దొడ్డిదారిలో ‘సీఎంఆర్’ బియ్యం తరలింపు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తిమ్మిని బమ్మి చేయడం రైస్ మిల్లర్లకు తెలిసినంతగా మరెవరకీ తెలియదేమో.. రైతులు తెస్తున్న ధాన్యాన్ని బియ్యం చేయడంలోనే కాదు.. డీలర్ల ద్వారా బియ్యం అక్రమ సరఫరా చేయించడం, చిల్లర వ్యాపారుల నుంచి పీడీఎస్ (పౌరసరఫరాల) బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటినే పాలిష్ చేసి ఫైన్.. సూపర్‌ఫైన్‌గా నమ్మించి అధిక ధరలకు అమ్మేయడం వారికే చెల్లింది.
అక్కడితో ఆగకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సీఎంఆర్’ (కస్టమ్స్ మిల్లింగ్ రైస్) బియ్యాన్ని కూడా పక్కదోవ పట్టిం చేందుకు కొందరు రంగం లోకి దిగారు. ఇటువంటి అక్రమాలపై కన్నేసిన విజిలెన్స్ అధికారులు విస్తృతంగా దాడులు జరుపుతూ కేసులు నమోదు చేయడంతో పాటు స్టాక్‌ను సీజ్ చేస్తున్నారు. పలువరు అక్రమార్కులపై క్రిమినల్ కేసులు కూడా నమోదవుతున్నాయి.
లెవీలో హెవీ..సీఎంఆర్
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి వాటిని మిల్లర్లకు ఇచ్చి బియ్యంగా మార్పించి మళ్లీ ప్రభుత్వమే కొనుగోలు చేసే ప్రక్రియను గతంలో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) చేపట్టేది. అయితే ఇందులో కొన్ని ఇబ్బందులు రావడంతో ప్రభుత్వం తాజాగా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) పద్ధతిని ప్రవేశపెట్టింది. ఒడిశాలో తొలుత ఈ పద్ధతిని ప్రవేశపెట్టగా అక్కడ విజయవంతమైంది.
దాంతో మన రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో దాన్ని పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నారు. ఈ విధానంలో రైతుకు మద్ధతు ధర చెల్లించి ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. వాటిని 67 శాతం లెవీ ఇచ్చేందుకు మిల్లర్లకు ఇస్తోంది. ధాన్యాన్ని బియ్యంగా తయారు చేసేందుకు కొంత మిల్లింగ్ చార్జీ కూడా ఇస్తోంది. తవుడు, పొట్టు, తరుగులాంటి చిల్లర ఖర్చు పోనూ వచ్చే బియ్యం లో 67శాతం సరుకును మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి. ఇక్కడే కథ అడ్డం తిరిగింది.
బియ్యం పక్కదారి
రైతు నుంచి సేకరించి ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు బియ్యం ఆడించిన తర్వాత బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వాటి స్థానంలో రేషన్‌డీలర్ల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసిన బియ్యాన్ని, ఇతరత్రా తక్కువ రకం సరుకును ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. ఇలా గత కొన్నాళ్ల నుంచి జరుగుతోంది. సమయానుకూలంగా తనిఖీలు లేకపోవడం, కచ్చితమైన సమయానికే బియ్యం ఇవ్వాలనే ఆంక్ష లు నిబంధన లేకపోవడాన్ని ఆసరాగా తీసుకొని పలువురు మిల్లర్లు ఏకంగా బియ్యాన్ని మార్చేస్తున్నారని ఇటీవల అధికారులు జరిపిన దాడుల్లో బయటపడింది.
గ్రేడింగ్ సరిగా లేకపోవడం, తక్కువ ధర కు కొనుగోలు చేసిన బియ్యాన్ని డంప్ చేయడం వంటి అక్రమాలు బయటపడ్డాయి. జిల్లాలో సుమా రు 120 మిల్లులకు సీఎం ఆర్ ధాన్యం సరఫరా చేస్తే వాటిలో సుమారు 87 మిల్లులు అక్రమాలకు పాల్పడినట్టు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లుతుండగా మిల్లర్లు మాత్రం భారీగా లాభపడుతున్నారు.
కేసుల నమోదు
పాలకొండ, భామిని, బమ్మిడి, ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, ఆమదాలవలస ప్రాంతాలతో పా టు మరికొన్ని ప్రాంతాల్లో ఈ అక్రమాలు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. మిల్లుల్లో ప్రభుత్వం ఇచ్చిన సీఎంఆర్ బియ్యం లేకపోవడం, అక్రమ నిల్వలు, సీఎంఆర్ బియ్యంగా మార్చేం దు కు కావాల్సిన సరంజామా వంటి వాటిని పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించారు.
కొన్నాళ్లుగా జరుగుతున్న ఈ అక్రమాల విలువ ఒక్క పాలకొండలోనే సుమారు రూ.4 కోట్లకు పైనే ఉంటుందని ప్రాథమిక దర్యాప్తు అనంతరం ప్రభుత్వానికి నివేదిక పంపించారని తెలిసింది. నిబంధనల ప్రకారం 6ఏతోపాటు కొంతమంది మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమో దు చేశారు. పాలకొండలోని శ్రీవెం కటేశ్వర ట్రేడర్స్ (కేరాఫ్ విజ యదుర్గ రైస్‌మిల్)లో భారీగా అవకతవకలు జరిగాయని, నిబంధనల మేరకు సుమారు రూ.80 లక్షల విలువైన బియ్యాన్ని సీజ్ చేశామ ని, యజమానిపై క్రిమినల్ కేసు నమోదుకు అక్కడి తహశీల్దార్, రెవెన్యూ అధికారులను ఆదేశించామని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు.
ప్రభుత్వానికి అం దజేయాల్సిన సుమారు రూ.48 కోట్ల విలువైన బియ్యం నిల్వలకు సంబంధించి జేసీ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని మరికొందరు అక్రమార్కులపై ఇప్పటికే 6ఏ కేసులు నమోదు చేసి కోర్టుకు తెలియజేశామన్నారు. కాగా రెవె న్యూ రికవరీ (ఆర్ఆర్)యాక్టు ప్రకారం అక్రమార్కుల ఆస్తులు/స్టాకు స్వాధీనానికి కూడా చర్యలకు ఉపక్రమించామని పౌరసరఫరాల కార్పోరే షన్ జిల్లా మేనేజర్ లోక్ మోహన్‌రావు, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి సీహెచ్. ఆనంద్‌కుమార్ స్పష్టం చేశారు. పక్షం రోజుల్లో మిల్లర్లంతా సీఎం ఆర్ బియ్యాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అప్పగించకపోతే చర్యలు తప్పవని జేసీ ఇప్పటికే హెచ్చరించారు. అక్రమాలు నిజ మేనని రుజువైతే కనీసం 25 మిల్లులను పూర్తిస్థాయిలో సీజ్ చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.