వైద్యురాలిపై ఆరోగ్యశాఖ మంత్రి అత్యాచార యత్నం
తనపై జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి షబ్బీర్ అహ్మద్ ఖాన్ అత్యాచారానికి యత్నించాడని ఓ మహిళ వైద్యురాలు శ్రీనగర్ నగర కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో మంత్రి షబ్బీర్ అహ్మద్‌పై కేసు నమోదు చేయాలని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గురువారం పోలీసులను ఆదేశించారు. దాంతో సదరు మంత్రిపై ఐపీసీ 354, 509 సెక్షన్ల కింద షాహీద్గంజ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. బాధితురాలి కథనం ప్రకారం... గత నెల 28వ తేదీన తాను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి షబ్బీర్‌ను కలసేందుకు రాష్ట్ర సచివాలయానికి వెళ్లానని చెప్పారు. ఆయనతో మాట్లాడుతుండా టీ ఆఫర్ చేశారని తెలిపారు.
ఆ టీ తాగిన తర్వాత తానకు మగత ఆవరించింది. అ క్రమంలో మంత్రి షబ్బీర్ అహ్మద్ తనపై అత్యాచారానికి యత్నించాడని ఆరోపించారు. దాంతో తాను అక్కడి నుంచి ఏలాగో అలా తప్పించుకుని బయటకు వచ్చానని ఆ మహిళ వైద్యురాలు వెల్లడించారు. అయితే అత్యాచార యత్నం ఆరోపణలపై స్పందించేందుకు సదరు మంత్రిగారు నిరాకరించారు.
కాశ్మీర్లో ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ప్రభుత్వంలో భాగస్వామే. కాంగ్రెస్ పార్టీకి చెందిన షబ్బీర్ అహ్మద్‌పై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆ పార్టీకి కొత్తగా తలనెప్పి మొదలైంది. మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని సీపీఐ (ఎం) పార్టీ నాయకుడు ఎం.వై. తరిగామి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి షబ్బీర్ అహ్మద్‌ను డిమాండ్ చేశారు.