చూసొద్దాం రండి..
పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రత్యేక ప్యాకేజీ
రోజూ సాయంత్రం 4 నుంచి రాత్రి 9.30 వరకు ప్రత్యేక బస్సు
విజయవాడ-గుంటూరు జిల్లాలోని పర్యాటక ప్రాంతాల సందర్శన
పర్యాటకాభివృద్ధే ధ్యేయం..
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ-గుంటూరు మధ్యే ఉంటుందని ప్రచారం జరుగుతుండటంతో ఈ ప్రాంతాల్లో పర్యాటక రంగాభివృద్ధికి అధికారులు నడుం బిగించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో ప్రత్యేక టూర్ ప్యాకేజీలు ప్రవేశపెడుతున్నారు. దీనిద్వారా రెండు జిల్లాల్లోని ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ పర్యాటకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా విజయవాడ-గుంటూరులోని ముఖ్యమైన ప్రాంతాలను ఒకేసారి సందర్శించేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రవేశపెట్టారు. ఇందుకోసం 18 సీట్ల బస్సును కూడా సిద్ధం చేశారు.
ప్యాకేజీ వివరాలివీ..
ఈ బస్సు రోజూ సాయంత్రం 4 గంటలకు బందరురోడ్డులోని ఏపీటీడీసీ సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం నుంచి బయల్దేరుతుంది. 4.45 మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి తీసుకెళ్తుంది. స్వామివారి దర్శనానంతరం అక్కడే ఉన్న హ్యాండ్లూమ్ బజార్‌కు చేరుకుంటుంది. అక్కడ పర్యాటకులు షాపింగ్ చేసుకునే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటలకు హ్యాండ్లూమ్ బజార్ నుంచి బయల్దేరి 6.30 గంటలకు హాయ్‌ల్యాండ్ చేరుకుంటుంది. రాత్రి 7.30 గంటలకు హాయ్‌ల్యాండ్ నుంచి భవానీపురంలోని కృష్ణానది ఒడ్డున ఉన్న బరంపార్కుకు వస్తుంది. 8.15 నుంచి 9.15 గంటల వరకు కృష్ణానదిలో బోటు విహారం, బోటులోనే భోజనాలు ఏర్పాటుచేస్తారు. రాత్రి 9.30 గంటలకు తిరిగి ఏపీటీడీసీ కార్యాలయూనికి చేరుకుంటుంది.
ఒక్కొక్కరికీ రూ.400
పెద్దలు ఒక్కొక్కరికీ రూ.400, చిన్నారులకైతే రూ.250 చొప్పున టికెట్ చెల్లించాలి. ప్రయాణికుల ట్రాన్స్‌పోర్టేషన్, బోటింగ్, ప్రతిచోటా ఎంట్రీ టికెట్లు, గైడ్, ఉచిత భోజనం కల్పిస్తారు.
మూడురోజుల్లో 20 మంది సందర్శన
నగరంలో మూడు రోజులుగా ఈ టూరిస్టు ప్యాకేజీ కొనసాగుతోంది. సుమారు 20 మంది పర్యాటకులు దీనిని వినియోగించుకున్నారు.
కొన్ని మార్పులు చేస్తే ఉపయుక్తమే..
టూర్ ప్యాకేజీ అంతా బాగానే ఉన్నా.. కొన్ని లోటుపాట్లు స్పష్టంగా కనిపిస్తున్నారుు. రోజూ సాయంత్రం 4 గంటలకు బయల్దేరి రాత్రి 9.30 గంటలకు తిరిగివచ్చే విధంగా టూర్ ఏర్పాటు చేయడంపై పర్యాటకుల నుంచి కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. సమయం తక్కువగా ఉన్నందున హాయ్‌ల్యాండ్, బోటు షికారు హడావుడిగా చేయూల్సి వస్తోందంటున్నారు. కనీసం ఆదివారం, సెలవు రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండేలా ప్యాకేజీలో మార్పులు చేస్తే బాగుంటుందని చెబుతున్నారు. అలాగే, మంగళగిరి కొండపై ఉన్న పానకాలస్వామి దేవాలయ సందర్శనకు మరింత సమయం కేటాయిస్తే పర్యాటకులకు ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే, సాయంత్రం కొద్దిసేపు భవానీద్వీపంలోనూ విహరించే సౌకర్యం కల్పిస్తే మరింత ఆహ్లాదకరంగా ఉంటుందని వారు సలహా ఇస్తున్నారు.
ప్రచారం అవసరం
ఏపీటీడీసీ అధికారులు ప్యాకేజీ ఏర్పాటుచేసి చేతులు దులుపుకొంటే సరిపోదు. దీనిని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు మార్కెటింగ్ సిబ్బందిని ఏర్పాటుచేస్తే మంచిది. ఇలా.. 18 సీట్ల బస్సు పూర్తిగా నిండేలా అధికారులు ప్రయత్నిస్తే ఏపీటీడీసీకి ఆదాయం రావడమే కాకుండా రాబోయే రోజుల్లో ఈ ప్యాకేజీకి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.