగా ఉండి ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. అయితే ఈ సత్యాన్ని ఇప్పుడు కొందరు వక్రీకరిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. భారతదేశంలో నిజాం సంస్థానం విలీనంపై అప్పటి ప్రధాని జవహర్లాల్ న్రెహూ ముద్ర స్పష్టంగా ఉందని, అయితే కొంతకాలంగా విలీన హీరోగా వల్లభాయ్ పటేల్‌ను చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థిగా 1944 సంవత్సరంలో దారుల్ షిఫా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పుడే తాను కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడినయ్యానని పేర్కొన్నారు. తెలంగాణ విలీన సమయంలోనూ అజ్ఞాతంలోనే ఉన్నానని చెప్పారు. అటువంటి తనను సన్మానిస్తామని విమోచనోత్సవం నిర్వహిస్తున్న బీజేపీ పిలవడం విడ్డూరంగా ఉందన్నారు. (క్లిక్ చేయండి: విముక్తి సమరంలో చరిత్రకెక్కిన పరకాల పోరు) -
హైదరాబాద్ సంస్థాన విముక్తి సమరంలో చరిత్రకెక్కిన పరకాల పోరు
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ స్వాతంత్య్ర పోరాటానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది పరకాల అమరధామం. అక్కడి మట్టి.. రజాకార్లు పారించిన రక్తపుటేర్లకు సాక్ష్యం.. నిరంకుశ నిజాం నుంచి స్వాతంత్య్రాన్ని కాంక్షించి అమరులైన యోధుల పోరాటానికి సాక్ష్యం. అదే.. మరో జలియన్ వాలాబాగ్ ఘటనగా చరిత్రలో నిలిచిపోయిన పరకాల ఊచకోత ఘటన. సరిగ్గా 73 ఏళ్ల క్రితం.. 1947, సెప్టెంబర్ 2న జాతీయ పతాకాన్ని ఎగురవేయాలనే కాంక్షతో చుట్టుపక్కల గ్రామాల నుంచి విశేష సంఖ్యలో హాజరైన ప్రజలపై రజాకార్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ మారణహోమం మరో జలియన్ వాలాబాగ్‌గా మారింది. రజాకార్లపై పోరాడి ఎందరో అసువులుబాసి అమరవీరులుగా నిలిచారు. అలాంటి ఉద్యమంలో హనుమకొండ జిల్లా పరకాలది ప్రత్యేక స్థానం. సెప్టెంబర్ 2, 1947న పరకాల సమీపంలో ఉన్న పైడిపల్లి తాళ్ల నుంచి విమోచనోద్యమకారులు భారత జాతీయ జెండా ఎగురవేయడానికి పరకాలకు వచ్చారు. రజాకార్లు ఈ విషయం పసిగట్టి ఉద్యమకారులు జాతీయజెండాను ఎగురవేయనీకుండా అడ్డుకోమని నిజాంతో ఆదేశం జారీ చేయించారు. ఖాసింరజ్వీ నేతృత్వంలో పరకాల సర్కిల్ ఇన్స్పెక్టర్ జియాఉల్లా, మేజిస్ట్రేట్ విష్ణువేశ్వర్ రావులు మూడు లారీల బలగాలను రంగంలోకి దింపారు. శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో ఉద్యమకారులపై తుపాకీగుళ్ల వర్షం కురింపిచారు. పరకాల చాపలబండ వద్ద గుమిగూడిన ఉద్యమకారులపై దాడిచేశారు. కత్తులు, బల్లాలు, బరిశెలతో మారణకాండ కొనసాగించగా 19 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురిని రంగాపూర్ గ్రామంలో చెట్టుకు కట్టేసి గొడ్డలి, బరిసెలు, తుపాకులతో కాల్చి చంపారు. ఈ మారణహోమంలో శ్రీశైలం, గజ్జి పర్వతాలు (కనిపర్తి), కుంట అయిలయ్య (నాగుర్లపల్లె), బత్తుల సమ్మయ్య, ఆముధాపురం వీరన్న, మేకల పోచయ్య,(రాయపల్లె), మంత్రి కేదారి, పోతుగంటి పెద్దులు (దమ్మన్నపేట), గుండారపు కొమరయ్య, దాతుపెల్లి రాజయ్య, కుమ్మరి రాములు (రేగొండ), గెల్లే కట్టమల్లు (దామరంచపల్లె), జాలిగపు ముసలయ్య, తొనగరు పూర్ణాసింగ్ (చల్లగరిగె), కలువాల అంకూస్ (గోవిందాపురం) తదితరులు అమరులయ్యారు. ఆకుతోట మల్లయ్య, రాజ్‌మహ్మద్, వర్దెల్లి వీరయ్యలను చెట్లకు కట్టేసి కాల్చి చంపారు. నిజాం పోలీసులు, రజాకార్లు వెంటాడి 200 మందికిపైగా ఉద్యమకారులను తీవ్రంగా గాయపర్చారు. సాయుధ పోరాటానికి కేరాఫ్... నిజాం రాక్షసకృత్యాలను వ్యతిరేకిస్తూ రహస్య జీవితం గడుపుతున్న ఉద్యమనేతలు ప్రతీకారం తీర్చుకోవడానికి మహరాష్ట్రలోని చాందా బోర్డర్ క్యాంప్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహరావు సారథ్యంలో తొలివిడత వంద మంది సాయుధ శిక్షణ పొందారు. పిస్తోల్, రైఫిల్స్, మందు గుండు సామగ్రి సేకరించి చంద్రగిరి గుట్టలను కేంద్రంగా చేసుకొని సాయుధ పోరాటం జరిపారు. సాయధ దళాలు జమీందార్లు, జాగీర్దారులు, పెత్తందార్లు, మక్తెదారులకు చరమగీతం పాడాయి. ఈ దాడులను తట్టుకోలేక నిజాం పోలీసులు గ్రామాల్లో ప్రజలను విచక్షరహితంగా హింసించారు. చివరకు 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు నిజాం ప్రభుత్వం లొంగిపోవటంతో ఇక్కడి ప్రజలు స్వేచ్ఛా వాయువు పీల్చుకున్నారు. (క్లిక్ చేయండి: ‘కొరియర్’గా.. వారియర్‌గా!) రాత్రి వేళల్లో సమావేశాలు: చంద్రారెడ్డి అలియాస్ రంజిత్ నిజాం పాలనకు తిరుగుబాటుదారులైన ఎస్.మనోహర్‌రావు, కె.వి.నర్సింగరావు ఆదేశాలతో రాత్రివేళల్లో గ్రామాల్లో యువకులతో సమావేశాలు నిర్వహించేవాళ్లు. చాలామంది యువకులను మహారాష్ట్ర చందా ప్రాంతానికి పంపించి అక్కడ ఆజాద్ హింద్‌ఫౌజ్ నుంచి విరమణ పొందిన సైనికులతో ప్రత్యేక గెరిల్లా శిక్షణ ఇప్పించారు. జనవరిలో చందాకు వెళ్లిన వారిలో నేనూ ఉన్నా. 1948 మార్చి వరకు గెరిల్లా శిక్షణ పొందాను. అనంతరం మారుపేర్లతోనే స్వగ్రామాలకు చేరుకున్నాం. అదే సమయంలో ఉద్యమం తీవ్రంగా కొనసాగుతుండటంతో దామెర మండలంలోని చంద్రగిరి గుట్టలను షెల్టర్‌గా మార్చుకొని సాయుధపోరుకు శ్రీకారం చుట్టాం. చాపలబండ వద్ద రజాకార్ల తూటాల నుంచి తప్పించుకున్న నన్ను వారం రోజులకు పట్టుకున్నారు. చిత్రహింసలకు గురిచేసి.. చనిపోయాడనుకొని వెళ్లిపోయారు. కానీ కొన ఊపిరితో బయటపడ్డాను. (క్లిక్: మందు పాతరలు.. చివరి అస్త్రం) -
‘చరిత్ర నుంచి అనుభవాలు నేర్చుకోవాలి.. ఏమరపాటు ఏమాత్రం వద్దు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సెప్టెంబర్ 17 సందర్బంగా అధికార టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జరుగుతున్న వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ క్రమంలోనే గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్ నివాళులు అర్పించారు. కాగా, తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. 15 రోజుల పాటు ఘనంగా వజ్రోత్సవాలు జరిపాము. వేడుకలకు కొనసాగింపుగా సమైక్యతా వజ్రోత్సవాలు జరుపుతున్నాము. రాచరికం నుండి ప్రజాస్వామ్యం దిశగా తెలంగాణ నడిచింది. ఎందరో అమరయోధులు ప్రాణత్యాగం చేశారు. రాజరిక వ్యవస్థ నుంచి పరివర్తన చెందడానికి తెలంగాణ సమాజం మొత్తం పోరాడింది. అమరవీరులను తలచుకోవడం మన కర్తవ్యం. ఆనాడు ఉజ్వల ఉద్యమం జరిగింది. కొమురం భీమ్, దొడ్డి కొమురయ్య సాహసాలు మరువలేం. చాకలి ఐలమ్మ స్ఫూర్తిని తలచుకుందాం. నాటి పాలకుల కృషివల్లే భారతదేశం రూపుదిద్దుకుంది. దేశంలో తెలంగాణ అంతర్భాగమయ్యాక సొంత రాష్ట్రంగా మారింది. ఎందరో మహానుభావులు సామాజిక చైతన్యాన్ని రగిలించారు. తెలంగాణ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయ్యింది. సమైక్య రాష్ట్రానికి వ్యతిరేకంగా తెలంగాణ పోరాడింది. తెలంగాణ లక్ష్యం సాధన కోసం 14 ఏళ్లు పోరాటం చేశాను. సమైక్య రాష్ట్రంలో తెలంగాణను నిర్లక్ష్యం చేశారు. రాష్ట్ర సాధన ఆకాంక్ష ప్రజల్లో చిగురించింది. అద్భుత పోరాటంతో రాష్ట్రాన్ని సాధించుకున్నాము. అన్ని రంగాల్లో అనేక అద్భుతాలను ఆవిష్కరించాము. రాష్ట్ర సంపద గణనీయంగా పెరిగింది. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశాము. ప్రతీ ఇంటికి రక్షిత మంచి నీటిని అందిస్తున్నాము. జాతీయ సగటు కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ. పలు రంగాల్లో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్రంలో పంటల దిగుబడి గణనీయంగా పెరిగింది. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. నాటి చరిత్ర నుండి అనుభవాలు నేర్చుకోవాలి. అటువంటి వేదన మళ్లీ తెలంగాణకు రాకూడదు. మతతత్వ శక్తులు తెలంగాణను విభజించే కుట్ర చేస్తున్నాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా తీవ్రంగా నష్టపోతాము. విభజన శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలను అడ్డుకోవాలి. విష వ్యాఖ్యలతో మంటలకు ఆజ్యం పోస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వారి త్యాగాలను మర్చిపోతే తెలంగాణకు ద్రోహం చేసినట్లే: అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సెప్టెంబర్ 17న బీజేపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో అమిత్ షా మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు అనేకానేక ప్రణామాలు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా.. నిజాం రాజ్యంలో అరాచకాలు కొనసాగాయి. హైదరాబాద్ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది బలిదానాలు చేశారు. సర్దార్ పటేల్ లేకపోతే తెలంగాణ విమోచనం మరింత ఆలస్యమయ్యేది. సర్దార్ పోలీస్ యాక్షన్ ద్వారానే తెలంగాణ విమోచనం అయింది. 108 గంటలపాటు పోలీసు చర్యలో ఎంతో మంది అమరులయ్యారు. నిజాం రాజ్యంలో అరాచకాలను ఇప్పటికీ మరువలేము. ఇంకా కొంతమంది మనుషుల్లో రజాకార్ల భయం ఉంది. భయాన్ని వదిలేసి ధైర్యంగా బయటకు రావాలి. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలనేది ప్రజల ఆకాంక్ష. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కేసీఆర్ విమోచన దినాన్ని అధికారికంగా జరపలేదు. 75 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా విమోచన దినోత్సవం జరుపలేదు. కొందరు ఇతర పేర్లతో ఉత్సవాలు జరుపుతున్నారు. తెలంగాణ విమోచన పేరుతోనే ఉత్సవాలు జరపాలి. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. ప్రధాని నిర్ణయం తర్వాతే ఇప్పుడు అందరూ తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతున్నారు. ఎవరి త్యాగాల వల్ల మీరు నేడు అధికారంలో ఉన్నారో.. వారికి శ్రద్ధాంజలి కూడా వహించకపోతే తెలంగాణకు ద్రోహం చేసినట్లేనని.. సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. -
అమిత్ షా.. అభినవ సర్దార్ పటేల్: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ఇవాళ పండుగ రోజు అని పేర్కొన్నారు బీజేపీ సీనియర్ నేత, ఎంపీ.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా జరిగిన తెలంగాణ విమోచన వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు బలైపోయారు. అప్పుడు.. హైదరాబాద్‌లో తొలిసారిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జెండా ఎగరేశారు. మళ్లీ 74 ఏళ్ల తర్వా త మళ్లీ అమిత్ షా వచ్చి త్రివర్ణ పతాకం ఎగరేశారు. అమిత్ షా అభినవ సర్దార్ పటేల్ అని అభివర్ణించారు కిషన్ రెడ్డి. పాతికేళ్లుగా ఈ వేడుకలు నిర్వహించాలని ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు.. బీజేపీ పోరాటంతోనే విమోచన దినోత్సవం జరుపుకుంటున్నాం అని కిషన్‌రెడ్డి ప్రకటించుకున్నారు. తెలంగాణ ప్రజలకు ఇవాళ పండుగ రోజన్న ఆయన.. టీఆర్ఎస్ ప్రభుత్వం తూతూమంత్రంగా వేడుకలు జరుపుతోందని మండిపడ్డారు. అసలు ఇన్నిరోజులు ఎందుకు నిర్వహించలేదని కేసీఆర్ సర్కార్‌ను ప్రశ్నించారాయన. సెప్టెంబర్ 17 సందర్భంగా.. కేంద్రం ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా విమోచన వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా.. పరేడ్ గ్రౌండ్ వేడుకల్లో పాల్గొన్న అమిత్ షా.. జాతీయ జెండా ఎగరేసి, అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. ఇదీ చదవండి: విలీన విషయంలో వివాదాలు వద్దు-వెంకయ్యనాయుడు -
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేంద్రం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం వేడుకలు జరుగుతున్నాయి. కాగా, పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ తలపెట్టిన తెలంగాణ విమోచన వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరవీరుల స్థూపం, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి అమిత్ షా నివాళులు అర్పించారు. అలాగే, పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర పారామిలటరీ బలగాలు(12 బృందాలతో) పరేడ్ నిర్వహించాయి. ఈ సందర్బంగా అమిత్ షా కేంద్ర బలగాల గౌరవ వందనం స్వీకరించారు. విమోచన దినోత్సవ వేడుకలకు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే హాజరయ్యారు. అలాగే, ఈ వేడుకల్లో భాగంగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటకకు చెందిన 1500 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. Union Home Minister #AmitShah hoisted #NationalFlag at Parade ground in #Secunderabad during the celebrations of #BJP Central govt's #HyderabadLiberationDay Vs#TelanganaJateeyaSamaikyataVajrotsavalu#TelanganaNationalIntegrationDay of #TRS govt. #Hyderabad #TelanganaPolitics pic.twitter.com/AxFJ5Big0B — Surya Reddy (@jsuryareddy) September 17, 2022 -
September 17: ‘విలీనం విషయంలో వివాదాలు అవసరం లేదు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సెప్టెంబర్ 17పై సస్పెన్స్ కొనసాగుతోంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఆసక్తికర పోరు నడుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి విమోచన దినోత్సవ వేడుకల కోసం హైదరాబాద్‌కు విచ్చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. శనివారం ఉదయం విమోచన దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్ వద్ద మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్.. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ అఖండ దేశభక్తుడు. దేశ సమైక్యతకు బలమైన నిర్ణయాలు తీసుకున్నారు. విలీనం విషయంలో వివాదాలు అవసరం లేదు. కులమతాలకు వ్యతిరేకంగా దేశ సమైక్యత కోసం ముందుకెళ్లాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అయింది. దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్‌కు స్వాతంత్రం వచ్చింది అని అన్నారు. ఇదిలా ఉండగా.. బీజేపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ బీజేపీ కార్యాలయంలో జాతీయజెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇన్చార్జ్ సునీల్ బస్సల్, తరుణ్‌చుగ్, బీజేపీ నేతలు పాల్గొన్నారు. అనంతరం, సర్ధార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. -
టీఆర్ఎస్లో రచ్చరచ్చ.. పిడిగుద్దులు గుద్దుకుంటూ హల్చల్
శాంతినగర్: జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు అధికార పార్టీలో రగడకు దారితీశాయి. జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ శాంతినగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆర్డీఓ రాములు అధ్యక్షతన శుక్రవారం వజ్రోత్సవాలు నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ సరిత, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, ఎమ్మెల్యే అబ్రహం హాజరయ్యారు. ఈ సందర్బంగా కొందరు సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటుండగా వేదికపై అలజడి రేగింది. ఒకరిపైఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ హల్చల్ చేశారు. సభాప్రాంగణం అరుపులు, కేకలతో దద్దరిల్లింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి సాయిచంద్, ఆయన అనుచరులు, గన్‌మెన్, పీఏలను ఒకవైపు.. ఎమ్మెల్యే అబ్రహం తన యుడు అజయ్, అతడి అనుచరులను మరోవైపు పంపించి గొడవ పెద్దది కాకుండా చూశారు. అనంతరం సాయిచంద్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కుమారుడు అజయ్ అనుచరులు తనపై, పీఏ, గన్‌మెన్‌పై దాడికి పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అక్కడే బైఠాయించారు. దీంతో పోలీసులు ఆయనకు నచ్చజెప్పి పోలీసు ఎస్కార్ట్‌తో అక్కడి నుంచి పంపించారు. దాడి ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అయితే, సాయిచంద్ ఎవరి ఆహా్వనం మేరకు వచ్చారని ఎమ్మెల్యే తనయుడు అజయ్ ప్రశ్నించారని, ఈ క్రమంలో మాటామాటా పెరిగి దాడులు చేసుకునే వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: జాతీయ సమైక్యత ర్యాలీలో అపశ్రుతి -
జాతీయ సమైక్యత ర్యాలీలో అపశ్రుతి
మంచిర్యాల టౌన్/మిర్యాలగూడ అర్బన్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీలో పాల్గొన్న 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఎండలోనే ఉండటం, తాగునీరు సరిపడా లేక ఇబ్బందులు పడ్డారు. అనంతరం మండుటెండలో ర్యాలీని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం వరకు 3 కిలోమీటర్లు నిర్వహించారు. భోజనాలు కూడా ఎండలోనే మైదానంలో కింద కూర్చుని తిన్నారు. కనీసం తాగునీరు అందక, నీడ లేక 30 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 21 మందికి అక్కడే ఉన్న వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించగా, మిగతా 9 మందిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఎల్ఈడీ స్క్రీన్ కూలి గాయాలు సమైక్యత వారోత్సవాల్లో భాగంగా మిర్యాలగూడలోని వివిధ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాల విద్యార్థులతో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఎన్ఎస్పీ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో కూర్చున్న స్థానిక కాకతీయ పాఠశాల విద్యార్థినులపై ఎల్ఈడీ స్క్రీన్ కూలిపోయింది. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన విద్యార్థినులకు చికిత్స అందించారు. ఇదీ చదవండి: ‘జయహో జగదీశన్న’.. ఆ జిల్లా ఎస్పీ నినాదం వివాదాస్పదం!