ఓ నారీ.. నీరాజనం
మేము సైతం అన్ని రంగాల్లో..అంటూ మహిళలు ‘రాణి’స్తున్నారు.. విద్య, ఉద్యోగాల్లో పురుషులకు దీటుగా తమ సత్తా చాటుతున్నారు..
గరిట తిప్పడమే కాదు.. శాంతిభద్రతల రక్షణలోనూ ముందుంటున్నారు ‘క్రీడా లక్ష్మి’లుగా.. వ్యవసాయ క్షేత్రంలో శిక్షకులుగా. బహుముఖ ప్రజ్ఞతో ఆకాశమే హద్దుగాదూసుకుపోతున్నారు.. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా విజయం వాకిట పరుగులు తీస్తున్ననవ నారీమణులకు ఇదే నీరాజనం!
తరం మారుతోంది ... స్వరమూ మారుతోంది. తరాన్ని తీర్చిదిద్దేశక్తి తనకూ ఉందంటూ నేటి తరుణీమణులు నడుం బిగుస్తున్నారు. విద్య, ఉద్యోగ, వ్యాపార.. తదితర రంగాల్లో రాణిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆడపిల్లపుడితే తల్లిదండ్రులు తల్లడిల్లిపోయేవారు... పదో తరగతి చదివిస్తే గొప్ప ... ఇంటికే పరిమితం చేసేవారు ... ఇదంతా గతం... మహిళలు మగాడికంటే ఏ విషయంలోనూ తక్కువకాదంటూ డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు.. ఇలా అన్ని రంగాల్లోనూ తమదైన ముద్రవేస్తూ ఆకాశమే హద్దుగా ముందుకు దూసుకుపోతున్నారు ప్రస్తుతం. ఇందుకు అనేక ఉదాహరణలున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో వివిధ రంగాల్లో రానిస్తున్న మహిళల గురించి తెలుసుకుందాం..
జిల్లాలో మొత్తం జనాభా 45,29,009.
వీరిలో పురుషులు 22,68,312. స్త్రీలు 22,60,697. ప్రతి వెయ్యిమంది పురుషులకు 2001లో 978 మంది స్త్రీలు ఉండగా, 2011 నాటికి ఈ సంఖ్య 997కు పెరిగింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచి 10వ తరగతి వరకు చదివే మొత్తం విద్యార్థులు 3.50 లక్షలు మంది.వారిలో 2.12 లక్షల మంది ఆడపిల్లలే . గత ఏడాదికంటే ఈ సంవత్సరం 32 వేల మంది బాలికలు పెరిగారు. జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలు 65 వేలు మంది ఉన్నారు. వీరిలో 36 వేల మంది చిన్నారులు బాలికలే. జిల్లాలో 2001 నాటికి మహిళా అక్షరాస్యత 11,53,713 మంది ఉండగా 2011కి ఈ సంఖ్య 14,35,620కి పెరిగింది.2001నుంచి 2011 వరకు గణాంకాలు పరిశీలిస్తే పురుషుల అక్షరాస్యతా శాతంలో పెరుగుదల కంటే స్త్రీల అక్షరాస్యతా శాతంలోనే పెరుగుదల ఎక్కువగా ఉంది. పురుషుల అక్షరాస్యతలో పెరుగుదల 5 శాతం ఉండగా, స్త్రీలది 6 శాతం ఉంది.