బియ్యం ధరకు రెక్కలు
సాక్షి, కర్నూలు: జిల్లాలో ‘సన్న’గా సాగుతున్న దోపిడీ ఇది. ‘కృత్రిమ’ంగా తయారవుతున్న కుట్ర ఇది. అధికారుల ఉదాసీనత.. అక్రమార్కుల సైగలతో నల్లబజారు తలుపులు బార్లా తెరుచుకుంటున్నాయి. ఫలితంగా పెరిగిన ధర మార్కెట్లో రాజ్యమేలుతుంది. మధ్య తరగతిని అతలాకుతలం చేస్తోంది. జిల్లాలో సన్న బియ్యం ధర ఆకాశాన్నంటుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ధర రికార్డు స్థాయిలో పెరిగింది. సోనా మసూరి పాత బియ్యం ప్రస్తుతం క్వింటా రూ. 5 వేలుపైనే పలుకుతోంది.
బ్రాండ్ పేరుతో కొందరు క్వింటా రూ. 5,400కు అమ్ముతున్నారు. గత నెలలో రూ.4600 ఉండేది. స్వర్ణ రకం బియ్యం ధర కూడా ఇదే తరహాలో చుక్కలను తాకుతోంది. వ్యాపారులు, మిల్లర్లు బహిరంగ మార్కెట్‌ను తమ గుప్పిట్లో ఉంచుకోవడంతో సమస్య తలెత్తుతోంది. కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో యంత్రాంగం పెద్దగా ఇటువైపు దృష్టి సారించకపోవడంతో బడా వ్యాపారులు చెలరేగిపోతున్నారు. దీంతో వ్యాపారులు, మిల్లర్లు ఆడిందే ఆటగా తయారైంది. పరిస్థితి ఇలాగే ఉంటే ధర మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
జిల్లా అవసరాలకు..
జిల్లాలో ఏడాదికి ఉత్పత్తయ్యే ధాన్యం (రెండు పంటలు కలిపి) 80 లక్షల టన్నులు. ఉత్పత్తయ్యే ధాన్యాన్ని బియ్యంగా తయారు చేస్తే 52 లక్షల టన్నులవుతాయి. 42 లక్షల జనాభా ఉన్న జిల్లా ప్రజల అవసరాలకు ఇందులో ఆరేడు లక్షల టన్నుల బియ్యం సరిపోతాయి. జిల్లాలో ఎక్కువగా కర్నూలు సోనా, స్వర్ణ రకం బియ్యం వినియోగిస్తున్నారు. అయితే జిల్లాలో ఎక్కువగా వినియోగించే సోనామసూరి రకం ఉత్పత్తి 35 లక్షల టన్నులుంటుంది.
జిల్లాలో పండించే ధాన్యాన్ని విశాఖ, కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు విదేశాలకు ఎక్కువగా ఎగుమతి జరుగుతోంది. ప్రస్తుతం పలుకుతున్న ధర గతంలో ఎప్పుడూ లేదని పలువురు ఆందోళన చెందుతున్నారు. బియ్యం ధర తలుచుకుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. గతంలో ఎగువ, మధ్య తరగతి ప్రజలు మాత్రమే వినియోగించే సన్నాలు ఇపుడు సామాన్యులు సైతం వినియోగిస్తున్నారు.
కృత్రిమ కొరత సృష్టిస్తూ..
ఇది పరిస్థితి కొనసాగితే కేజీ రూ. 60 దాకా పెరగవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. పెరిగిన బియ్యం ధర మధ్యతరగతి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పెరిగిన ధర వల్ల జిల్లా ప్రజలపై ఏడాదికి రూ. 300 కోట్ల వరకూ అదనపు భారం పడే అవకాశముంది. బియ్యం ధర పెరగడానికి అక్రమార్కులైన కొందరు వ్యాపారులు, మిల్లర్లు అత్యాశకు పోయి కృత్రిమంగా కొరత సృష్టిస్తుండడమే కారణం. రైతుల నుంచి ధాన్యం కొనేటప్పుడు ధర తక్కువగా ఉంటోంది. బియ్యం కొనే వినియోగదారులకు మాత్రం చుక్కలు చూపిస్తున్నారు. అయిదుగురు కుటుంబ సభ్యులున్న కుటుంబానికి 50 కేజీల బియ్యం అవసరమవుతాయి. నెలకు రూ. 2,500 వరకు బియ్యానికే కేటాయించాల్సి వస్తోందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పనికిరాని రూ. 30 బియ్యం..!
ధరలను నియంత్రించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడంతో మార్కెట్ మిల్లర్లు, వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. గత సంవత్సరం బియ్యం ధరను నియంత్రించడానికి ప్రభుత్వం సోనా బియ్యాన్ని కేజీ రూ. 30కే అమ్మే ప్రయత్నం చేసింది. అయితే అందులో నూకలు ఎక్కువగా ఉండటం, అన్నం ముద్దవుతుండడంతో కొనుగోలుకు ప్రజలు ముందుకు రాలేదు. ఈ బియ్యాన్ని ఇప్పుడు రైతు బజార్లలో అమ్మకానికి పెట్టినా ఆదరణ లభించడంలేదు. నాణ్యత లేకపోవడంతో వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. ఇవి వృథాగా పడి ఉన్నాయి. యంత్రాంగం ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు ప్రారంభించాలని, అక్రమ నిల్వలు వెలికి తీసి అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు.