హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం..
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం దాకా భగభగ మండిన ఎండలతో అల్లాడిన హైదరాబాద్ వాసులకు అకస్మాత్తుగా వాతావరణం చల్లబడటంతో కాస్త ఉపశమనం లభించింది. భాగ్యనగరంలో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, ఖైరతాబాద్, అబిడ్స్, కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌లో వర్షం పడింది.
విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదగా ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
కాగా, శనివారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. అత్యధికంగా సూర్యాపేట జిల్లా లక్కవరంలో 46.1 డిగ్రీల సెల్సియస్‌గా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండ్రోజులు కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా జూన్ మొదటి వారమంతా సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రానికి వాయవ్య. పశ్చిమ దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నట్లు చెప్పింది. శనివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత రామగుండంలో 42.8 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 24.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
చదవండి: అవన్నీ గుండెపోట్లు కావు.. గుండెపోటు ఎవరికి వస్తుంది?