మైనారిటీ కమిషన్ చైర్మన్ తొలగింపు
ముంబై: రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ మునాఫ్ హకీమ్‌ను ప్రభుత్వం మధ్యంతరంగా తొలగించింది. జైళ్లలో ఉన్న ముస్లిమ్‌ల సంఖ్యను తేల్చేందుకు త్వరలోనే సర్వే జరుపుతామని హకీమ్ ప్రకటించిన కొద్దిరోజులకే ఆయనకు ఉద్వాసన పలకడం గమనార్హం. శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన హకీమ్ తొలగింపునకు ప్రభుత్వం ఎటువంటి కారణాలనూ పేర్కొనలేదు. ‘‘వారికి (ప్రభుత్వానికి) ఎటువంటి జోక్యం ఇష్టం లేదు.
నా పదవీ కాలం ఐదేళ్లు. ఇప్పటికే సగం కాలం పూర్తయింది. నీకు కనీసం షోకాజ్ నోటీసు ఇవ్వలేదు, జైళ్ల సర్వేపై నా వివరణను కోరలేదు’’ అని హకీమ్ పేర్కొన్నారు. ఆగస్టు 2012లో హకీమ్ మైనారిటీ కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.
పాలకులకు లొంగి ఉండరాదన్న ఉద్దేశంతో కమిషన్‌కు ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి కల్పించింది. హకీమ్ స్థానంలో ఆమిర్ సాహెబ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. రాత్రికి రాత్రి చైర్మన్లను మార్చే అవసరం ఏమొచ్చిందో అర్థం కావడం లేదని హకీమ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.