మొత్తం చెక్కతోనే.. టయోటా కారు!
షింటో మతస్థులు ఆరాధ్య దైవం అమటిరస్. ఆమె కోసం ఆ మతస్థులు ది ఐసీ గ్రాండ్ దేవాలయాన్ని నిర్మించారు. ఆ దేవాలయం పూర్తిగా 20 ఏళ్లకొక్కసారి పునర్ నిర్మిస్తారు. అది కూడా పూర్తిగా చెక్కతో. అందులో ఒక్క మేకు కూడా వాడరు. అసలు డిజైన్ ఏ మాత్రం చెడగొట్టకుండా ఈ దేవాలయాన్ని నిర్మిస్తారు. గత 1300 ఏళ్లగా ఇదే ఆచారం కొనసాగుతుంది. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా ఈ దేవాలయాన్ని మళ్లీ మళ్లీ నిర్మిస్తున్నారు.
ఎలాంటి విపత్తులు సంభవించినా.. దేవాలయం మాత్రం ఎక్కడా 'చెక్క' చెదరడం లేదు. ఇదే స్ఫూర్తితో ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా కూడా ఓ కారును తయారు చేయాలని భావించింది. అనుకున్నదే తడవుగా ఇటలీలోని మిలాన్ నగరంలో పూర్తిగా చెక్కతో కారు తయారుచేసింది. ఈ కారులోని ప్రతి భాగాన్ని చెక్కతోనే తయారు చేశారు. ఇటాలియన్ రివా స్పీడ్ బోటు గుర్తుతెచ్చేలా తయారుచేసిన ఈ కారుకు సెట్సునా అని పేరు పెట్టారు. సెట్సునా అంటే జపాన్ భాషలో పర్వతం అని అర్థం.
కొండరావి చెట్టు నుంచి తయారు చేసిన చెక్కతో కారు ఫ్రేమ్ నిర్మిస్తే... ఎల్మ్ చెక్కతో కారు అడుగు భాగాన్ని తయారు చేశారు. ఆముదపు చెట్టు చెక్కతో ముందు సీట్లతోపాటు పనిముట్ల ప్యానల్ తయారు చేశారు. సైప్రెస్ చెట్లతో కారు స్టీరింగ్ రూపొందించారు. కారు తయారీలో ఎక్కడా ఒక్క స్క్రూ వాడలేదు.
కారు అద్దాల కోసం పుటాకార, కుంభాకార దర్పణాలను మాత్రం ఉపయోగించారు. చివరికీ కారులోని అల్యూమినియం భాగాలు, సీట్లపై వేసిన లెదర్ వస్తువులు కూడా చెక్కను ఉపయోగించే తయారుచేశారు. అలాగే కారు కాక్‌పిట్‌లోని మీటర్ మాత్రం 100 ఏళ్లు పాటు నిరంతరాయంగా పనిచేసేలా మీటర్‌ను ఏర్పాటుచేశారు.
ఈ కారుని కొట నెజు డిజైన్ చేశారు. ఈ కారు టోయోటో కంపెనీ బ్రెయిన్ చైల్డ్ అని ఆ సంస్థ చీఫ్ ఇంజినీర్ కెంన్జీ సుజీ కితాబు ఇచ్చారు. మూడేళ్ల క్రితం వచ్చిన ఆలోచనే ఇప్పుడు సెట్ సునాగా కళ్ల ముందు నిలిచింది.
ఈ కారులో పెడల్, సీట్ల పొజిషన్ కూడా మామూలు కార్లలాగే మార్చుకునేలా రూపొందించారు. ఈ కారును చిన్న పిల్లలు డ్రైవ్ చేసినా, వాళ్లకు తగ్గట్లుగా సీట్లు ఎత్తును మార్చుకోవచ్చు. ఈ కారు విద్యుత్ ఆధారంగా నడుస్తుంది. 12 ఓల్టుల బ్యాటరీలను ఆరింటిని దీనికోసం వాడారు. వీటిని ఒకసారి చార్జి చేస్తే.. 25 కిలోమీటర్ల వరకు నడుస్తుంది.
కానీ ఈ కారు రోడ్లపై నడిచేందుకు ఇంకా అనుమతి లభించలేదు. అలాగే ఈ కారు అమ్మకానికి పెట్టలేదని కూడా ఆ సంస్థ స్పష్టం చేసింది. ఈ కారు గురించి ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు టోక్యోకు చెందిన టయోటా కంపెనీ ప్రతినిధి లీలా మెక్‌మిలన్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి కార్ల తయారీ అభివృద్ధికి ప్రజల అభిప్రాయాలు... సూచనలు ఉపయోగపడతాయని భావిస్తున్నట్లు తెలిపారు.