ఎల్ఐసీకి సుప్రీం షాక్!
నాగ్ పూర్: నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎల్ఐసీ)కి దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం షాక్ ఇచ్చింది. 1991లో ఉద్యోగాల నుంచి తొలగించిన కాంట్రాక్ట్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తేల్చిచెప్పింది. నిబంధనల ప్రకారం అప్పటి నుంచి ఇప్పటివరకూ వారికి అందాల్సిన వేతనాలను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఎల్ఐసీ 1991లో దేశవ్యాప్తంగా రెగ్యులర్ చేయాల్సిన మూడో, నాలుగో తరగతులకు చెందిన 8,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. దీంతో వారందరూ ఆల్ ఇండియా నేషనల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ద్వారా కోర్టును ఆశ్రయించారు. అప్పటినుంచి న్యాయస్థానాల్లో నలుగుతున్న ఈ కేసును మార్చి18, 2015న ఉద్యోగులకు అనుకూలంగా తీర్పువచ్చింది.
దీంతో ఎల్ఐసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 25 ఏళ్ల వేతనాలు రూ.7,083 కోట్లు ఒకేసారి చెల్లించడం ఎల్ఐసీకి భారమవుతుందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదించారు. అయితే 50 శాతం వేతనాలతో పాటు తదనంతర పరిణామాలకు కారణమైనందుకు అడిషనల్ బెనిఫిట్స్ ను ఉద్యోగులకు ఇవ్వాలని జస్టిస్ వి. గోపాల గౌడ, జస్టిస్ సి. నాగప్పన్ లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. 25 ఏళ్లుగా ఉద్యోగులు వేచిచూస్తున్నారని ఎనిమిది వారాల్లోగా వారికి రావలసిన బకాయిల్లో 50 శాతం అంటే రూ.3,543 కోట్లు చెల్లించాలని పేర్కొంది.