అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీకి షేక్ జాఫ్రీన్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బధిర టెన్నిస్ క్రీడాకారిణి షేక్ జాఫ్రీన్ యూత్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి జూన్ 1 వరకు జర్మనీలోని హంబర్గ్‌లో ఈ టోర్నీ జరగనుంది. నగరానికి చెందిన జీవీకే ఫౌండేషన్ స్పాన్సర్షిప్ చేయడంతో ఆమె అక్కడికి బయలుదేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు బధిర టెన్నిస్ టోర్నీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆమెకు మొయినాబాద్‌లోని సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ ఉచిత శిక్షణ ఇస్తోంది. గతేడాది బల్గేరియాలోని సోఫియాలో జరిగిన బధిర ఒలింపిక్స్‌లో జాఫ్రీన్ చక్కని ఆటతీరు ప్రదర్శించింది. అక్కడ ఆమె క్వార్టర్ ఫైనల్ దాకా పోరాడింది. 2012లో న్యూఢిల్లీలో జరిగిన జాతీయ బధిర టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఆమె సింగిల్స్, డబుల్స్‌లో బంగారు పతకాలు సాధించింది. మూడుసార్లు జాతీయ స్కూల్ గేమ్స్‌లో ఆంధ్రప్రదేశ్ తరఫున కాంస్య పతకాలు గెలిచింది.