కూరగాయల ధరలు 25 శాతం పెరుగుతాయ్
ఆసోచామ్, స్కైమెట్ వెదర్ వెల్లడి
న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో కూరగాయల ధరలు 20 నుంచి 25 శాతం వరకూ పెరిగే అవకాశాలున్నాయని ఒక నివేదిక పేర్కొంది. కోతకు రావలసిన పంట 25-30 శాతం వరకూ నాశనమైందని ఆసోచామ్-స్కైమెట్ వెదర్ల అధ్యయనంలో వెల్లడైంది. అకాల వర్షాలు, ఉష్ణప్రవాహాలు దీనికి కారణమని ఈ నివేదిక తెలిపింది.
మామిడి, ఆరటి, ద్రాక్ష, తదితర ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని, ఈ ప్రభావంతో ధరలు ఇప్పటికే పెరిగాయని పేర్కొంది. అకాల వర్షాల కారణంగా గోధుమలు, నూనె గింజలు, పప్పు దినుసుల వంటి ప్రధాన పంటలపై ప్రభావం పడిందని పేర్కొంది. టొమోటో, కాలీఫ్లవర్ కొత్తమీర వంటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపింది. కాగా, మొత్తం 14 రాష్ట్రాల్లో 106.73 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ ఏడాది జూన్-సెప్టెంబర్ కాలానికి వర్షాలు సాధారణంగానే కురుస్తాయని ఈ నివేదిక వెల్లడించింది.