69 ఏళ్ల తర్వాత..!
డెహ్రాడూన్: దాదాపు 69 ఏళ్ల తర్వాత ఓ గ్రామ ప్రజల ఆశలు నెరవేరాయి. ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలోని శిల్పట కుగ్రామానికి మొదటి సారి బస్సు వెళ్లింది. మండల కేంద్రం నుంచి 21 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ గ్రామానికి రోడ్డు సదుపాయం కోసం గ్రామస్తులు 69 ఏళ్లుగా ఎదురుచూశారు.
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఆ ఊరికి రోడ్డు రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ కాలంలో రోజువారీ వినియోగవస్తువుల కోసం కొన్ని కిలోమీటర్ల మేర కొండల్లో నుంచి నడిచి వెళ్లే వాళ్లమని ఊరిలోని కొంతమంది పెద్దలు తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి గ్రామానికి రోడ్డు వేసి బస్సును నడుపుతారని ఆశగా ఎదురుచూశామని చెప్పారు. వారి జీవితాలు ముగిసిపోయేలోగానైనా ఈ ఆశ నెరవేరినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఉత్తరాఖండ్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ బస్సు ఊరికి చేరగానే ఆ గ్రామానికి చెందిన మహిళలు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. గ్రామానికి రోడ్డు వచ్చేందుకు కృషి చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనసూయ ప్రసాద్ మైఖురీకి ధన్యవాదాలు తెలిపారు. రెండేళ్ల క్రితమే రోడ్డు ప్రాజెక్టు పూర్తి కావాల్సివుండగా అనివార్యకారణాలతో ఆగిపోయినట్లు మరి కొందరు గ్రామస్తులు చెప్పారు. రోడ్డు నిర్మాణం కోసం ఎన్నోమార్లు నిరాహార దీక్షలు, ర్యాలీలు నిర్వహించినట్లు వివరించారు.