ఇద్దరు పిల్లలను హతమార్చి.. మెట్రో స్టేషనులో..
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తన ఇద్దరు పిల్లలను హతమార్చిన తర్వాత ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డిప్రెషన్ కారణంగానే అతడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వివరాలు... మాధుర్ మలానీ(44) అనే వ్యక్తి భార్య రూపాలి, కూతురు సమీక్ష(14), కొడుకు శ్రేయాన్స్(6)తో కలిసి వాయువ్య ఢిల్లీలోని షాలిమార్ భాగ్‌లో నివసిస్తున్నాడు. సాండ్‌పేపర్ ఫ్యాక్టరీ నెలకొల్పి వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న మాధుర్‌ను నష్టాలు వెంటాడాయి. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం ఫ్యాక్టరీని మూసివేసి అతడు ఇంట్లోనే ఉంటున్నాడు. ఆనాటి నుంచి మాధుర్ తల్లిదండ్రులే అతడి కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటున్నారు. ఓ వైపు ఫ్యాక్టరీ మూతపడటం.. మరోవైపు ఉద్యోగం లేకుండా ఇంటిపట్టునే ఉండటంతో మాధుర్ మానసికంగా కుంగిపోయాడు.
ఈ నేపథ్యంలో ఆదివారం మార్కెట్‌కు వెళ్లి ఇంటికి వచ్చిన రూపాలికి.. పిల్లలు సమీక్ష, శ్రేయాన్స్ విగతజీవులుగా కనిపించారు. భర్త జాడ కూడా తెలియరాకపోవడంతో ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో మాధుర్ ఇంటికి చేరుకున్న పోలీసులు పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మాధుర్ కోసం వెతుకుతుండగా.. హైదీర్‌పూర్ మెట్రో స్టేషన్ వద్ద ఓ వ్యక్తం శవం ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తిని మాధుర్‌గా గుర్తించారు. విచారణలో భాగంగా అతడు మెట్రో స్టేషను మీద నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. కాగా డిప్రెషన్‌తో బాధపడుతున్న మాధుర్ తొలుత పిల్లలను గొంతు నులిమి హత్య చేసి.. అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయం గురించి ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నామని వెల్లడించారు. ఇక భర్త, ఇద్దరు పిల్లలు శాశ్వతంగా దూరం కావడంతో రూపాలి తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
మెట్రో స్టేషను సమీపంలో మహిళా ఎస్సై దారుణ హత్య