సిట్టింగ్ స్థానాలు పదిలమేనా?
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో కాంగ్రెస్ కంచుకోటకు బీటలు వారనున్నాయా? 2009 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో 8 స్థానాలను నెగ్గి తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకున్న కాంగ్రెస్ పార్టీ.. తాజా ఎన్నికల్లో ఆ స్థానాలన్నింటినీ నిలుపుకోవడం అనుమానమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఈసారీ గెలుపు తమదే అన్నట్లు ఆ పార్టీ సిట్టింగ్ అభ్యర్థులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ.. ఇదే అంశంపై లోలోపల అందరిలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో బుధవారం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలిస్తే ఇదే విషయం అవగతమవుతోందని రాజకీయ వర్గల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇంకా రెండు వారాల వ్యవధి మిగిలి ఉండడంతో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించడానికి సహకరించిన సాంప్రదాయ ఓటర్లలో కొన్ని వర్గాలు ఈ సారి రూట్ మార్చి ‘కారు’కు దారి సుగమనం చేశారని పరిశీలకులు భావిస్తున్నారు. భారీ సంఖ్యలో నమోదైన యువ ఓటర్లు సైతం ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా బరిలో దిగడంతో శాసన సభ స్థానాల పోలింగ్ సరళిపై కాంగ్రెస్ పార్టీ ప్రతికూల ప్రభావం పడినట్లు సమాచారం. గత ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ స్థానాన్ని టీఆర్ఎస్ కైవలం చేసుకున్నా.. దీని పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతోనే ఇది సాధ్యమైంది. అప్పట్లో మెజారిటీ ఓటర్లు లోక్‌సభ ఓటును టీఆర్ఎస్కు, అసెంబ్లీ ఓటును కాంగ్రెస్‌కు వేశారు. ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌ను నివారించడానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా మెదక్ లోక్‌సభ నుంచి బరిలో దిగడం కొంత మేరకు ఫలితం చూపినట్లు తెలుస్తోంది.
దీంతో కాంగ్రెస్ పార్టీ కొన్ని సిట్టింగ్ స్థానాలు కోల్పోవడం ఖాయమనే భావన అంతట వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో సిద్దిపేట అసెంబ్లీ స్థానంతో సరిపెట్టుకున్న టీఆర్ఎస్ ఈసారి ఫలితాల్లో మెరుగైన ప్రదర్శన ఇచ్చే అవకాశాలున్నట్లు ఆ పార్టీ వర్గాలు ఘంటాపథంగా చెప్పుతున్నాయి. మరోవైపు టీడీపీ ఉన్న ఒక స్థానాన్ని నిలుపుకోవడం కష్టంగా మారిందన్న చర్చ జరుగుతోంది. ఒక వేళ ఆ పార్టీ సిట్టింగ్ స్థానమైన మెదక్‌ను కోల్పోయినా .. జహీరాబాద్, పటాన్చెరు అసెంబ్లీ స్థానాలను గెలుచుకునే స్థాయిలో పోటీ ఇచ్చింది. అయితే, బీజేపీతో పొత్తు వల్ల ఈ రెండు స్థానాల్లో నిర్ణయాత్మకంగా ఉన్న మైనారిటీ ఓటర్లు టీడీపీకి దూరం కావడంతో ఈ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ దుకాణం మూతపడనుందని చర్చ జరుగుతోంది.