అంతటా తీవ్ర నష్టం
చోడవరం: చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో పలు మండలాల్లో ‘హుదూద్’ విలయం సృష్టించింది. ఈదురుగాలులకు పలుచోట్ల భా రీవృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వరి, చెరకు, కంది, ఇతరపంటలతో పాటు కూరగాయలకు తీవ్రనష్టం వాటిల్లింది. పంట పొలాల్లోకి నీరు చేరింది. పలుచోట్ల ఈదురుగాలులకు వరి పంట పూర్తిగా నేలకొరిగింది. సుమారు వందల ఎకరాల్లో చెరకు పంటకు నష్టం వాటిల్లింది.
అన్నదాతకు కోలుకోలేనిదెబ్బ తగిలింది. చోడవరం నియోజకవర్గంలోని చోడవరం, రావికమతం, రోలుగుంట, బుచ్చెయ్యపేట మండలాల్లో గాలులకు పలుచోట్ల పంటలు నేలమట్టమయ్యాయి. రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. టెలికాం సేవలు స్తంభించాయి. ఫోన్లు పనిచేయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రచండ గాలులకు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. చోడవరంలోని తహశీల్దార్ కార్యాలయం పైకప్పు ఈదురుగాలులకు ఎగిరిపోయింది.
రోడ్లకుఅడ్డంగా చెట్లు కూలిపోయాయి. వాగులు, చెరువులు నీటితో నిండిపోయాయి. కాలువల్లో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. చీడికాడ, బుచ్చెయ్యపేట, రావికమతం, మాడుగుల, కె.కోటపాడు, చోడవరం తదితర మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంధకారంలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎటు చూసినా చిమ్మచీకట్లు కమ్ముకోవడంతో ప్రజలు ఆందోళన చెందారు.