‘రోబో’ నిర్మాణాలు!
ఇసుక తవ్వకాల కోసం అక్రమంగా నదులు, వాగులు తొలిచేస్తున్నారు. దీంతో పరివాహక ప్రాంతాలు పెద్ద ఎత్తున కోతకు గురవుతున్నాయి. ఫలితంగా నేల అడుగున భూగర్భ జల మట్టాలు తగ్గుతున్నాయి. పర్యావరణానికి తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. దీన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు ఉంటేనే నదుల్లో ఇసుక తవ్వకాలు చేపట్టాలని ఆదేశించింది. దీంతో రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై ప్రతిష్టంభన నెలకొంది.
నదుల్లో ఇసుక తవ్వకాలతో భూగర్భ జల సంక్షోభం ఏర్పడుతోందని ఇసుక తవ్వకాలపై న్యాయస్థానం ఆంక్షలు విధించింది. దీంతో హైదరాబాద్ నిర్మాణ రంగం ఇసుక కొరతను ఎదుర్కొంటోంది. భారీ పెట్టుబడులతో బడా నిర్మాణ సంస్థలు ముందుకొస్తున్నా ఇసుక లేక వెనకడుగేస్తున్నాయి. దీంతో నిర్మాణ రంగం రాతి ఇసుక (రోబో సాండ్) వైపు మొగ్గు చూపుతోంది. నది ఇసుకతో పోల్చుకుంటే రోబో సాండ్ ధర కూడా తక్కువగా ఉండటం కలిసొచ్చే అంశం.
ఈ నేపథ్యంలో ‘రాతి ఇసుక’ తయారీ, వినియోగంపై ‘సాక్షి రియల్టీ’ ప్రత్యేక కథన మిది..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం హైదరాబాద్‌లో నిర్మిస్తున్న భవనాల్లో 80 శాతం రాతి ఇసుకనే వినియోగిస్తున్నారు. ప్లాస్టరింగ్ పనులకు మినహాయిస్తే మిగతా అన్నింట్లో రాతి ఇసుకనే వాడుతున్నారని శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ చీఫ్ ఇంజనీర్ ఎం సురేందర్ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. రాతి ఇసుక నాణ్యతా ప్రమాణాలను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ (ఎన్ఏసీ), నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ (ఎన్‌సీసీబీఎం), జేఎన్టీయూలు ఆమోదించాయి.
నగరంలో కేవలం ప్రభుత్వపరమైన నిర్మాణ పనులకే ఏటా 1.20 లక్షల ఘనపు మీటర్ల ఇసుక అవసరమవుతుందని అంచనా. ప్రైవేటుగా జరిగే నిర్మాణాలకైతే అంతకు రెట్టింపు ఇసుక అవసరం ఉంటుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నగరానికి రోజుకు కనీసం 20 వేల టన్నుల ఇసుక సరఫరా అవుతుంది. ప్రస్తుతం ఇసుక లభ్యత క్లిష్టంగా మారడంతో పలు నిర్మాణ సంస్థలు బోధన్, మహారాష్ట్రల నుంచి ఇసుకను అధిక ధర వెచ్చించి దిగుమతి చేసుకుంటున్నాయి.
అంతా రాతి నుంచే..
రాతి ఇసుక తయారీకి ప్రత్యేక యూనిట్ల ఏర్పాటు అవసరం. నగర శివార్లలో విరివిగా లభ్యమయ్యే గ్రానైట్ శిలలతో ఈ ఇసుకను ఉత్పత్తి చేయవచ్చు. గ్రానైట్ రాళ్లను -4.75 మిల్లీమీటర్ల మందానికి గుండ్రంగా లేదా, చతురస్రాకారంలోకి తీసుకువస్తారు. ఎందుకంటే అప్పుడే అది కాంక్రీట్‌లో కలపడానికి వీలుగా తయారవుతుంది. వివిధ సైజుల్లో ఉన్న గ్రానైట్ రాళ్లను కన్వేయర్ బెల్ట్ ద్వారా క్రషింగ్ యూనిట్‌కు పంపిస్తారు. ఇక్కడ 2ఎంఎం, 1ఎంఎం పరిమాణంలో క్రష్చేసి జల్లెడపడితే రాతి ఇసుక తయారవుతుంది. ల్యాబ్‌లో పరీక్షించిన అనంతరమే రాతి ఇసుకను మార్కెట్లోకి విడుదల చేస్తారు. రాతి ఇసుకను తయారు చేసే సమయంలో మూడు రకాల పదార్థాలు కూడా ఉత్పత్తి అవుతాయి. వీటిని రోబో సాండ్ కంటే మరో -1.2 మిల్లీమీటర్ల మందాన్ని తగ్గించి తయారు చేస్తారు.
భాగ్యనగరమే ముందు..
దక్షిణ భారతదేశంలోనే తొలి రాతి ఇసుక యూనిట్ హైదరాబాద్‌లోనే ఉంది. రోబో సిలికాన్ ప్రైవేట్ యూనిట్ పేరుతో కీసర మండలం అంకిరెడ్డి గ్రామంలో ఉంది. ఇక్కడ స్వీడన్ దేశానికి చెందిన రాక్ అండ్ హిట్ టెక్నాలజీతో రాతి ఇసుకను తయారు చేస్తారు. మూసాపేట్లో సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ సంస్థ రాక్ గార్డెన్లో నిర్మిస్తున్న ఓ భారీ ప్రాజెక్టు కోసం అక్కడ ఉన్న కొండలను బ్లాస్టింగ్ చేసి అక్కడే క్రషర్ ద్వారా రాతి ఇసుకను తయారు చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుంది. మైహోమ్ కన్స్ట్రక్షన్ సంస్థ ఇసుక కొరతను అధిగమించేందుకు సొంతంగా ఓ స్టోన్ క్రషర్ యూనిట్‌ను షాద్‌నగర్ ప్రాంతంలో కొనుగోలు చేసింది. బొల్లారంలో ఆర్క్ బిల్డర్స్ చేపట్టిన ఆర్క్హోమ్ ప్రాజెక్ట్‌లోనూ రాతి ఇసుకనే వాడుతున్నారు.
టన్ను రాతి ఇసుక రూ. 600..
నది ఇసుకతో పోల్చుకుంటే రాతి ఇసుక ధరలు తక్కువగా ఉంటాయని తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు గంధం అంజన్న చెప్పారు. నల్లగొండ, భద్రాచలం నుంచి వచ్చే ఇసుక ధర టన్నుకు రూ.1,200 నుంచి 1,300లు ఉండగా ఆంధ్ర ప్రాంతాల నుంచి వచ్చే ఇసుక ధర టన్నుకు రూ. 1,400లు ఆపైనే పలుకుతోందని వివరించారు. అదే రాతి ఇసుక ధర ఏప్రాంతంలో అయినా రూ.600లకు మించి లేదని చెప్పారు. దీంతో నిర్మాణదారులు రాతి ఇసుక వాడకంపైనే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 150 రోబోసాండ్ తయారీ యూనిట్లు వెలిశాయంటే రాతి ఇసుకకు ఉన్న గిరాకీని అర ్థం చేసుకోవచ్చు.
ఇలా చేస్తే సరి..
రోబో ఇసుకలాగే మెటల్ క్రషింగ్ స్టోన్ డస్ట్ కూడా ఉండటం వీటిలో నాణ్యమైన ఇసుకను గుర్తించడం కష్టంగా మారుతోంది.
రాతి ఇసుకతో సిమెంట్ వాడకం సగానికి తగ్గిపోతుంది.
పటిష్టత, నాణ్యత విషయంలో నది ఇసుక కంటే రాతి ఇసుక వంద రెట్లు మెరుగైంది.
గంటకు 10 లారీల రాతి ఇసుకను ఉత్పత్తి చేయవచ్చు.
చిన్నపాటి రాతి ఇసుక యూనిట్ ఏర్పాటుకైనా కనీసం రూ.10 కోట్ల పెట్టుబడి అవసరం. ఔత్సాహికులు ఇంత భారీ మొత్తం సమకూర్చుకునే అవకాశం తక్కువ. అందుకే రుణాలు, ఇతర ప్రోత్సాహకాలతో పాటు విద్యుత్ రాయితీలు ఇవ్వాలి.
యూనిట్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న వెంటనే క్షేత్ర పరిశీలనలు నిర్వహించి అనుమతులు ఇస్తే ఉత్పత్తి త్వరితంగా ప్రారంభించే వీలుంటుంది. నిబంధనలను ఉల్లఘించిన వారిపై చర్యలు తీసుకోవాలి.
నిరుద్యోగ యువతను బృందాలుగా ఏర్పాటు చేసి యూనిట్ల ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తే ఉపాధి సమస్య కూడా తీరుతుంది.
నదుల్లో ఇసుక తవ్వకాల అనుమతులు పూర్తిగా నిలిపివేసి, నిర్మాణరంగంలో రాతి ఇసుక వినియోగాన్ని తప్పనిసరి చేయాలి.
కనీసం 150-200 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న యూనిట్ల ఏర్పాటు కొంత లాభదాయకంగా ఉంటుంది.