స్క్రీన్ ప్లే ఒకటే...కథ వేరు
ముంబై: నగర పోలీసు కమిషనర్ పదవి నుంచి రాకేశ్ మారియాను తప్పించడంలో 20 ఏళ్ల క్రితం జరిగిన చరిత్రే పునరావృతమైంది. అదే స్క్రీన్ ప్లే, అదే ఉద్వాసన పర్వం చోటుచేసుకుంది. 1992, డిసెంబర్ నెలలో బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరం జరిగిన అల్లర్లు, 1993లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల సంఘటనల మూలాలా కూపీని లాగేందుకు ప్రయత్నించడంతో నాడు ముంబై పోలీసు కమిషనర్‌గా ఉన్న అమరజీత్ సింగ్ సామ్రాను ఆ కుర్చి నుంచి తప్పించారు. ఇప్పుడు షీరా బోరా హత్య కేసులో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న రాకేశ్ మారియాను పదోన్నతి పేరిట పదవి నుంచి తప్పించారు.
రాకేశ్ మారియా, సామ్రాలు ఇద్దరూ పబ్లిసిటీ పిచ్చోళ్లే. మీడియాకు మంచి మిత్రులే. ఇద్దరూ శాఖాపరంగా పోలీసు వ్యవస్థలో ఉన్న లోపాలను బహిరంగంగా ఒప్పుకోవడంలో ఎప్పుడూ సంశయించిన సందర్భాలు లేవు. పబ్లిసిటీ పిచ్చి తమ హక్కని, అది పోలీసులకు ఉండరాదన్నది రాజకీయ నేతల పిచ్చి నమ్మకం. విలేకర్ల సమావేశాల్లో నోరు మరీ అంతగా విప్పి మాట్లాడవద్దని 20 ఏళ్ల క్రితం నాడు కేంద్ర హోం మంత్రిగా ఉన్న ఎస్బీ చవాన్ బహిరంగంగా సామ్రాకు హితవు చెప్పారు. హోం మంత్రి, అందులోనూ హెడ్మాస్టర్ లాంటి ఎస్బీ చవాన్ లాంటి వ్యక్తి చెబితే వినాలా, వద్దా ? పర్వవసానంగా వారం రోజుల్లోనే సామ్రా కుర్చీని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆయన స్థానంలో వచ్చిన సతీష్ సాహ్నీ పబ్లిసిటీ జోలికి వెళ్లకుండా తన పనేదో తాను కామ్‌గా చేసుకుపోయారు. అప్పటికి ముస్లింల హృదయాల్లో రగులుతున్న అగ్నిని చల్లార్చడంలో విజయం సాధించారు. వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు మొహల్లా కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ కమిటీలు ఇప్పటికీ పనిచేస్తున్నాయి. అయినా ఆ ఘనత తనదేనంటూ సాహ్నీ ఎన్నడూ మీడియా ముందు గొంతు విప్పుకోలేదు. అయినప్పుటికీ ఆ రోజుల్లోని పరిస్థితులను చక్కదిద్దడంలో ఆయన చూపిన చొరవకు మీడియా ఎక్కువనే ప్రచారం ఇచ్చింది.
ప్రస్తుత షీరా బోరా హత్య కేసులో రాకేశ్ మారియా అత్యుత్సాహం చూపించడం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఎందుకో నచ్చలేదు. షీనా బోరా హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జియాను, ఇతర నిందితులను ఇంటరాగేట్ చేయడం కోసం మారియా ఖర్ పోలీసు స్టేషన్లోనే మకాం వేశారు. ఈ నెలాఖరులోగానే ఈ కేసును పూర్తిగా ఛేదించేస్తానని మీడియా ముందు సవాల్ కూడా చేశారు. ముంబై కమిషనర్‌గా ఆయన ఇచ్చిన ఆఖరి ప్రకటన బహూశ ఇదే కాబోలు. ఈలోగానే తనకు డీఐజీగా పదోన్నతి కల్పిస్తూ అంతగా ప్రాముఖ్యతలేని హోంగార్డ్స్ విభాగానికి బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వులు వచ్చాయని తెల్సింది. అప్పుడు క్రాఫోర్డ్ మార్కెట్లోని తన కార్యాలయానికి వెళ్లి ఆ ఉత్తర్వులను అందుకున్నారు. మీడియాకు మిత్రుడవడంతో మారియా బదిలీ వార్తకు పత్రికలన్నీ విశేష ప్రాధాన్యతనిచ్చాయి. దాంతో కంగుతిన్న ఫడ్నవీస్.....షీనా బోరా హత్య కేసును మాత్రం మారియానే పర్యవేక్షించేలా ఉత్తర్వులు జారీ చేశారు.
మారియా బదిలీ వ్యవహారంలో షీనాబోరా కేసులోని నిందితులు ఫడ్నవీస్‌ను ప్రభావితం చేశారా ? అన్న ప్రశ్నకు ఆధారాలు మాత్రం ప్రస్తుతానికి లేవు. కానీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్‌కు మారియా మంచి మిత్రుడన్న విషయం అందరికి తెల్సిందే. మీడియా ముందు మారియా అతిగా ప్రచారం పొందడం కూడా ఫడ్నవీస్‌కు నచ్చలేదన్నది ఆయన సన్నిహిత వర్గాల కథనం. మరి ప్రచారం ప్రజానాయకులకుండాలిగానీ పోలీసులకుంటే ఎలా !