ఏక కాలంలో
విద్యార్థులకు సమ్మెటివ్
* టీచర్లకు అవగాహన
* సవాలుగా స్వీకరించిన విద్యాశాఖ
* అన్ని ఏర్పాట్లు పూర్తి
* నేటి నుంచే ప్రారంభం
నిజామాబాద్ అర్బన్: ఇటు విద్యార్థులకు సమ్మెటివ్ పరీక్షలు.. అటు ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు విద్యాశాఖకు సవాలుగా మారాయి. ఏకకాలంలో రెండింటిని నిర్వహించేందుకు విద్యాశాఖ ఇప్పటికే కసరత్తు చేసింది. ఈ ఏడాది తొలిసారిగా రెండు కార్యక్రమాలుఒకేసారి చేపడుతున్నారు. మారిన సిలబస్‌పై అవగాహన కల్పించడంలో భాగంగా ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులను నిర్వహించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు షెడ్యూలును విడుదల చేశారు. ఇక నుంచి త్రైమాసిక, షాణ్మాసిక, వార్షిక పరీక్షలు ఉం డవని, వాటి స్థానంలో సమ్మెటివ్-1, సమ్మెటివ్-2, సమ్మెటివ్-3 పరీక్షలే ఉంటాయని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసాచారి విలేకరులకు స్పష్టం చేశారు. ప్రతి ప రీక్షకు ఇదే విధానం కొనసాగుతుందన్నారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రతి సబ్జెక్టు ఒక్క పేపర్ మాత్రమే ఉంటుందన్నారు. రాజీవ్ విద్యామిషన్ నిధులతో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఉన్న పలంగా
విద్యా సంవత్సరం ముగింపు దగ్గర పడడంతో ఉపాధ్యాయులకు శిక్షణపై షెడ్యూలును ఉన్న పలంగా అమలు చేయనున్నారు. నేటి నుంచి ఈనెల 15 వరకు మొదటి విడత శిక్షణ తరగతులు ఉంటాయి. 16వ తేదీ నుంచి 18 వరకు రెండవ విడత శిక్షణ ఉంటుంది. 20 నుంచి 22 వరకు మూడవ విడత శిక్షణ నిర్వహించనున్నారు. స్కూ ల్ అసిస్టెంట్లకు ఆయా సబ్జెక్టులలో శిక్షణ ఇస్తారు. రోజుకొక సబ్జెక్టుపై శిక్షణ ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా డివిజన్లలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.
మరోవైపు విద్యార్థులకు సమ్మెటివ్-1 పరీక్షలు సైతం యథావిధిగా నడుస్తాయి. ఈ నెల 13న తెలుగు, 14న హిందీ, 15న ఇంగ్లిష్, 16న గణితం, 17న సామాన్య శాస్త్రం, 18న సాంఘిక శాస్త్రం పరీక్షలను నిర్వహిస్తారు. జిల్లాలో 1,576 ప్రాథమిక పాఠశాలలు, 263 ప్రాథమికోన్నత పాఠశాలలు,478 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొత్తం రెండున్నర లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.
దాదాపు 10 వేల మంది టీచర్లు ఉన్నారు. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ లకు శిక్షణ ఇస్తున్నారు. అయితే శిక్షణ తరగతులలో ఆ రోజు చెప్పే సబ్జెక్టుకు సంబంధం లేని ఉపాధ్యాయులను విద్యార్థుల పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా నియమిస్తారు. లేదంటే ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను కేటాయిస్తారు. ఇలా పరీక్షల షెడ్యూలు తయారు చేసి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దీంతో విద్యార్థుల పరీక్షలకు, ఉపాధ్యాయుల శిక్షణ తరగతులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా కొనసాగుతాయి.
ఇబ్బంది లేదు
పరీక్షల నిర్వహణ, శిక్షణ కార్యక్రమాలు షెడ్యూలు ప్రకారం జరుగుతాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తాం. అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. ఈ మేరకు ఎంఈఓలు డిప్యూటీ ఈఓలకు కూడా ఆదేశాలు జారీ చేశాం. - శ్రీనివాసాచారి, జిల్లా విద్యాశాఖ అధికారి
విజయవంతంగా నిర్వహిస్తాం
పరీక్షలు, శిక్షణ కార్యక్రమాలు అధికారుల ఆదేశాల మేరకు షెడ్యూలు ప్రకారం పకడ్బందీగా నిర్వహిస్తాం, దీనికి సంబంధించి సిద్ధంగా ఉన్నాం, ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్ణయించిన ప్రకారమే విజయవంతం చేస్తాం.
-సురేశ్, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి