ములాయం ఫోన్ చేసి ఏడిస్తే ఒప్పుకున్నాం..
ఎంతో కీలకమైన యూపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఓ వైపు జతకడదామనుకున్న పార్టీల నుంచి వ్యతిరేకత రావడంతో, తాము బలిష్టంగానే ఉన్నామని నిరూపించుకోవడంలో మిగతాపార్టీలు తలమునకలవుతున్నాయి. తమతో పొత్తు పెట్టుకోమంటూ ఎస్పీ తిరస్కరించడంతో తామేమి బలహీనపడలేదని ఆర్ఎల్డీ చెబుతోంది. ఎస్పీ తిరస్కరణతో తాము మరింత బలపడ్డామని పేర్కొంది. ఎస్పీ సుప్రిం ములాయం సింగ్ యాదవ్ ఫోన్ చేసి ఏడవడంతో తాము, ఆ పార్టీతో కలిసిపోటీ చేద్దామనుకున్నామని ఆర్ఎల్డీ ప్రధాన కార్యదర్శి జయంత్ చౌదరి స్పష్టంచేశారు.
మథుర అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అశోక్ అగర్వాల్ తరుఫును పార్టీ ప్రచారానికి వచ్చిన ఆయన ఈ విషయాన్ని చెప్పారు. '' ఒకవేళ మీ స్నేహితుడు సాయం చేయమని ఏడిస్తే, సాయం చేయకుండా ఉంటారా? ములాయం ఫోన్ చేసి ఏడ్చిన రెండు నిమిషాల్లో ఎస్పీతో పొత్తుకు వెళ్దామని నిర్ణయించుకున్నాం'' అని చెప్పారు. కుటుంబసభ్యులతో పోట్లాడటం అఖిలేష్‌కు అలవాటని విమర్శించారు. ములాయం ముందు ఎస్పీ, కాంగ్రెస్‌ల పొత్తును తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఎస్పీ ఒంటిరిగా బరిలోకి దిగుతుందని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ములాయం యూటర్న్ తీసుకున్నారు. ఫిబ్రవరి 9 తర్వాత ములాయం ఎస్పీ కూటమి తరుఫున ప్రచారానికి రంగంలోకి దిగనున్నారు.