ఆగి ఉన్న బస్సును ఢీ కొట్టిన మరో బస్సు
ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణమంటే ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతున్నాయి. తాజాగా... ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును... మరో ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ దుర్ఘటన నల్గొండ జిల్లా కోదాడలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు అయిల్ ట్యాంక్ లీక్ అవుతుండటంతో జాతీయ రహదారిపై పక్కన నిలిపి రిపేరు చేస్తున్నారు.
అయితే వినాయక్ ట్రావెల్స్‌కు చెందిన మరో బస్సు విజయవాడ వైపు వస్తున్న క్రమంలో ఆగి ఉన్న కావేరి ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి ఢీ కొట్టింది. ఆ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.