భారీ విస్తరణ దిశగా పీఎన్ బీ హౌసింగ్
ఏడాదిలో మరో 21 కొత్త పట్టణాల్లోకి ప్రవేశం
♦ త్వరలో విజయవాడ,
♦ విశాఖపట్నంలలో ఆఫీసులు
♦ తెలుగు రాష్ట్రాల కోసం హైదరాబాద్లో
♦ ప్రాంతీయ కార్యాలయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న వ్యాపార అవకాశాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ ప్రకటించింది. ఇంత కాలం ఉత్తర, పశ్చిమ భారతదేశానికి పరిమితమైన పీఎన్బీ హౌసింగ్ ఇక నుంచి దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.
ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల కోసం హైదరాబాద్ కేంద్రంగా ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. బుధవారం జరిగిన కార్యక్రమంలో పీఎన్బీ హౌసింగ్ బిజినెస్ హెడ్ షాజీ వర్గీస్ ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో విజయవాడ, విశాఖపట్నంలలో కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
వచ్చే ఏడాదిలోగా దక్షిణాదిలో కొత్తగా 10 పట్టణాలకు, మిగిలిన ప్రాంతాల్లో 11 పట్టణాలకు మొత్తం 21 పట్టణాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పీఎన్బీ హౌసింగ్ దేశవ్యాప్తంగా 41 పట్టణాల్లో శాఖలను కలిగి ఉంది. ఈ నెలల్లో కంపెనీ నిర్వహిస్తున్న ఆస్తుల విలువ రూ. 25,000 కోట్ల మార్కును చేరుకోనున్నట్లు తెలిపారు. ఇందులో 27% వ్యాపారం దక్షిణాది రాష్ట్రాల నుంచే వస్తోంది.
సెంటిమెంట్ మెరుగవుతుంది
ప్రస్తుతం వడ్డీరేట్లు తక్కువ స్థాయిలో ఉన్నా మార్కెట్ సెంటిమెంట్ ఇంకా బలహీనంగానే ఉందని వర్గీస్ తెలిపారు. వచ్చే ఏడాది మధ్యస్థాయి హౌసింగ్ మార్కెట్ సెంటిమెంట్ మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని, లగ్జరీ గృహ మార్కెట్ కోలుకోవడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం దేశీయ గృహ రుణ మార్కెట్ 18 శాతం వృద్ధిని కనపరుస్తుంటే పీఎన్బీ వృద్ధి 25 శాతం కంటే ఎక్కువగా ఉందన్నారు. వచ్చే మూడు నాలుగేళ్లు కూడా మార్కెట్ వృద్ధికంటే అధిక వృద్ధిరేటును నమోదు చేయగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.