పుణేలో నీటి కోతలు
పింప్రి, న్యూస్‌లైన్: రిజర్వాయర్లలో నీటిమట్టాలు గణనీయంగా తగ్గిపోవడంతో పుణే నగరానికి సరఫరా చేసే నీటిలో కోత విధించాలని కార్పొరేషన్ నిర్ణయించింది. శనివారం నుంచి ఒక్కపూట మాత్రమే నీటిని సరఫరా చేయాలని సర్వసభ్య సమావేశంలో నిర్ణయించారు. దీంతో అధికారికంగానే 12 శాతం కోత విధించనున్నారు. మేయర్ చ ంచలా కోద్రే అధ్యక్షతన గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో నీటి పొదుపుపై చర్చించారు. ప్రస్తుతం రిజర్వాయర్లలో 1.93 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని, భాష్పీభవనం తర్వాత 1.08 టీఎంసీలు మాత్రమే మిగిలే అవకాశముందని సంబంధిత అధికారులు తెలపడంతో వెంటనే నీటి కోతలను అమలు చేయాలని నిర్ణయించారు.
గత సంవత్సరం ఇదే సమయంనాటికి 5.13 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. దీంతో ప్రజలకు సరిపడా నీటిని సరఫరా చేశారు. ఈ ఏడాది అటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ శుక్రవారం వరకు రోజుకు 1,250 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. కాగా నేటి నుంచి 1,100 మిలియన్ లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేయాలని నిర్ణయించడంతో నగరవాసులు నీటిని పొదుపుగా వాడుకోవాని అధికారులు సూచిస్తున్నారు. మొత్తం 76 విభాగాల్లో 34 విభాగాలకు రోజుకు రెండు పూటలా నీటిని సరఫరా చేస్తుండగా నేటి నుంచి మాత్రం ఒకపూట మాత్రమే సరఫరా చేయనున్నారు. ఖడక్ వాస్లా, పాన్శేత్, వదస్గావ్, టేమ్ఘర్ ఈ నాలుగు రిజర్వాయర్ల నుండి జూలై 1వ తేదీ వరకు 17 టీఎంసీల నీరు వ్యవసాయ అవసరాలకు, 7 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం విడుదల చేశారు.
దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు
నీటిని నగర ప్రజలు పొదుపుగా వాడుకోవాలని, నీటిని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వాహనాలను శుభ్రపరిచేందుకు మంచినీటిని వాడరాదని, నీటి దుర్వినియోగంపై కార్పొరేషన్ తనిఖీ బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఈ సమావేశంలోడిప్యూటీ మేయర్ సునీల్ గైక్వాడ్, స్థాయీసమితి అధ్యక్షులు బాపురావు కర్ణే, గురూజీ, సభాగృహనేత సుభాష్ జగతాప్, ప్రతిపక్షనేత అరవింద్ షిండే సభ్యులు వసంత్ మోరే, గణేష్ బోడ్కర్, లశోక్ హరణావాలా, నీటి సరఫరా విభాగ అధికారి వి.జి.కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.