దేవులపల్లి కృష్ణశాస్త్రిని స్మరించుకున్న టాంటెక్స్
డల్లాస్ (టెక్సాస్) :
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో 'నెల నెలా తెలుగువెన్నెల' సాహిత్యసదస్సును డల్లాస్లోని దేశీ ప్లాజా టీవీస్టూడియోలో నిర్వహించారు. సాహిత్య వేదిక సమన్వయకర్త సింగిరెడ్డి శారద అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. డల్లాస్లోని భాషాభిమానులు, సాహిత్య ప్రియులు పెద్ద ఎత్తున ఈ సమావేశానికి హాజరయ్యారు.
సింగిరెడ్డి శారద సభను ప్రారంభిస్తూ 115వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుకి విచ్చేసిన సాహితీ ప్రియులకు స్వాగతంపలికారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా దేవులపల్లికృష్ణశాస్త్రి రచించిన భక్తిగీతాలను ప్రభలశ్రీని, దీపిక, ప్రభలఉమ, ప్రభలఅంజలి, చాగంటిశ్రీక, ఎడవల్లి శ్రేయ, మద్దుకూరిమహిత, మద్దుకూరిఅభినుతి, అనసారపుశ్రేయాస్, రాయవరం స్నేహిత్, ప్రభల ఆరతిలు ఆలపించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన కొన్ని సినీగీతాలను వడ్లమన్నాటి నాగి, శ్రీలక్ష్మి, శ్రీనివాస్ ఇయ్యుణ్ణి పాడారు. సాహిత్యవిశ్లేషకుడు వేముల లెనిన్ బాబు ఆంధ్రమహా భారతం అవతారికలోని విశేషాలను ప్రస్తావించారు. డల్లాస్కి చెందిన సాహిత్యాభిమాని మద్దుకూరి విజయచంద్రహాస్ 'ఆంధ్రనగరి' పుస్తకాన్ని పరిచయం చేశారు.
జంధ్యాల మాటలతో తోకల గోపి కడుపుబ్బా నవ్వించారు. జువ్వాడి రమణ తెలుగు సాహిత్యంలో ముస్లిం రచయితలు అనే అంశం పై ప్రసంగించారు. దేవులపల్లి కృష్ణ శాస్త్రి రచించిన 'కొలువైతివా రంగసాయి' గేయానికి గురు పరంపరస్కూల్ అఫ్ఆర్ట్స్ నుంచి హేమమాలిని చావలి శిష్యురాలు సనంపూడి కౌముది నాట్యం చేశారు. కూచిపూడి కళాక్షేత్ర పద్మసొంటి శిష్యులు విళ్లా అమూల్య, కటసానిగీతిక 'భోశంభో' పాటకి నాట్యం చేశారు.
115వ నెలనెలాతెలుగువెన్నెల సదస్సుకి ముఖ్య అతిథిగావిచ్చేసిన విశ్వకళా భారతి డా.రత్నకుమార్ భావ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రిసాహిత్యం - అనుభూతులు అంశం మీద ప్రసంగించారు. తాతగారితో తనకున్నఅనుభవాలను గుర్తుచేసుకుంటూ ఆ సాహితీ జ్ఞాపకాలను సభతో పంచుకున్నారు. పలు ప్రముఖ గేయాలకు వింజమూరి అనసూయతో స్వరపరుచుకోవడం తనకు బాగా గుర్తు అని చెప్పుకొచ్చారు. కృష్ణశాస్త్రి రాసిన 'జయ జయ ప్రియ భారత' గేయం భారత దేశ జాతీయ గీతం అయితే ఎంతో బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గురించి పలువురి ప్రశ్నల కుడా. రత్నకుమార్ ఓపికగా సమాధానాలిచ్చారు.
టాంటెక్స్ అధ్యక్షులు ఉప్పలపాటికృష్ణారెడ్డి, తక్షణ పూర్వాధ్యక్షులు జొన్నల గడ్డ సుబ్రహ్మణ్యం, సంయుక్త కార్యదర్శి కోడూరుకృష్ణారెడ్డి, సంయుక్త కోశాధికారి మండిగ శ్రీలక్ష్మి, పాలకమండలి అధిపతి రొడ్డా రామక్రిష్ణారెడ్డి, పాలకమండలి సభ్యులు రుమాళ్ల శ్యామల, కన్నెగంటి ఛంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు పార్నపల్లి ఉమామహేశ్వర్, కొణిదల లోకేష్ నాయుడు, పాలేటి లక్ష్మి, తోపుదుర్తి ప్రబంద్ ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు.