స్టార్టప్‌ల లిస్టింగ్ నిబంధనలు మార్చేందుకు సిద్ధం
సెబీ చైర్మన్ యూకే సిన్హా
న్యూఢిల్లీ: స్టార్టప్‌ల లిస్టింగ్ వేదికను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు వీలుగా నిబంధనలను మార్చే విషయంలో సలహాలను పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సెబీ చైర్మన్ యూకే సిన్హా చెప్పారు. అలాగే, ఫైనాన్షియల్ మార్కెట్లన్నింటికీ ఉమ్మడిగా ఒకే విడత వివరాలు అందించే నో యువర్ కస్టమర్ (నీ కస్టమర్ గురించి తెలుసుకోవడం) కేంద్రీకృత విధానాన్ని వచ్చే కొన్ని నెలల్లో అమల్లోకి తేనున్నట్టు సిన్హా తెలిపారు. దీంతో ఒకటి కంటే ఎక్కువ చోట్ల కేవైసీ సమర్పించాల్సిన అవసరం ఉండదన్నారు. ఢిల్లీలో జరిగిన 11వ డిజిటల్ ఇండియా సదస్సులో పాల్గొన్న సందర్భంగా సిన్హా మాట్లాడారు.
‘‘స్టార్టప్‌లకు సంబంధించి స్పష్టమైన కార్యాచరణను తీసుకొచ్చాం. అయినప్పటికీ ఒక్క కంపెనీ కూడా లిస్ట్ అవలేదు. మా వైపు నుంచి ఏదైనా కావాలని కోరుకుంటే స్టార్టప్‌ల సమస్యలను వినేందుకు, తగిన మార్పులు చేసేందుకు సెబీ సిద్ధంగా ఉంది. స్టార్టప్‌ల లిస్టింగ్‌కు సంబంధించి పరిశ్రమ వర్గాలతో ఇప్పటికే సంప్రదింపులు మొదలు పెట్టాం. వారి అభిప్రాయాల కోసం ఎదురు చూస్తున్నాం’’ అని సిన్హా చెప్పారు. స్టార్టప్‌ల లిస్టింగ్‌కు సంబంధించి ప్రమోటర్లు, లిస్టింగ్ ముందు నుంచీ ఉన్న ఇన్వెస్టర్ల లాకిన్ కాల వ్యవధిని గతంలో మూడేళ్లు ఉండగా దాన్ని సెబీ ఇప్పటికే ఆరు నెలలకు తగ్గించింది. దీనికితోడు డిస్క్లోజర్ నిబంధనలను కూడా సరళతరం చేసింది.