‘వయో’కు సోనీ గుడ్‌బై
టోక్యో/న్యూయార్క్: సోనీ... ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో ఒకప్పుడు రారాజుగా నిలిచిన ఈ రెండక్షరాల కంపెనీ ఇప్పుడు పుట్టెడు కష్టాలతో నెట్టుకొస్తోంది. వ్యాపారంలో అంతకంతకూ నష్టాలు పేరుకుపోతుండటంతో గట్టెక్కే ప్రయత్నాల్లో పడింది. ఇందులోభాగంగా పర్సనల్ కంప్యూటర్ల(పీసీ) వ్యాపారం(వయో బ్రాండ్‌తో ల్యాప్‌టాప్‌లు, నోట్‌బుక్‌లను విక్రయిస్తోంది) నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించింది. అంతేకాదు నష్టాలు తగ్గించుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా 5,000 మంది సిబ్బందికి ఉద్వాసన చెబుతున్నట్లు కూడా వెల్లడించింది.
వయో బ్రాండ్ పీసీ బిజినెస్‌ను టోక్యోకు చెందిన ఇన్వెస్ట్మెంట్ ఫండ్.. జపాన్ ఇండస్ట్రియల్ పార్ట్నర్స్(జేఐపీ)కు అమ్మేస్తున్నామని, ఈ మేరకు ఇరు సంస్థలు గురువారం ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు సోనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ డీల్ విలువ 40 కోట్ల డాలర్లుగా ఉండొచ్చని అంచనా. సోనీ మాత్రం వివరాలను వెల్ల డించలేదు. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ కంపెనీ రుణపరపతి రేటింగ్‌ను జంక్(పెట్టుబడులకు అత్యంత ప్రతికూలం) స్థాయికి డౌన్‌గ్రేడ్ చేసిన వారం రోజుల తర్వాత ఈ షాకింగ్ వార్తను సోనీ ప్రకటించడం గమనార్హం.
కాగా, ఈ ఏడాది వయోలో కొత్త శ్రేణిని విడుదల చేశాక... ఇక పీసీల డిజైన్, ఉత్పత్తి, అమ్మకాలు అన్నింటినుంచీ తాము తప్పుకుంటామని సోనీ పేర్కొంది. అయితే, జేఐపీ ఏర్పాటు చేయనున్న కొత్త కంపెనీకి తమ సంస్థ నుంచి దాదాపు 250-300 మంది పీసీ విభాగం ఉద్యోగులు వెళ్లే అవకాశం ఉందని... దీంతో వయో కస్టమర్లకు సర్వీసులు యథాతథంగా కొనసాగుతాయని పేర్కొంది.
టీవీ బిజినెస్ ఇక సబ్సిడరీ...
టెలివిజన్ వ్యాపారాన్ని విభజించి పూర్తిస్థాయి అనుబంధ సంస్థ(సబ్సిడరీ)గా నిర్వహించనున్నట్లు కూడా సోనీ ప్రకటించింది. కంప్యూటర్ల మార్కెట్లో అనూహ్య మార్పులను ప్రస్తావిస్తూ... ఇకపై తాము స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలపైనే ఎక్కువగా దృష్టిపెడతామని చెబుతోంది. గ్లోబల్ పీసీ వ్యాపారంలో తమ వాటా చాలా తక్కువేనని అందుకే దీన్ని వదిలించుకొని ఎలక్ట్రానిక్స్ బిజినెస్ వృద్ధిని పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు సోనీ కార్పొరేషన్ సీఈఓ కజువో హిరాయ్ పేర్కొన్నారు. ఈ ఏడాది టీవీ వ్యాపార విభాగం కూడా లాభాల్లో ఉండకపోవచ్చన్నారు.
అయితే, దీన్ని వదిలించుకునే ప్రశ్నేలేదని, హైఎండ్ టెలివిజన్లపై దృష్టిసారిస్తామని చెప్పారు. డిజిటల్ ఇమేజింగ్(కెమేరాలు ఇతరత్రా), వీడియో గేమ్స్, మొబైల్స్‌లో మరింత దూకుడు ప్రదర్శించడం ద్వారా కీలకమైన ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలో మళ్లీ టర్న్‌అరౌండ్‌కు వీలవుతుందనేది సోనీ ప్రణాళిక. ఎక్స్‌పీరియా సిరీస్ స్మార్ట్ఫోన్ల అమ్మకాలు పుంజుకుంటుండటం, గత నవంబర్‌లో ప్రవేశపెట్టిన ప్లేస్టేషన్ 4 గేమింగ్ కన్సోల్కు అనూహ్య స్పందన (42 లక్షల యూనిట్ల విక్రయం) లభించడం దీనికి కారణం.
భారీ నష్టాల్లోకి..!
రెండేళ్ల తర్వాత మళ్లీ సోనీ ఘోరమైన నష్టాలను చవిచూడనుంది. మార్చితో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 కోట్ల డాలర్లకుపైగా(11,000 కోట్ల యెన్లు) నష్టం రావచ్చనేది కంపెనీ తాజా అంచనా. మూడు నెలల క్రితం 3,000 కోట్ల యెన్ల లాభాలు రావచ్చని సోనీ అంచనా వేయడం గమనార్హం. ఆపరేటింగ్ లాభాలను కూడా సగానికిపైగా తగ్గించడం(అక్టోబర్ అంచనా 17,000 కోట్ల యెన్లు.. ప్రస్తుత అంచనా 8,000 కోట్ల యెన్లు) విశేషం. కాగా, నష్టాల్లో అధికభాగం పునర్వ్యవస్థీకరణ వ్యయాలేని సోనీ పేర్కొంది.
భారత్‌లోనూ వేటు...
కంపెనీ పునర్వ్యవస్థీకరణ, వ్యయాల తగ్గింపులో భాగంగా వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ ఉద్యోగాల కోతను అమలుచేయనుంది. ఇందులో 1,500 ఉద్యోగాలు జపాన్లోనివి కాగా, విదేశాల్లోని(భారత్‌తో పాటు) 3,500 మంది సిబ్బందిపై వేటు వేయనుంది. ఈ చర్యలతో 2015 నుంచి ఏటా 100 కోట్ల డాలర్ల మేర ఆదా చేసేందుకు వీలవుతందని కంపెనీ పేర్కొంది.
ఎందుకీ దుస్థితి...
{బావియా(బ్రాండ్) టెలివిజన్లు, వయో ల్యాప్‌టాప్‌లు, ప్లేస్టేషన్ గేమింగ్ కన్సోల్స్, మొబైల్స్ ఇతరత్రా ఉత్పత్తులతో దూసుకుపోయిన సోనీ... క్రమంగా ప్రత్యర్థి కంపెనీలతో పోటీలో ఘోరంగా వెనుకపడింది.
{పధానంగా అమెరికా దిగ్గజం యాపిల్, దక్షిణకొరియా అగ్రగామి శామ్సంగ్ దెబ్బకు సోనీ విలవిల్లాడుతోంది. స్మార్ట్ఫోన్లు, టెలివిజన్(ఎల్సీడీ, ఎల్ఈడీ) మార్కెట్లో సోనీని వెనక్కినెట్టి ఈ రెండు కంపెనీలూ దూసుకుపోతున్నాయి.
తక్కువ మార్జిన్స్ ఉండే టెలివిజన్ వ్యాపారంలో శామ్సంగ్, ఎల్జీ తదితర కంపెనీలు వినూత్న ఉత్పత్తులు, చౌక ధరలతో సోనీని ఖంగుతినిపించాయి.
ఆమాటకొస్తే... జపాన్‌కు చెందిన షార్ప్, పానాసోనిక్ ఇతరత్రా ఎలక్ట్రానిక్స్ దిగ్గజాలు కూడా శామ్సంగ్ ఇతరత్రా విదేశీ కంపెనీల ధాటికి తట్టుకోలేని పరిస్థితి.
ఈ పోటీ కంపెనీల సవాళ్లను ఎదుర్కొని సోనీ తన బ్యాలన్స్‌షీట్‌ను మెరుగుపరచుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని, మరిన్ని మార్పులు, చర్యలు తప్పనిసరి అని మూడీస్ వ్యాఖ్యానించడం గమనార్హం.
కాగా, ప్రపంచవ్యాప్తంగా పీసీ మార్కెట్ అంతకంతకూ పడిపోతున్న నేపథ్యంలో సోనీ నిర్ణయం సబబేనని పరిశ్రమ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.