బెల్ అజేయ శతకం
చెస్టర్ లీ స్ట్రీట్: సూపర్ ఫామ్‌లో ఉన్న ఇయాన్ బెల్ (189 బంతుల్లో 105 బ్యాటింగ్; 10 ఫోర్లు) తన అద్భుత ఆటతీరును మరోసారి ప్రదర్శించాడు. అజేయ శతకంతో రాణించడంతో యాషెస్ నాలుగో టెస్టులో ఇంగ్లండ్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించింది. ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 74 ఓవర్లలో ఐదు వికెట్లకు ఇంగ్లండ్ 234 పరుగులు చేసింది. క్రీజులో టిమ్ బ్రెస్నన్ (4 బ్యాటింగ్) ఉన్నాడు. ప్రస్తుతానికి ఆతిథ్య జట్టు 202 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇంగ్లండ్ వికెట్లు కోల్పోవడంతో ఇబ్బందుల్లో పడింది. 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో బెల్, పీటర్సన్ (84 బంతుల్లో 44; 6 ఫోర్లు) ఆదుకున్నారు. చక్కటి సమన్వయంతో ఈ జోడి ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొంది.
వరుసగా రెండు బౌండరీలతో బెల్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అటు పీటర్సన్ కూడా ఈ మార్కు చేరుకునేలోపే నాథన్ లియోన్ దెబ్బ తీశాడు. దీంతో నాలుగో వికెట్‌కు వీరి మధ్య 106 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. బెయిర్‌స్టో (65 బంతుల్లో 28; 6 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్‌కు 66 పరుగులు చేర్చిన బెల్ 184 బంతుల్లో కెరీర్లో 20వ శతకం సాధించాడు. అలాగే ఓ యాషెస్ సిరీస్‌లో మూడు సెంచరీలు చేసిన తొమ్మిదో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
అంతకుముందు ఆస్ట్రేలియా 222/5 ఓవర్ నైట్ స్కోరుతో తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించి 270 పరుగుల వద్ద ఆలౌటయ్యింది. సెంచరీ హీరో రోజర్స్ (250 బంతుల్లో 110; 14 ఫోర్లు) ఆదిలోనే అవుటయ్యాడు. టెయిలెండర్లలో హారిస్ (33 బంతుల్లో 28; 5 ఫోర్లు) ఒక్కడే పోరాడాడు. దీంతో 32 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. బ్రాడ్‌కు ఐదు వికెట్లు దక్కాయి.