రీడిజైన్ పేరుతో ప్రభుత్వ దోపిడీ
ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఒక రోజు దీక్ష విరమణ
సభలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క
ఖమ్మం: ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం వేలకోట్ల రూపాయలను దోచుకుంటోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టుల పేర్లను ప్రభుత్వం మార్చడాన్ని; రైతాంగ సమస్యలపై నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి బుధవారం ఖమ్మంలో ఒక్కరోజు దీక్ష చేపట్టారు. దీనిని ఉదయం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయితం సత్యం ప్రారంభించగా, సాయంత్రం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. ఈ సందర్బంగా ఏర్పాటైన సభలో భట్టి మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగులక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలన్న లక్ష్యంతో రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను వైఎస్సార్ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. అప్పుడున్న డిజైన్ ప్రకారం శబరి నది నీటితోపాటు కిన్నెరసాని మిగులు జలాలు, పోలవరం బ్యాక్ వాటర్‌ను జిల్లా బీడు భూములకు తరలించే అవకాశం ఉందన్నారు. కాంట్రాక్టర్ల డబ్బుకు కక్కుర్తిపడిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. రీడిజైన్‌తోపాటు ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్, చేవెళ్ల, ప్రాణహిత (బాబాసాహెబ్ అంబేడ్కర్) పేర్లను మారుస్తూ అదనంగా వేలకోట్ల రూపాయల ఖర్చుకు సిద్ధమైందని విమర్శించారు. ‘‘475 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు 10వేల కోట్లు ఇవ్వడంలోని ఆంతర్యమేమిటి? ఒక్క ఎకరానికి కూడా అదనంగా నీళ్లు ఇవ్వకుండా ఇన్ని వేలకోట్లు ఎలా ఖర్చు చేస్తారు?’’ అని ప్రశ్నించారు. 80 శాతం పనులు పూర్తయిన వాటిని నిరుపయోగంగా వదిలేసి, కొత్త పనులకు శ్రీకారం చుట్టడం ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. విభజనకు ముందు ప్రారంభించిన ప్రాజెక్టులను యథావిథిగా పూర్తిచేయాలని విభజన చట్టం సూచించిందన్నారు. రైతుల రుణాలను ఒకేసారి కాకుండా విడతలవారీగా మాఫీ చేస్తుండడంతో.. ఆ వచ్చినదంతా వడ్డీలకు కూడా చాలడం లేదని, పాత బకాయిల పేరుతో బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని, ఆందోళనకు సిద్ధమవుతున్నారని అన్నారు. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ పేర్లతో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పేర్లు మారిస్తే ఆందోళన చేస్తామన్నారు. మాజీ మంత్రులు వనమా వెంకటేశ్వరరావు, సంభాని చంద్రశేఖర్ కూడా మాట్లాడారు. దీక్ష శిబిరంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, జిల్లా మహిⶠకాంగ్రెస్ అధ్యక్షురాలు బండి మణి, యువజన కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి శ్రీచరణ్‌రెడ్డి, మనోహర్ నాయుడు, రాపర్తి శరత్, కాంగ్రెస్ సేవాదళ్ నాయకులు జావీద్, ఖమ్మం కార్పొరేటర్లు వడ్డెబోయిన నరసింహారావు, బాలగంగాధర్ తిలక్, పార్టీ నాయకులు బెల్లం శ్రీను, సోమ చంద్రశేఖర్, ఫజల్, పాషా, పరంజ్యోతి, బాలాజీరావు నాయక్ తదితరులు పాల్గొన్నారు.