ఏడుగురి హత్యకేసులో మరణశిక్ష రద్దు
సాక్ష్యాలు సరిగా లేవన్న హైకోర్టు ధర్మాసనం
నిందితుడిని ఆశ్రమంలో ఉంచాలని ఆదేశం
హైదరాబాద్: తన ఇద్దరు బిడ్డలతో పాటు భార్య హత్యకేసులో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చిన ఐదుగురిని చంపిన కేసులో నిందితుడు, సీఆర్పీఎఫ్ మాజీ కానిస్టేబుల్ శంకరరావును హైకోర్టు నిర్దోషిగా విడిచిపెట్టింది. అతడిని విశాఖపట్నంలోని ఓ ఆశ్రమంలో ఉంచాలని ఆదేశించింది. కీలక సాక్షుల సాక్ష్యాలను నమోదు చేయకపోవడం ఈ కేసును బలహీనపరిచిందని, అత్యంత హీనమైన నేరాల విషయంలో కూడా చాలాసార్లు ఇలాగే జరుగుతోందని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో నిందితుడు శంకరరావుకు శ్రీకాకుళం జిల్లా సెషన్స్ కోర్టు 2012లో మరణశిక్ష విధించగా, అతడు హైకోర్టులో అప్పీలు చేసుకున్నాడు.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ విచారణలో అనేక 'మిస్సింగ్ లింకులు' ఉన్నాయని జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి, జస్టిస్ ఎంఎస్కె జైస్వాల్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. శ్రీకాకుళం జిల్లాలో మారుమూల గ్రామమైన మెట్టపేటకు చెందిన శంకరరావు తన మైనర్ కొడుకు, కూతురు సహా మొత్తం ఏడుగురిని హతమార్చాడంటూ 2010 డిసెంబర్ 1న జలుమూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అతడు అప్పటికే తన భార్యను హత్యచేసిన కేసులో దోషిగా శిక్ష అనుభవించి, బెయిల్‌పై విడుదలయ్యాడని పేర్కొన్నారు. ఆ కేసులో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారన్న కోపంతోనే అతడు ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలతో పాటు తన ఇద్దరు పిల్లలను కూడా చంపేశాడని ప్రాసిక్యూషన్ వాదించింది. గ్రామంలో బాంబులు పేల్చి అరాచకం సృష్టించినట్లు కూడా తెలిపింది.
అయితే.. ఈ కేసులో మృతుల సమీప బంధువులు, వారసుల నుంచి వాంగ్మూలాలు తీసుకోకపోవడం ప్రాసిక్యూషన్ వాదనలో పారదర్శకత లేని విషయాన్ని రుజువు చేస్తోందని ధర్మాసనం భావించింది. సాధారణంగా అయితే నిర్దోషిగా తేలిన తర్వాత వారిని స్వేచ్ఛగా విడిచిపెడతామని.. కానీ తన భార్యను, ఇద్దరు పిల్లలను కోల్పోయిన శంకరరావు మానసికంగా బాగా దెబ్బతిన్నాడని, అందువల్ల అతడిని ఏడాదిపాటు విశాఖపట్నంలోని రామకృష్ణ మఠంలో ఉంచాలని కోర్టు ఆదేశించింది.