సినిమా రివ్యూ: పిజ్జా 3డి
నటీనటులు:
అక్షయ్ ఒబెరాయ్, పార్వతి ఓమనకుట్టన్, దిపణిత శర్మ, అరుణోదయ్ సింగ్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
ఫోటోగ్రఫి: జయకృష్ణ గుమ్మడి
సంగీతం: మికీ, మెక్లియరీ, సౌరబ్ కల్సి, షామీర్ టాండన్
దర్శకత్వం: అక్షయ్ అక్కినేని
తమిళంలో అనూహ్య విజయం సాధించి కార్తీక్ సబ్బరాజును స్టార్ డైరెక్టర్ గా మార్చిన పిజా చిత్రం ఆధారంగా ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ తనయుడు అక్షయ్ అక్కినేని 3డీ ఫార్మాట్ లో 'పిజ్జాహిందీలో రీమేక్ చేశారు. హారర్, థ్రిల్లర్ అంశాలతో తమిళ, తెలుగు ప్రేక్షకులను భయపెట్టిన 'పిజ్జా' 3డి వెర్షన్ లో బాలీవుడ్ ప్రేక్షకులను ఎలాంటి అనుభూతికి లోనయ్యేలా చేసిందో తెలుసుకోవాలంటే కథ ఎంటో తెలుసుకోవాల్సిందే.
కథ:
కునాల్ (అక్షయ్ ఒబెరాయ్) ఓ పిజా డెలివరీ బాయ్. కునాల్ భార్య నిఖిత (పార్వతి ఓమనకుట్టన్) ఓ థ్రిల్లర్, హారర్ కథలు రాసే రచయిత్రి. హారర్ సంఘటనలంటే చికాకుపడే కునాల్ కు భార్య రచనలు నచ్చకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు జరగుతుంటాయి. అయితే పిజ్జా డెలివరీలో భాగంగా కునాల్ దెయ్యాలు ఉండే ఇంటిలో బందీ అవుతాడు. ఆతర్వాత ఆ ఇంటిలో కునాల్ ఎలాంటి అనుభవాల్ని ఎదుర్కొన్నారు? ఆ ఇంటి నుంచి ఎలా బయటపడ్డారు? ఇంటి నుంచి బయట పడిన తర్వాత ఏం జరిగింది అనే ప్రశ్నలకు తెర రూపమే 'పిజ్జా-3డి' చిత్రం.
నటీనటుల ఫెర్ఫార్మెన్స్:
పిజ్జా డెలివరీ బాయ్ గా నటించిన అక్షయ్ ఒబెరాయ్ అంతగా ప్రభావం చూపలేకపోయారు. ప్రేక్షకులకు భయాన్నికలిగించే విధంగా తన భావాల్ని పలికించడంలోనూ విఫలమయ్యారు. అక్షయ్ ఒబెరాయ్ నటనపరమైన లోపాలు కారణంగా కథలో ఉండే ఇంటెన్సిటీ తగ్గిపోయిందని చెప్పవచ్చు.
పార్వతి ఓమన్ కుట్టన్ పర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో నిఖిత పాత్ర పరిధి పరిమితంగా ఉండటం కారణంగా పార్వతి ఓమన్ కుట్టన్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దిపణిత శర్మ, అరుణోదయ్ సింగ్ తోపాటు మిగితా పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.
టెక్నికల్ ఫెర్ఫార్మెన్స్:
మికీ, మెక్లియరీ, సౌరబ్ కల్సి, షామీర్ టాండన్ సంగీతం బాగుంది. కృష్ణ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు, శ్రీకర ప్రసాద్ ఎడిటింగ్, జయకృష్ణ గుమ్మడి ఫోటోగ్రఫి ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. ఇక పూర్తి స్థాయిలో ఓ హారర్, థ్రిల్లర్ చూస్తున్న ఫీలింగ్ ను కలిగించడంలో దర్శకుడు అక్షయ్ అక్కినేని కొంత తడబాటుకు గురయ్యాడనిపిస్తుంది. తమిళ, తెలుగు వెర్షన్ లో పిజ్జాను రెగ్యులర్ ఫార్మాట్ లో చూసిన ప్రేక్షకులు ఓ థ్రిల్ గురయ్యారనేది వాస్తవం. అయితే 3డి ఎఫెక్ట్ లో అదనపు థ్రిల్ ను ఆశించిన ప్రేక్షకులకు నిరాశేనని చెప్పవచ్చు. పిజ్జాలో 3డి ఎఫెక్ట్స్ కొత్త అనుభూతిని కలిగించింది తక్కవే అని చెప్పవచ్చు. చిత్ర కథనంలో ద్వితీయ భాగంలో కథనం కూడా కొంత గందరగోళానికి గురి చేసింది. ఓవరాల్ గా ఆసక్తికరంగా పిజ్జాను 3డిలో మలిచి ప్రేక్షకులను భయపెట్టడానికి అక్షయ్ చేసిన ప్రయత్నం ఆకట్టుకోలేదనే చెప్పవచ్చు.