కత్తిరించిన కాలుతో ఫోటోకు ఫోజు
మెక్సికో:
దైవంగా భావించే వైద్య వృత్తికి ఇద్దరు జూనియర్ డాక్టర్లు కళంకం తెచ్చారు. సాధారణంగా వైద్య విద్యార్థులు ట్రైనింగ్ సమయంలో మానవ శరీరంలోని అవయవాల గురించి తెలుసుకోవడానికి మృతిచెందినవారి శరీరాలపై పరీక్షలు నిర్వహిస్తారు. అయితే శిక్షణ సమయంలోనే ఇద్దరు జూనియర్ డాక్టర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. మానవశరీరం నుంచి తొలగించిన భాగాలను చేతిలో పట్టుకొని ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఆ అవయవాలను పట్టుకొని నవ్వుతూ ఫోటోలకు కూడా ఫోజులిచ్చారు. అంతటితో ఆగకుండా తమ ట్విట్టర్ అకౌంట్లలో పోస్ట్ చేశారు. ఇంకేముంది ఈ విషయం ఆనోట ఈ నోటపడి యూనివర్శిటీ అధికారుల దృష్టికి వెళ్లడంతో ఇద్దరిని తొలగించారు. ఈ ఘటనపై తీవ్రవిమర్శలు రావడంతో న్యాయ విచారణకు కూడా ఆదేశించారు.
కరోలినా డోమిన్గజ్ గ్రేసియా(24) తన ట్విటర్ అకౌంట్లో శరీరం నుంచి కత్తిరించిన కాలు భాగాన్ని చేతిలో పట్టుకొని నవ్వుతూ ఫోటో దిగింది. ఈ ఫోటోను పోస్ట్ చేయడమే కాకుండా 'నా మొదటి కాలు నాన్నా. ఈ ఫోటో నిన్ను ఇబ్బంది పెడితే సారీ' అంటూ పోస్ట్ చేసింది. ఈ సంఘటనపై ఉత్తర మెక్సికోలోని మోన్టెర్రీ సోషల్ సెక్యూరిటీ చీఫ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తక్షణమే వారు ప్రాక్టీస్ చేస్తున్న క్లినిక్‌ను వదిలిపెట్టి వెళ్లమని ఆదేశించారు. మరో ఫోటోలో కరోలినా కడుపు భాగానికి సంబంధించి ఓ అవయవాన్ని పట్టుకొని మరో ఫోటోలో కనిపించింది.
ఈ శరీర అవయవాలు ఎవరివి, అనే విషయం పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మృతదేహానికి సంబంధించి బంధువులు ఫిర్యాదు చేస్తే ఇద్దరు విద్యార్థినిలు ఆ కేసులో కూడా న్యాయ విచారణ ఎదుర్కోనే అవకాశం ఉంది. కాగా, దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో విద్యార్థినిలు ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఫోటోలను తొలగించారు. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించడం, సోషల్ మీడియా వాడకం విషయంలో జాగ్రత్తలు బోధించడంలో అధ్యాపకులు విఫలమయ్యారని యూనివర్సిటీ రీసెర్చర్ లూయీస్ ఆంటోనియోలోపేజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.