వైద్యం అందక మహిళ మృతి
రాపూరు : రాపూరు ప్రభుత్వ వైద్యశాల ఆదివారం వైద్యులు లేని కారణంగా వైద్యం అందక ఓ మహిళ మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. సైదాపురం మండలం చీకవోలుకు చెందిన నక్కినేటి ఈశ్వరమ్మ (30) కొంత కాలంగా ఆయాసంతో బాధపడుతుంది. ఆదివారం చర్చిలో ప్రార్థనలు చేసుకునేందుకు వచ్చి తీవ్ర ఆయాసానికి గురికావడంతో ఆమెను తల్లి రామసుబ్బమ్మ రాపూరు వైద్యశాలకు ఆటోలో తీసుకు వచ్చింది. అయితే రాపూరు వైద్యశాలలో వైద్యులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఈశ్వరమ్మ కొద్దిసేపటికే మృతి చెందింది. వైద్యులు ఉంటే తమ బిడ్డ బతికేదని ఈశ్వరమ్మ తల్లి రామసుబ్బమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా రాపూరు ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు అందుబాటులో లేరని స్థానికులు ఆరోపిస్తున్నారు.