Sanjana Thakur: కామన్వెల్త్ బహుమతి గెలిచిన అమ్మ కథ
ఆధునిక జీవితం అమ్మను ఎక్కడకు చేర్చింది?వృద్ధాశ్రమానికి.ఒకమ్మాయికి వృద్ధాశ్రమంలో నుంచి ఒక తల్లిని ఇంటికి తెచ్చుకోవాలని అనిపిస్తుంది. కాని వృద్ధాశ్రమంలో చూస్తే అందరు తల్లులూ అద్భుతంగా అనిపిస్తారు. ఇంత మంచి తల్లులను ఎందుకు పెట్టారోనని సంజనా ఠాకూర్ రాసిన కథ కామన్వెల్త్ ప్రైజ్ 2024 గెలుచుకుంది. సంజనా ఠాకూర్ పరిచయం.‘స్కూల్ టీచర్లకు నన్ను తిట్టాలని ఉండేది. కాని తిట్టలేకపోయేవారు. సంజనా బాగా చదువుతుంది... హోమ్ వర్క్ చేస్తుంది... కాని క్లాస్ జరుగుతుంటే టేబుల్ కింద కూచుని కథల పుస్తకం చదువుతోంది అని కంప్లయింట్ చేసేవారు. నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలంటే అంత పిచ్చి. మా అమ్మ రోజూ నాకు కథలు చదివి వినిపించేది. నేను మా ఫ్యామిలీ ఫంక్షన్లకు వెళ్లినా పార్టీలకు వెళ్లినా పుస్తకం పట్టుకుని మూలన కూచునేదాన్ని. చిన్నప్పుడే రాయడం మొదలెట్టాను. ఇప్పుడు ఈ గుర్తింపు రావడం సంతోషంగా ఉంది’ అంటుంది 26 సంవత్సరాల సంజనా ఠాకూర్. ముంబైకి చెందిన సంజన ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ లో ఎం.ఎఫ్.ఏ. ఫిక్షన్ చదువుతోంది. ప్రతి ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘కామన్వెల్త్ షార్ట్ స్టోరీ ప్రైజ్’ పోటీల్లో పాల్గొని 2024 సంవత్సరానికి విజేత అయింది.ఐదు లక్షల బహుమతికామన్వెల్త్ దేశాలలోని యువ రచయితలను ఉత్సాహపరచడానికి కామన్వెల్త్ ఫౌండేషన్ ఏటా కథల పోటీ నిర్వహిస్తుంది. 18 ఏళ్లు పైబడిన వారు దీనికి అర్హులు. నేరుగా ఇంగ్లిష్‌లో కాని లేదా ఇంగ్లిష్‌లో అనువాదమైన స్థానికభాష కథగాని పంపవచ్చు. 2500 పదాల నుంచి 5000 పదాల వరకూ కథ ఉండాలి. ఇందులో మళ్లీ ఐదు రీజియన్లకు (ఆఫ్రికా, ఆసియా, కెనడా–యూరప్, పసిఫిక్) ఐదుగురు రీజనల్ విన్నర్స్‌ను ప్రకటిస్తారు. వీరి నుంచి ఓవరాల్ విన్నర్‌ను ఎంపిక చేస్తారు. 2024కు ఆసియా రీజనల్ విన్నర్‌గా నిలిచిన సంజనా ఠాకూర్ ఓవరాల్ విన్నర్‌గా కూడా ఎంపికైంది. నగదు బహుమతిగా 5000 పౌండ్లు గెలుచుకుంది.కథ పేరు ఐశ్వర్యారాయ్‘అమెరికాలో నేనొక బొమ్మల షాపులో తిరుగుతున్నప్పుడు కేవలం అమ్మ బొమ్మలు అమ్మే ఒక షాప్ ఉంటే ఎలా ఉంటుందా అనే ఆలోచన వచ్చింది. అక్కడినుంచి పిల్లలు అమ్మల్ని దత్తత తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన కొనసాగింది. ఇండియాలో పట్టణ సంస్కృతి ఇప్పుడు ఇళ్లల్లో అమ్మకు చోటు లేకుండా చేస్తోంది. ఆమె వృద్ధాశ్రమంలో ఉండాల్సి వస్తోంది. నా కథలో అన్వి అనే అమ్మాయి ఒక వృద్ధాశ్రమానికి వెళ్లి ఒక అమ్మను దత్తత తీసుకోవాలనుకుంటుంది. కాని ఒక్కో అమ్మ ఒక్కో లక్షణంలో గొప్పగా కనిపిస్తుంది. అమ్మలందరూ తమ అనుబంధం రీత్యా ఐశ్వర్యారాయ్ కంటే తక్కువ సౌందర్యవతులు కాదు. ఏ అమ్మ సౌందర్యమైనా బంధం రీత్యా ఐశ్వర్యారాయ్ అంత అందమైనదే. అందుకే ఆ పేరుతోనే కథ రాశాను. వ్యంగ్యం, చెణుకులు ఉండటంతో నా కథను జడ్జిలు మెచ్చుకొని ఉండొచ్చు’ అని తెలిపింది సంజనా.త్వరలో పుస్తకం‘త్వరలో 15 కథలతో నేను పుస్తకం తెస్తాను. ఇప్పటికే రాశాను. అందులో అన్ని కథల్లోనూ తల్లులూ కూతుళ్లు కనిపిస్తారు. వారి భిన్న భావోద్వేగాలు చర్చకు వస్తాయి. ప్రస్తుతం నా థీసిస్‌లో భాగంగా ఈ కథలను సబ్మిట్ చేయగానే పుస్తకం పని మొదలెడతాను. ప్రపంచ సాహిత్యంలో చాలా మంచి రచనలు వస్తున్నాయి. మన దేశం నుంచి అరుంధతి రాయ్ శైలి నాకు బాగా నచ్చుతుంది’ అందామె.సాహిత్యాన్ని ఒక చదువుగా... రచనను ఒక ఉపాధిగా చేసుకోదలిచింది సంజన.