ఆ సిబ్బందిని అక్కడికే పంపండి
నాలుగో తరగతి ఉద్యోగులు కంప్యూటర్ ఆపరేటర్లుగా ఎలా పనిచేస్తారు
ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించిన డీఎంఈ
అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరిన సూపరింటెండెంట్
సిద్ధార్థ వైద్య కళాశాల అభివృద్ధి కమిటీ సమావేశం
విజయవాడ : సూపర్ స్పెషాలిటీ విభాగాలకు కేటాయించిన సిబ్బంది వైద్య కళాశాలలోఎలా విధులు నిర్వర్తిస్తారని, వారిని ఆ విభాగాలకే పంపించేయాలని రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు(డీఎంఈ) డాక్టర్ శాంతారామ్ అన్నారు. వారిలో ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లున్నారని ప్రిన్సిపాల్ చెప్పడంతో, నాలుగో తరగతి ఉద్యోగులు కంప్యూటర్ ఆపరేటర్స్‌గా ఎలా పనిచేస్తారంటూ డీఎంఈ ప్రశ్నించారు. సిద్ధార్థ వైద్య కళాశాల డెవలప్మెంట్ సొసైటీ సమావేశం శుక్రవారం కళాశాలలోని సెమినార్ హాల్లో జరిగింది.
రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ శాంతారామ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వాస్పత్రి సూపర్‌స్పెషాలిటీ విభాగాల సిబ్బంది, వైద్య కళాశాలలో పనిచేస్తున్న విషయంలో ఇటీవల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యకుమారి డీఎంఈ దృష్టికి తీసుకెళ్లారు.
ఏజెండాలోని అంశాలైన వైద్య కళాశాలలో ఇంటర్నల్ఫోన్స్ రిపేరు, కొత్తవి ఏర్పాటు, జిరాక్స్ మెషిన్స్ కొనుగోలు, మైక్రోబయాలజీలో పరికరాల కొనుగోలు, రూ.4లక్షలతో అన్ని డిపార్ట్మెంట్లలో మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. అదే విధంగా ఫర్నిచర్ కొనుగోలు వంటి అంశాలపై సమావేశంలో తీర్మానించారు.
అధిక వ్యయం అయ్యే రోడ్లనిర్మాణం, భవనాల మరమ్మతులు, ఇతర విభాగాల్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకె ళ్లాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యకుమారి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమూర్తి, రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఈఈ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్లు డాక్టర్ శివశంకర్, డాక్టర్ శశాంక్ ఏడీ పద్మజ తదితరులు పాల్గొన్నారు.
సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోండి...
ప్రభుత్వాస్పత్రిలో ఈసీజీ టెక్నీషియన్స్, సిటీ టెక్నిషియన్ప్ పోస్టులు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యు.సూర్యకుమారి డీఎంఈ శాంతారామ్ దృష్టికి తీసుకెళ్లారు. రేడియోగ్రాఫర్స్ కొరత తీవ్రంగా ఉందని ఎనిమిది మందికి ఒక్కరే అందుబాటులో ఉన్నారని, డ్రైవర్స్ కొరత ఉందని తెలిపారు. దీంతో వీఐపీలు నగరంలో పర్యటించే సమయంలో ఉన్న వారు కాన్వాయ్‌కు సర్ధుబాటు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. రెండు చోట్ల ఆస్పత్రు ఉండటం, సిబ్బంది తక్కువగా ఉండటంతో నిర్వహణ కష్టంగా ందని తెలిపారు.
ఆమె అభ్యర్థనలపై సానుకూలంగా స్పందించిన డీఎంఈ శాంతారామ్ ప్రస్తుతం శాంక్షన్ అయిన పోస్టుల ఖాళీలను భర్తీ చేద్దామని, కొత్త పోస్టుల శాంక్షన్ ఇప్పుడు సాధ్యం కాదని చెప్పినట్లు సమాచారం. తొలుత ఆయన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయానికి వెళ్లి వైస్ ఛాన్సలర్ డాక్టర్ టి.రవిరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారితో చర్చించారు.