ప్రజలకు అండగా ఉంటాం
► కరువుతో రూ.16వేల కోట్ల మేర పంటలు దెబ్బతిన్నాయి
► కరువు నివారణకు నిధుల కొరత లేదు
► పావగడలో 2వేల మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్
తుమకూరు : కరువు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టి ప్రజలకు అండగా ఉంటామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి శ్రీనివాస ఆర్.ప్రసాద్ అన్నారు. ఇంధనశాఖ మంత్రి శాఖ మంత్రి నేతృత్వంలో ఏర్పడిన మంత్రులు బృందం ఉపసమితి సభ్యులు బుధవారం తుమకూరు జిల్లా, పావగడ తాలూకాలో పర్యటించారు. ర్యాప్టె గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బుగడూరు గ్రామాన్ని సందర్శించి కరువు పరిస్థితులను అంచనా వేశారు. స్థానికులతో కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటర్‌ప్లాంట్, నరేగా పథకం కింద నిర్మించిన భవనాన్ని, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు.
తర్వాత మీడియాతో మంత్రి శ్రీనివాస ఆర్.ప్రసాద్ మాట్లాడారు. కరువు పరిస్థితులను అంచనా వేసేందుకు సీఎం సిద్దరామయ్యతోపాటు మంత్రులు నాలుగు బృందాలుగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారన్నారు. దాదాపు 16 వేల కోట్ల మేర రైతులు పంటలు నష్టపోయారన్నారు. మూడు రోజుల్లో సీఎంతో సమావేశమై నివేదికను సమర్పిస్తామన్నారు. తుమకూరు జిల్లాలో 9 కరువు తాలూకాలు గుర్తించగా అందులో పావగడలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందన్నారు.
తాగు నీటి సమస్యను తీర్చడాకి 85 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇంధనశాఖ మంత్రి కె.శివకుమార్ మాట్లాడుతూ పావగడ తాలూకాలో 2000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 8400 ఎకరాలు సేకరించామన్నారు. ప్రతి తాలూకాలో 20 నుంచి 30 మెగా వాట్ల సౌర ప్లాంట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.