క్వార్టర్స్‌లో శ్రీకాంత్, సైనా
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్
సిడ్నీ: గత టోర్నీల్లో కనీసం తొలిరౌండ్‌ను కూడా దాటలేకపోయిన భారత షట్లర్ శ్రీకాంత్... ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ శ్రీకాంత్ 21-19, 21-12తో సోని ద్వికుంకురో (ఇండోనేిసియా)పై నెగ్గి క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. 34 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... హైదరాబాద్ కుర్రాడు తొలి గేమ్‌లో 4-6, 13-15తో వెనుకబడి పుంజుకున్నాడు. రెండో గేమ్‌లో 3-3తో స్కోరు సమమైన తర్వాత శ్రీ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. మరో మ్యాచ్‌లో సమీర్ వర్మ 21-11, 7-21, 19-21తో సిన్సుకా జింటింగ్ (ఇండోనేిసియా) చేతిలో ఓడాడు.
మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఏడోసీడ్ సైనా 21-12, 21-14తో జిన్ వీ గోపై గెలిచి క్వార్టర్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. 37 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఆరంభంలో సైనా కాస్త అలసత్వం ప్రదర్శించింది. దీంతో జిన్ 4-1, 9-7 ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో హైదరాబాదీ వరుసగా ఆరుపాయింట్లు నెగ్గి 13-9తో పైచేయి సాధించి గేమ్‌ను సొంతం చేసుకుంది.
రెండో గేమ్‌లో సైనా 5-2తో ఆధిక్యంలో ఉన్నా.. జిన్ 9-9తో స్కోరు సమం చేసింది. కానీ నెట్ వద్ద మెరుగైన ప్రదర్శన చూపెట్టిన సైనా గేమ్‌ను, మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. మరో మ్యాచ్‌లో తన్వీలాడ్ 18-21, 6-21తో నాలుగోసీడ్ వాంగ్ యిహాన్ (చైనా) చేతిలో కంగుతింది.