రోడ్డు బాగోలేదని హెలికాప్టర్ తయారు చేసుకున్నాడు
దిస్పూర్: రోడ్డు బాగలేకపోతే సాధారణంగా మనమైతే ఏం చేస్తాం? ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం.. రోడ్డు వేయకుంటే ధర్నా చేస్తాం.. ప్రభుత్వం కూడా రహదారి నిర్మించలేని ప్రాంతమైతే ఏదో ఒకలా ఆ పని పూర్తి చేయండంటూ ప్రాధేయపడుతాం. కానీ, అసోంలో ఓ మెకానిక్ మాత్రం పై వాటిల్లో ఏ పనీ చేయలేదు. తన మేధస్సుకు పదును పెట్టాడు. రహదారి కూడా సరిగా లేని తన గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు ఎలాంటి చిక్కులు లేకుండా వెళ్లేందుకు ఏకంగా హెలికాప్టర్‌నే తయారు చేసుకున్నాడు. అసోంలోని శ్యాంజులి అనే ఎజెన్సీ గ్రామానికి చెందిన చంద్ర సివోక్తి శర్మ అనే వ్యక్తి మెకానిక్‌గా పనిచేస్తున్నాడు.
వారిది పేద కుటుంబం. పెద్దగా స్కూల్‌కి కూడా వెళ్లేవాడు కాదు. కానీ, అతడు చేసిన ఆవిష్కరణ ముందు మాత్రం ఎలాంటి డిగ్రీలు, పట్టాలు కూడా సాటిరావని నిరూపించాడు. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ కూడా నూతన ఆవిష్కరణలు చేయాలని, వాటికి ప్రతి ఒక్కరు స్వాగతం పలకాలని ప్రతి కార్యక్రమంలో చెప్పిన విషయం తెలిసిందే. అతడు ఈ స్లోగన్‌ను ఆదర్శంగా తీసుకున్నాడో లేక, తన గ్రామ పరిస్థితిని అధిగమించాలనుకున్నాడో.. మొత్తానికి సొంతంగా ఓ హెలికాప్టర్‌ను తయారు చేసుకోవడంతోపాటు దాన్ని గాల్లో కూడా ఎగిరించాడు. దీని నిర్మాణం కోసం అతడు చేసిన ఖర్చు 15లక్షల రూపాయలు. ఈ హెలికాప్టర్ ఇద్దరు వ్యక్తులను 30 నుంచి 50 అడుగుల ఎత్తులో తీసుకెళ్లగలదని చంద్ర మీడియాతో తెలిపాడు.