Suresh Prabhu
-
అసలు విల్లాలో ఏం జరిగింది?..ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
విజయ్, శీతల్ బట్ జంటగా తెరకెక్కిన చిత్రం 'విల్లా 369'. ఈ చిత్రానికి సురేష్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. విగన్ క్రియేషన్స్ సమర్పణలో విద్య గణేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు డాక్టర్ రాకేశ్ సహానిర్మాతగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకుడు తేజ విడుదల చేశారు. అనంతరం దర్శకుడు తేజ మాట్లాడుతూ.. 'దర్శకుడు సురేష్ ప్రభు మంచి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని తీసిన చిత్రం "విల్లా 369". సినిమా దర్శక, నిర్మాతలకు మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా'. అని అన్నారు. నిర్మాత విద్య గణేష్ మాట్లాడుతూ.. ' దర్శకుడు మంచి నటీ నటులను ఎంపిక చేశారు. ఈ సినిమాకు ర్యాడీ రఫీ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. సంగీత దర్శకుడు మహావీర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం.' అని అన్నారు... దర్శకుడు సురేష్ ప్రభు మాట్లాడుతూ..'ఇలాంటి మంచి కథను చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదములు. అందరూ నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినందునే ఈ సినిమా అనుకున్న విధంగా వచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా'. అని అన్నారు. -
నేను తెలుగు ప్రజల కజిన్‌ను: కేంద్ర మాజీ మంత్రి
హైదరాబాద్: తాను తెలుగు ప్రజలకు కజిన్ అని.. ఇక్కడ నుంచి తనకు రాజ్యసభ సీటు లభించింది అని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సురేశ్ ప్రభు గుర్తుచేసుకున్నారు. విశాఖ జోన్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం ప్రకటించామని, దీనిపై ఎంపీలు పరిశీలిస్తున్నారని తెలిపారు. పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ప్రజల పన్నులతోనే నడుస్తాయని అన్నారు. ప్రైవేటైజేషన్ అంటే షేర్ హోల్డర్స్‌కు మంచి లాభాలు ఇవ్వడానికేనని వివరించారు. స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుందని ప్రకటించారు. ప్రాణాలు అర్పించి కార్మాగారం తెచ్చారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన బీజేపీ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ చరిత్రలో 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ చారిత్రాత్మకమని.. రెండంకెల వృద్ధి సాధ్యమని సురేశ్ ప్రభు తెలిపారు. బడ్జెట్ కరోనా కారణంగా వచ్చిన ఇబ్బంది ఎప్పుడూ రాలేదని గుర్తుచేశారు. ఈయూ, జర్మనీ, యూకే, ఫ్రాన్స్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలపై కరోనా ప్రభావం చూపిందని చెప్పారు. వృద్ధి రేటు కూడా తగ్గిందని.. ఈ బడ్జెట్ కొత్త వేవ్ తీసుకుని వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి వస్తుంది అని భావిస్తున్నట్లు తెలిపారు. రైతుల ఆదాయం రెండింతలు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రూ.16.57లక్షల కోట్లు వ్యవసాయానికి కేటాయించారని వెల్లడించారు. సూక్ష్మ సేద్యం కోసం, ఈనామ్ ద్వారా మార్కెట్ సదుపాయాలు పెంచారని సురేష్ ప్రభు చెప్పుకొచ్చారు. రక్షణకు తాము మొదటి నుంచి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. చర్చల ద్వారానే రైతు సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఒకే మార్కెట్ దేశంలో రైతులకు ఉపయోగమని, ప్రభుత్వం వారితో చర్చించేందుకు సిద్దంగా ఉందని తెలిపారు. రైతులకు తాము వ్యతిరేకం కాదని.. వారిని గౌరవిస్తామని సురేశ్ ప్రభు పేర్కొన్నారు. -
సౌదీ పర్యటన; బీజేపీ ఎంపీ స్వీయ నిర్బంధం
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సురేష్ ప్రభు కరోనా భయాల నేపథ్యంలో స్వీయ నిర్బంధం విధించుకున్నారు. భారత్ తరపున జీ20 సదస్సు ప్రతినిధిగా ఉన్న ఆయన ఇటీవల సౌదీ అరేబియా వెళ్లొచ్చారు. వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు కరోనా నెగెటివ్ అని వచ్చినప్పటికీ 14 రోజులపాటు హోమ్ క్వారైంటన్లో ఉండనున్నారు. దీంతో ఆయన పార్లమెంట్ సమావేశాలకు దూరం కానున్నారు. ఈమేరకు ఆయన రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. ‘రాబోయే జీ20 సదస్సుకు సంబంధించి సౌదీ అరేబియాలోని అల్ ఖోబర్‌లో మార్చి 10న నిర్వహించిన సమావేశానికి హాజరయ్యాను. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైరస్ నిర్ధారణ పరీక్ష చేయించుకున్నా. రిజల్ట్ నెగటివ్‌గానే వచ్చింది. అయినప్పటికీ నియంత్రణ చర్యల్లో భాగంగా 14 రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్లో ఉండాలని నిర్ణయించుకున్నా. ఐసోలేషన్ సమయం ముగిసేవరకూ పార్లమెంటు సమావేశాలకు హాజరు కాలేను. పార్లమెంటు సభ్యులు, సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నా’అని సురేష్ ప్రభు లేఖలో పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. కేరళలోని ఓ ఆస్పత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి మరళీధరన్ సైతం ఇంట్లోనే స్వీయ నిర్బంధం విధించుకున్న సంగతి తెలిసిందే. ఆయన సందర్శించిన ఆస్పత్రి వైద్యుడొకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. -
వాస్తవాలు చెప్పకుండా దుష్ప్రచారం చేస్తున్నారు
సాక్షి, విజయవాడ : జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ), పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) చట్టంపై శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సు లో మాజీ కేంద్ర మంత్రి సురేష్ ప్రభు పాల్గొన్నారు. సురేష్ ప్రభు మాట్లాడుతూ.. జనాభా గణనకు, పౌరసత్వ చట్ట సవరణకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అస్సొం మినహా ఎన్నార్సీ మరెక్కడా అమలు కాదని పేర్కొన్నారు. కొన్ని రాజకీయపక్షాలు వాస్తవాలను బయటికి చెప్పకుండా దుష్ప్రచారంతోనే భయాందోళనలు సృష్టిస్తున్నాయని విమర్శించారు. ఏళ్ల తరబడి వివాదాస్పదంగా ఉన్న పలు కీలకమైన అంశాల్లో బీజేపీ నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా ప్రజలను కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడతుందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షాలు ఇప్పటికే ఎన్నార్సీ , సిఎఎ చట్టాలపై ప్రజల్లో అపోహలు తొలగిస్తూ స్పష్టమైన ప్రకటన చేశారన్నారు. పౌరసత్వ సవరణ చట్టం ఏ మతాన్ని, ఏ వ్యక్తిని ఉద్దేశించింది కాదని అందుకే ఈ చట్టం వల్ల దేశంలోని హిందువులకు, ముస్లింలకు ఎలాంటి ముప్పు ఉండదని వెల్లడించారు. -
జెట్ సంక్షోభంపై స్పందించిన సురేష్ ప్రభు
సాక్షి, న్యూఢిల్లీ : సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిసారించాలని పౌర విమానయాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలాను పౌర విమానయాన మంత్రి సురేష్ ప్రభు శుక్రవారం ఆదేశించారు. ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా, వారి భద్రతను పరిగణనలోకి తీసుకుంటూ జెట్ ఎయిర్వేస్లో సమస్యలను చక్కదిద్దేందుకు చొవర చూపాలని పౌర విమానయాన కార్యదర్శి ఖరోలాను ఆదేశిస్తూ మంత్రి సురేష్ ప్రభు ట్వీట్ చేశారు. మరోవైపు సమస్యలు చుట్టుముట్టడంతో విమానాల సంఖ్యను, సేవలను తగ్గిస్తున్న జెట్ ఎయిర్వేస్ కేవలం 9 విమానాలనే నడుపుతోంది. జెట్ ఎయిర్వేస్ గురువారం తూర్పు, ఈశాన్య ప్రాంతాలకు విమాన సర్వీసులను నిలిపివేసింది. రోజంతా అంతర్జాతీయ సేవలను రద్దు చేసింది. జెట్ చర్యతో పెద్దసంఖ్యలో ప్రయాణీకులు పలు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. జెట్ ఇబ్బందులు ప్రస్తుతం ఏ స్ధాయిలో ఉన్నాయంటే విమాన సర్వీసులు రద్దవడంతో కేవలం ప్రయాణీకులకే సంస్థ రూ 3500 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైంది. -
‘జెట్’లో జోక్యం చేసుకోం
న్యూఢిల్లీ: రుణ భారం, నిధుల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రైవేట్ రంగ జెట్ ఎయిర్వేస్ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. సంస్థను గట్టెక్కించేందుకు డీల్స్ కుదర్చడంలో కేంద్రం పాత్రేమీ ఉండదని పేర్కొన్నారు. జెట్ ఎయిర్వేస్లో నేరుగా వాటాదారులైన బ్యాంకులే.. కంపెనీ వ్యాపార వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాయని, ఈ నేపథ్యంలో తమ శాఖ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని మంత్రి విలేకరులతో చెప్పారు. ‘ప్రభుత్వ శాఖ ఎలాంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించకూడదు. రైల్వే విషయంలోనూ నేను ఇదే పాటించాను. జెట్‌కి సంబంధించినంతవరకూ అది బ్యాంకులు, మేనేజ్మెంట్కి మధ్య వ్యవహారం‘ అని ఆయన పేర్కొన్నారు. అయితే, భద్రతాపరమైన అంశాలపై మాత్రం కచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెడుతుందన్నారు. తన సంస్థ దివాలా తీస్తుంటే నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ప్రభుత్వ రంగ బ్యాంకులు.. జెట్‌ను మాత్రం గట్టెక్కించడానికి ప్రయత్నిస్తూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయంటూ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటరు మాల్యా ఆరోపించిన నేపథ్యంలో సురేష్ ప్రభు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జెట్ ఎయిర్వేస్పై దాదాపు రూ. 8,000 కోట్ల పైచిలుకు రుణభారం పేరుకుపోయింది. బ్యాంకుల షరతులకు ఒప్పుకున్నా: గోయల్ జెట్ ఎయిర్వేస్కి తక్షణం నిధుల సహాయం అందించేందుకు బ్యాంకులు విధించిన షరతులన్నింటికీ తాను అంగీకరించినట్లు సంస్థ ప్రమోటరు, మాజీ చైర్మన్ నరేష్ గోయల్ వెల్లడించారు. జెట్ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రుణపరిష్కార ప్రణాళిక అమలు కోసం పూర్తి సహకారం అందించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రణాళిక కింద సంస్థ యాజమాన్య అధికారాలను బ్యాంకులు తమ చేతుల్లోకి తీసుకోవడంతో పాటు రూ. 1,500 కోట్ల నిధులివ్వనున్నాయి. ఎగురుతున్నది 28 విమానాలే.. ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్ కేవలం 28 విమానాలే నడుపుతోందని, ఇందులో 15 విమానాలు దేశీ రూట్లలో తిరుగుతున్నాయని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా తెలిపారు. ముందుగా జెట్ 15 కన్నా తక్కువ సంఖ్యలో విమానాలే నడుపుతోందంటూ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పిన ఖరోలా.. ఆ తర్వాత తాజా వివరణనిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విదేశీ రూట్లకు సర్వీసులు నడిపే విషయంలో జెట్ సామర్ధ్యాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఒకప్పుడు దాదాపు 119 విమానాలతో సర్వీసులు నడిపిన జెట్ ఎయిర్వేస్ ప్రస్తుతం లీజులు కట్టలేక, ఇతర కారణాలతో పలు విమానాలను నిలిపివేసింది. మార్చి జీతాలు వాయిదా .. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఉద్యోగులకు మార్చి నెలకు జరపాల్సిన జీతాల చెల్లింపులను జెట్ వాయిదా వేసింది. సంక్లిష్టమైన అంశాల వల్ల రుణ పరిష్కార ప్రణాళిక ఖరారుకు మరింత సమయం పట్టనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగులకు పంపిన లేఖలో చీఫ్ పీపుల్ ఆఫీసర్ రాహుల్ తనేజా తెలిపారు. చెల్లింపులు ఎప్పటికిల్లా జరుగుతాయన్నది చెప్పకపోయినప్పటికీ, ఇందుకు సంబంధించిన వివరాలను ఏప్రిల్ 9న మరోసారి అప్డేట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. జెట్‌లో 16,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. షేరు 5 శాతం డౌన్.. విమానాల అద్దెలు చెల్లించలేకపోవడంతో మరో 15 విమానాలను పక్కన పెట్టినట్లు జెట్ ఎయిర్వేస్ వెల్లడించడంతో బుధవారం సంస్థ షేరు 5 శాతం పైగా క్షీణించింది. బీఎస్ఈలో సంస్థ షేరు 5.21 శాతం నష్టంతో రూ. 251.10 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో 6.37 శాతం క్షీణించి రూ. 248కి కూడా తగ్గింది. -
ఎయిర్‌లైన్స్ పనితీరు బాధ్యత వాటిదే..
న్యూఢిల్లీ: ఆర్థిక పనితీరు మెరుగ్గా ఉండేలా చూసుకోవడం, సమర్ధంగా కార్యకలాపాలు నిర్వహించుకోవడమన్నది పూర్తిగా విమానయాన సంస్థల బాధ్యతేనని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. ఆయా సంస్థల రోజువారీ కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోజాలదని చెప్పారు. దేశీ విమానయాన రంగం తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటుండటం, జెట్ ఎయిర్వేస్ పెను సంక్షోభంలో కూరుకుపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రభు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ప్రతి విమానయాన సంస్థ.. మార్కెట్‌ను పరిశీలించి, ఆర్థిక వనరులను చూసుకుని సొంతంగా ఒక వ్యాపార ప్రణాళిక వేసుకుంటుంది. ఈ ప్రణాళికల ఆధారంగా తమ తమ కార్యకలాపాలను సమర్ధంగా నిర్వహించుకోవడం, మెరుగైన ఆర్థిక పనితీరు ఆయా సంస్థల బాధ్యత’ అని మంత్రి చెప్పారు. మరోవైపు, సంక్షోభంలో ఉన్న ఎయిరిండియాకి సంబంధించి పునరుద్ధరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. సమగ్ర ఆర్థిక ప్యాకేజీ, స్పెషల్ పర్పస్ వెహికల్‌కు రుణాల బదలాయింపు తదితర అంశాలను ఇందుకోసం పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ప్రభు తెలిపారు. -
కేంద్ర మంత్రికి ట్వీట్.. అర్ధగంటలో స్టాల్ సీజ్
తిరుపతిలోని రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న క్యాంటీన్లో బిస్కెట్ ప్యాకెట్‌ను ఎమ్మార్పీ కంటే అధికధరలకు విక్రయిస్తున్నారంటూ వినియోగదారుడు రైల్వే మంత్రికి ట్వీట్ చేయడంతో.. అర్ధగంటలో స్టాల్‌ను సీజ్ చేశారు.’ ‘హైదరాబాద్ నుంచి రేణిగుంటకు రైల్లో ప్రయాణిస్తున్న ఓ 20 ఏళ్ల యువతి ఎదురుగా మరో వ్యక్తి కూర్చున్నాడు. ఆ బోగీలో పెద్దగా ప్రయాణికులు లేకపోవడం, వ్యక్తి చూపులు అనుమానంగా ఉండడంతో భయపడ్డ యువతి వెంటనే సమస్యను మంత్రికి ట్వీట్ చేసింది. 12 నిమిషాల తరువాత ఓ స్టేషన్ రాగా ఆ వ్యక్తిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతికి స్వయాన రైల్వే మంత్రి ఫోన్ చేసి అభినందించడం ఇటీవల పత్రికల్లో చదివే ఉంటాం’ ‘ఇటీవల చెన్నై నుంచి విజయవాడ మీదుగా వెళుతున్న రైల్లో ఫ్యాను పనిచేయడం లేదని ఓ ప్రయాణికుడు స్మార్ట్‌ఫోన్ నుంచి ట్విట్టర్ ద్వారా రైల్వే మంత్రికి ట్వీట్ పంపాడు. నిముషాల వ్యవధిలో విజయవాడ సీనియర్ డీఈఈకు సమాచారం అందడంతో విద్యుత్ సిబ్బంది రైలు వద్దకు చేరుకుని ఫ్యాన్ మరమ్మతు చేశారు.’ ‘రెండు రోజుల కిందట బెంగళూరు నుంచి బళ్లారికి రాత్రి వేళ రైల్లో వెళుతున్న ఓ యువతి నెలసరి సమస్యతో బాధపడుతుంటే.. ఆమె స్నేహితురాలు రైల్వే మంత్రికి ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. రైల్వే మంత్రి సూచనతో రంగంలోకి దిగిన అధికారులు ఆరు నిముషాల్లో ఈమె ప్రయాణిస్తున్న బోగి వద్దకు వచ్చి కావాల్సిన శానిటరీ నాప్కిన్లు, మాత్రలు ఇచ్చి వెళ్లారు.’ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే కలిగే మేలు ఎలా ఉంటుందో చెప్పడానికి ఇవి మచ్చుకలు మాత్రమే. ఇటీవల రైళ్లలో ఎదురవుతున్న సమస్యలపై ట్విట్టర్ ద్వారా రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళుతుంటే అప్పటికప్పుడే పరిష్కరిస్తుండడం వల్ల రైళ్లలో ప్రయాణికుల సంఖ్య పెరగడంతోపాటు సంస్థపై జనానికి నమ్మకం కలుగుతోంది. అందుబాటులో ఉన్న సేవలను ఉపయోగించుకోవడంలో విద్యావంతులు తమదైనశైలి మార్కు వేస్తున్నారు. సోషల్ మీడియా సత్తా.. రైళ్లలో ప్రయాణించేటప్పుడు చాలా మందికి వివిధ రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. క్యాటరింగ్లో పాచిన ఆహారం ఇవ్వడం, మరుగుదొడ్ల నుంచి దుర్గంధం వస్తున్నా పట్టించుకోకపోవడం, ఏసీలు, ఫ్యాన్లు పనిచేయకపోవడం లాంటి ఘటనలు చాలానే ఎదురవుతుంటాయి. వీటిని ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక కొందరు.. స్టేషన్లలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మరికొందరు సమస్యను ప్రశ్నించడమే మానేస్తుంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సమస్యల ప్రస్తావనకు సోషల్ మీడియా మంచి మాధ్యమంగా మారుతోంది. సామాన్య మధ్యతరగతి ప్రజల చేతుల్లో స్మార్ట్ఫోన్లు ఉండడం సత్ఫలితాలను ఇస్తున్నాయి. రైలు ప్రయాణాల్లో ఎదురయ్యే సమస్యలను వెంటనే ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళుతున్న ఘటనలు ఇటీవల బాగా పెరిగాయి. ప్రధానంగా సమస్యలను రైల్వేశాఖ మంత్రికి క్షణాల్లో చెప్పడం.. నిమిషాల్లో ఇవి పరిష్కారానికి నోచుకుంటుండడంతో ప్రజలు సైతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 24 గంటల పర్యవేక్షణ.. ట్విట్టర్లో రైల్వే మంత్రికి అందే ఫిర్యాదులను ఢిల్లీలోని రైల్ భవన్ అధికారులు పర్యవేక్షిస్తుంటారు. ఇది 24 గంటల పాటు పనిచేసే సెంట్రల్ వ్యవస్థ. రైలు ప్రయాణికులు పంపే ఫిర్యాదులను రైల్వే మంత్రి చూడడంతో పాటు.. రైల్ భవన్‌లోని అధికారులు సైతం ఫిర్యాదులు చూస్తూ ఉంటారు. ట్విట్టర్ వేదికగా వచ్చే ఫిర్యాదులు, సూచనలపై అప్పటికప్పుడు సానుకూల స్పందన వస్తుండడం ప్రయాణికులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ఎలాంటి సమస్యలంటే... రైల్లో దొంగతనాలు జరుగుతున్నా సిబ్బంది స్పందిచకపోవడ అనుమానిత వ్యక్తులు మన పక్కన ఉన్నప్పుడు.. అసాంఘిక కార్యకలాపాలు రైల్లో జరుగుతున్నప్పుడు రైల్వే స్టేషన్లలో, రైళ్లలో ఆహార పదార్థాల్లో నాణ్యత లేకపోవడం, క్యాంటీన్లలో ఎమ్మార్పీ కన్నా అధిక ధరలు వసూలు చేసినా ప్లాట్‌ఫామ్‌పై నీళ్లు రాకపోయినా, రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల వసతులు సరిలేకపోయినా, అసౌకర్యాలపై రైల్లో ప్రయాణికులు అనారోగ్యానికి గురైనా, మహిళలు, దివ్యాంగుల బోగీల్లో ఇతరులు ఎక్కినా ఫిర్యాదులు చేయొచ్చు. ఇలాంటివే ఫిర్యాదు చేయాలి.. ఇలాంటి చేయకూడదని లేదు. కానీ ఫిర్యాదు చేసేటప్పుడు కాస్త విజ్ఞతతో ఆలోచిస్తే సరి. ట్వీట్ చేసేటప్పుడు తప్పనిసరిగా పేరు, ఫోన్ నంబరు నమోదు చేయాలి. అలాగే ప్రయాణి కుల బెర్తు, బోగీ కూడా రాయాలి. మీరూ ట్విట్టండి.. స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా ట్విట్టర్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ట్విట్టర్లో వ్యక్తి పేరు, పాస్వర్డ్, మెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ నమోదు చేసి సేవ్ చేసుకున్న తరువాత ట్విట్టర్ వినియోగంలోకి వస్తుంది. అనంతరం రైల్వే మినిస్టర్ అని టైప్‌చేస్తే రైల్వేమంత్రి పీయుష్ గోయల్ చిత్రంతో పాటు సైట్ ఓపెన్ అవుతుంది. ప్రయాణికులు తమకు తెలిసిన భాషల్లో సమస్యలను నేరుగా మంత్రికి ట్వీట్ రూపంలో తెలియచేయొచ్చు. ట్వీట్ మెసేజ్ సెకన్ల వ్యవధిలోనే ఆయా డివిజన్ల రైల్వే ఉన్నతాధికారులకు చేరుతుంది. అర్ధరాత్రులు సైతం అధికారులు స్పందిస్తారు. మెసేజ్ చేరగానే అప్రమత్తమై ప్రయాణికుల సమస్యలను పరిష్కరించి తిరిగి రైల్వే మంత్రికి నివేదిస్తారు. -
స్టార్టప్‌లకు ఉపశమనం!
న్యూఢిల్లీ: పన్నుకు సంబంధించి స్టార్టప్ సంస్థల్లో నెలకొన్న భయాందోళనలు కాస్త ఉపశమించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏంజెల్ ఫండ్స్ వెచ్చించే పెట్టుబడులపై స్టార్టప్స్ పన్ను మినహాయింపులను కోరేందుకు సంబంధించిన ప్రక్రియను సరళతరం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఏంజెల్ ఫండ్స్ ద్వారా తాము సమీకరించిన నిధులపై పన్నులు చెల్లించాలంటూ ఇటీవలి కాలంలో ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ నుంచి తమకు నోటీసులందటంపై స్టార్టప్స్ వ్యవస్థాపకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఐటీ చట్టంలోని సెక్షన్ 56 (2) కింద స్టార్టప్ సంస్థలకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. స్టార్టప్‌కు పన్ను మినహాయింపు నిబంధనల విషయంలో తాజా మార్పుల నోటిఫికేషన్‌కు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆమోదం తెలిపినట్లు ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ‘త్వరలో అమల్లోకి రానున్న కొత్త విధానం ప్రకారం స్టార్టప్స్ గనుక ఏంజెల్ ఫండ్స్‌పై పన్ను మినహాయింపులను కోరాలంటే ముందుగా పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగానికి (డీఐపీపీ) దరఖాస్తు చేసుకోవాలి. నిర్ధేశిత స్టార్టప్ దరఖాస్తును తగిన ధ్రువపత్రాలతో కలిపి కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల విభాగానికి (సీబీడీటీ) డీఐపీపీయే పంపుతుంది. దరఖాస్తును అందుకున్న 45 రోజుల్లోగా స్టార్టప్‌లకు పన్ను మినహాయింపునకు ఆమోదం తెలపడం లేదా నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తిరస్కరించడంపై సీబీడీటీ కచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. త్వరలో నోటిఫికేషన్... గతంలో స్టార్టప్‌లు సమర్పించే పన్ను మినహాయింపు దరఖాస్తును అంతర్ మంత్రిత్వ శాఖల విభాగం ధ్రువీకరణ కోసం పంపేవారు. దీనివల్ల జాప్యం అయ్యేంది. ఇప్పుడు డీఐపీపీ ద్వారా నేరుగా సీబీడీటీకి పంపేలా ప్రక్రియను సరళతరం చేసినట్లు ప్రభుత్వం వర్గాలు వివరించాయి. అదేవిధంగా స్టార్టప్‌లు విక్రయించిన షేర్లకు మార్కెట్ విలువ ఎంతనేది నిర్ధారిస్తూ మర్చెంట్ బ్యాంకర్ నుంచి నివేదికను తీసుకొని సమర్పించాలన్న గత నిబంధనను కూడా తాజాగా తొలగించారు. డీఐపీపీ గుర్తింపు ఉన్న స్టార్టప్‌లన్నీ కొన్ని షరతులకు లోబడి ఈ పన్ను మినహాయింపు పొందే వీలుంది. ప్రధానంగా ఖాతాల వివరాలతోపాటు గడిచిన మూడేళ్ల ఆదాయపు పన్ను రిటర్నులను సమర్పించాలి. అలాగే ఏంజెల్ ఇన్వెస్టర్లు కూడా తమ నెట్‌వర్త్, పెట్టుబడిపై ఎంత ఆదాయం వచ్చింది అనే వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. కాగా, ఏంజెల్ ఫండ్స్ ఇతరత్రా ఇన్వెస్టర్ల నుంచి రూ.10 కోట్లకు మించి జరిపిన నిధుల సమీకరణపై పూర్తిగా పన్ను మినహాయింపు వర్తిస్తుందని 2018 ఏప్రిల్‌లో ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఐటీ చట్టంలోని సెక్షన్ 56(2) ప్రకారం స్టార్టప్స్ తమకున్న మార్కెట్ విలువకు మించి జరిపే నిధుల సమీకరణపై 30 శాతం పన్ను విధించేందుకు వీలుంది. దీని ఆధారంగానే ఐటీ శాఖ నోటీసులు జారీచేసింది. కాగా, పన్ను మినహాయింపు నిబంధనల్లో తాజా మార్పులన్నీ నోటిఫికేషన్ జారీ అయినతర్వాత అమల్లోకి వస్తాయని.. ఇప్పటికే నోటీసులు అందుకున్న వారికి కొత్త నిబంధనలు వర్తించవని ఆయా వర్గాలు తెలిపాయి. ఏటా 300– 400 స్టార్టప్‌లకు ఏంజెల్ ఫండ్స్ నుంచి నిధులు అందుతుండగా... 2018 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ కేవలం రెండు స్టార్టప్స్‌కు మాత్రమే పన్ను మినహాయింపు లభించడం గమనార్హం. ఈ అంశాన్ని కూడా మంత్రి సురేష్ ప్రభు కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లారు. ఏంజెల్ ట్యాక్స్ రద్దు చేయండి ప్రధానిని కోరిన ఐస్పిర్ట్ న్యూఢిల్లీ: స్టార్టప్‌లకు శాపంగా మారిన ఏంజెల్ ట్యాక్స్‌ను తక్షణం రద్దు చేయాలని స్టార్టప్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐస్పిర్ట్... ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. ఈ మేరకు ఈ సంస్థ ఒక లేఖ రాసింది. స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టడం చాలా రిస్క్ అని పేర్కొంది. ఏంజెల్ ఇన్వెస్టర్లు ఎంతో రిస్క్ తీసుకొని ఈ పెట్టుబడుల పెడతారని, విదేశాల్లో ఇలాంటి పెట్టుబడులకు నజరానాలిస్తుండగా, ఇక్కడ మాత్రం పన్నులు వేసి పీడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆదాయపు పన్ను విభాగం నుంచి నోటీసులు వస్తుండటంతో పలు స్టార్టప్‌లు బెంబేలెత్తుతున్నాయని, కొన్ని మూతపడుతున్నాయని పేర్కొంది. ఈ ఏంజెల్ ట్యాక్స్‌ను తక్షణం రద్దు చేయాలని, అలా కుదరని పక్షంలో కనీసం నిబంధనలను సరళీకరించాలని కోరింది. స్టార్టప్‌లలో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు 20 లక్షల డాలర్ల నుంచి కోటి డాలర్ల వరకు ఇన్నోవాక్సర్లో తొలి పెట్టుబడి బెంగళూరు: అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్ స్టార్టప్‌లలో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన కార్పొరేట్ వెంచర్ ఫండ్, ఎమ్12 (గతంలో మైక్రోసాఫ్ట్ వెంచర్స్ ఫండ్‌గా వ్యవహరించేవారు) భారత స్టార్టప్‌లలో ఒక్కో కంపెనీలో 20 లక్షల డాలర్ల నుంచి కోటి డాలర్ల రేంజ్లో పెట్టుబడులు పెట్టబోతోంది. దీన్లో భాగంగా తొలి పెట్టుబడి పెట్టడానికి హెల్త్ టెక్ స్టార్టప్, ఇన్నోవాక్సర్‌ను ఎంచుకున్నామని ఎమ్12 పార్ట్నర్ రష్మి గోపీనాధ్ చెప్పారు. బీ2బీ స్టార్టప్‌లలో ఏ నుంచి సి రౌండ్ సిరీస్‌లలో నిధులు సమకూరుస్తామని పేర్కొన్నారు. బిగ్ డేటా, అనలిటిక్స్, బిజినెస్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్‌లకు నిధులందిస్తామని ఆమె పేర్కొన్నారు. -
వ్యవసాయ ఎగుమతుల పెంపుపై దృష్టి
న్యూఢిల్లీ: వ్యవసాయ ఎగుమతుల పురోగతిపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఈ దిశలో రాష్ట్రాలకు రవాణా సబ్బిడీని అందించాలని యోచిస్తోంది. వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు గురువారం ఈ విషయం తెలిపారు. అంతకుముందు వాణిజ్యం, అభివృద్ధి వ్యవహారాల మండలి సమావేశం జరిగింది. కర్ణాటక, పంజాబ్, తమిళనాడుసహా పలు రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయ ఎగుమతుల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశం చర్చించినట్లు ప్రభు తెలిపారు. ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న రుణ సంబంధ సమస్యలపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ, ఫైనాన్స్ వ్యవహారాల కార్యదర్శి ఈ అంశంపై బ్యాంకర్లతో చర్చిస్తారని పేర్కొన్నారు. ఎగుమతుల రంగానికి రుణాన్ని ప్రాధాన్యతాపరమైనదిగా పరిగణించాలని డిమాండ్ ఉంది. అంతర్జాతీయ చట్టాలను ఏ విధంగానూ ఉల్లంఘించకుండా, ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు నెరపడానికి ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. భారత్–చైనాల మధ్య వాణిజ్య సంబంధాలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. 2018–19 ఏప్రిల్–అక్టోబర్ మధ్య భారత్ వ్యవసాయ ఎగుమతుల విలువ 48 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 43.11 బిలియన్ డాలర్లు. -
దేశీ ఈ కామర్స్ సంస్థలకూ అవే నిబంధనలు...
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో (ఎఫ్‌డీఐ) కూడిన ఈ కామర్స్ సంస్థలకు సంబంధించిన నిబంధనలను దేశీయ ఈ కామర్స్ సంస్థలకూ అమలు చేయడం ద్వారా, అనైతిక వ్యాపార విధానాలకు పాల్పడకుండా నిరోధించాలని అఖిల భారత వర్తకుల సంఘం (సీఏఐటీ) డిమాండ్ చేసింది. ఇందుకు సంబంధించిన విధానాన్ని వెంటనే విడుదల చేయాలని కోరుతూ కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్ ప్రభుకు లేఖ రాసింది. ఈ కామర్స్ రంగానికి సంబంధించిన విధానంపై వాణిజ్య శాఖ పనిచేస్తుండగా... త్వరలోనే దాన్ని విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో సీఏఐటీ లేఖ రాయడం గమనార్హం. ‘‘నూతన విధానంలో పేర్కొన్న ఎఫ్‌డీఐ నిబంధనలు దేశీయ ఈ కామర్స్ సంస్థలకూ వర్తింపజేయాలి. అనైతిక వ్యాపార ధోరణలను అనుసరించకుండా నిరోధించాలి. వాటిని ఇతర ఈ కామర్స్ సంస్థలతో సమానంగా చూడాలి’’ అని సీఏఐటీ కోరింది. ఈ రంగానికి స్వతంత్ర నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేసింది. కొన్ని సంఘాలు ఎఫ్‌డీఐ నిబంధనలను తప్పుబడుతున్నాయని, ఎటువంటి ఒత్తిళ్లకు లొంగవద్దని కోరింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి విదేశీ ఈ కామర్స్ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్‌లపై, తమ వాటాలు కలిగిన కంపెనీల ఉత్పత్తులను విక్రయించకుండా, ప్రత్యేకమైన మార్కెటింగ్ ఒప్పందాలతో ఉత్పత్తులను మార్కెట్ చేయకుండా ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం విదితమే. అయితే త్వరలోనే ఈ–కామర్స్‌లోకి రావటానికి ప్రయత్నాలు చేస్తున్న రిలయన్స్ వంటి సంస్థలకు ఈ పరిణామం లాభించవచ్చనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ సంస్థలకూ ఇవే నిబంధనలు వర్తింపజేయాలని వర్తకుల సంఘం డిమాండ్ చేస్తోంది. -
త్వరలో కొత్త పసిడి విధానం
న్యూఢిల్లీ: పసిడిపై కేంద్రం ఒక సమగ్ర విధానాన్ని రూపొందిస్తోంది. త్వరలో బంగారంపై కొత్త విధానం ప్రకటించే అవకాశం ఉందని వాణిజ్యశాఖ మంత్రి సురేశ్ ప్రభు గురువారమిక్కడ తెలియజేశారు. పసిడి పరిశ్రమ వృద్ధి, ఆభరణాల ఎగుమతుల వృద్ధి ప్రధాన లక్ష్యాలతో తాజా విధాన రూపకల్పన ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం మొత్తం భారత ఎగుమతుల్లో రత్నాలు, ఆభరణాల వాటా 15 శాతంగా ఉంది. విధాన రూపకల్పనలో భాగంగా సంబంధిత వర్గాలతో రానున్న కొద్ది రోజుల్లో సమావేశం కానున్నట్లు ప్రభు తెలిపారు. పసిడిపై ప్రస్తుతం 10 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలన్న పరిశ్రమ డిమాండ్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 100 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు లక్ష్యం.. భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించడానికి కేంద్రం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లు మంత్రి ప్రభు తెలిపారు. వచ్చే రెండేళ్లలో 100 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు రప్పించటమనేది కేంద్రం లక్ష్యమని తెలిపారు. భారత్‌లో ఏ రంగాలు భారీ పెట్టుబడులను కోరుతున్నాయి? ఇందుకు ఏ దేశాల నుంచి పెట్టుబడులను పొందే అవకాశం ఉంటుంది? వంటి అంశాలపై వాణిజ్య, పరిశ్రమల పరిశ్రమల మంత్రిత్వశాఖ దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ దిశగా విదేశాలతో చర్చలకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. స్టార్టప్స్ పన్ను సమస్యల పరిష్కారం స్టార్టప్స్ పురోగతికి కేంద్రం తగిన చర్యలన్నీ తీసుకుంటుందని సురేశ్ ప్రభు తెలిపారు. ప్రత్యేకించి ఏంజిల్ ఫండ్స్ నుంచి నిధుల సమీకరణలో స్టార్టప్స్ ఎదుర్కొంటున్న పన్ను సంబంధ సమస్యలు పరిష్కరించాలని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కోరినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. స్టార్టప్స్, ఏంజిల్ ఇన్వెస్టర్స్ ఎదుర్కొంటున్న పన్ను సమస్యల పరిష్కార మార్గాలను సూచించడానికి గత వారం కేంద్రం ఒక నిపుణుల కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. -
భారత్ ఎగుమతులు బాగున్నాయి
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు గడచిన 14 నెలల్లో చాలా బాగున్నాయని వాణిజ్యశాఖ మంత్రి సురేశ్ ప్రభు బుధవారం చెప్పారు. అయితే పూర్తి సంతృప్తి మాత్రం లేదన్నారు. ఎగుమతుల పెంపునకు భారత్ ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేస్తోందని మంత్రి తెలిపారు. 2019లో పటిష్ఠ వృద్ధి సాధించడానికి ఎగుమతులే ప్రధాన వనరుగా ఉండాలన్నది ఈ వ్యూహం లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా లాటిన్ అమెరికా, ఆఫ్రికా ఖండంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. రక్షణాత్మకవాదం, మందగమనం, వాణిజ్య యుద్ధం, దిగుమతి సుంకాలుసహా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రతికూలతలు నెలకొన్నప్పటికీ, దేశ ఎగుమతులు పెరుగుతుండడం గమనార్హమని మంత్రి పేర్కొన్నారు. 2011–12 నుంచి దేశ ఎగుమతుల విలువ 300 బిలియన్ డాలర్లుగా ఉంది. 2017–18లో 10% వృద్ధితో 303 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అల్యూమినియంపై దిగుమతి సుంకం పెంపు! అల్యూమినియంపై దిగుమతి సుంకాల పెంపునకు కేంద్రం సానుకూలంగా ఉంది. దేశీయ పరిశ్రమ, తయారీ ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా ఈ ఆలోచన చేస్తున్నట్లు ప్రభు పేర్కొన్నారు. ఈ కమోడిటీ భారీ దిగుమతులపై అల్యూమినియం పరిశ్రమ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అల్యూమినియం స్క్రాప్‌పై బేసిక్ కస్టమ్స్ సుంకం 2.5%. ప్రైమరీ అల్యూమినియంపై 7.5%. రెండింటిపై ఈ సుంకాన్ని 10 శాతానికి పెంచాలన్న డిమాండ్ వస్తోంది. దీనితోపాటు ఈ కమెడిటీ దిగుమతిపై కనీస దిగుమతి ధర, దిగుమతులపై కోటా నిర్దేశం వంటి మరికొన్ని పరిమితులూ విధించాలని దేశీయ పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. -
ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు ప్రముఖ నేతలు
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు వార్షిక సమావేశాలు వచ్చే నెల 21 నుంచి 25వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ పట్టణంలో జరగనున్నాయి. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ కిమ్ సహా ఆరుగురు సంయుక్తంగా అధ్యక్షత వహిచనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం పాల్గొనవచ్చని అంచనా వేస్తున్నారు. వివిధ దేశాల ప్రభుత్వాధిపతులు, రాజకీయ నేతలు, వ్యాపారులు, పౌర సమాజం ప్రముఖులు కలసి 3,000 మంది వరకు ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు. ‘ప్రపంచీకరణ 4.0: నాలుగో పారిశ్రామిక విప్లవం దశలో ప్రపంచ స్వరూపం’ ఈ కార్యక్రమం ప్రధాన అంశంగా ఉంటుంది. వాతావరణం మార్పులు, జీవ వైవిధ్యం, ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాల నష్టం అంశాలను పరిష్కరించాల్సి ఉందని ప్రపంచ ఆర్థిక ఫోరం వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్లౌస్ ష్వాబ్ పేర్కొన్నారు. కేటీఆర్, లోకేశ్ సైతం...: భారత్ నుంచి పాల్గొనే వారిలో అరుణ్ జైట్లీతోపాటు కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కమల్‌నాథ్, చంద్రబాబునాయుడు, దేవేంద్ర ఫడ్నవిస్ ఉన్నారు. చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, కేటీఆర్ సైతం హాజరు కానున్నారు. వ్యాపార ప్రముఖులు అజీమ్ ప్రేమ్‌జీ, ముకేశ్ అంబానీ దంపతులు, ఉదయ్ కోటక్, గౌతం అదానీ, లక్ష్మీ మిట్టల్, నందన్ నీలేకని, ఆనంద్ మహీంద్రా, అజయ్ పిరమల్ కూడా పాలు పంచుకోనున్నారు. -
ఈ–కామర్స్‌లో పారదర్శకతకు పెద్దపీట
న్యూఢిల్లీ: ఆన్లైన్ వ్యాపారంలో పారదర్శకతను పెంపొందించే దిశగా కొత్త ఈ–కామర్స్ విధానం ఉంటుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. ధరలు, డిస్కౌంట్లలో పారదర్శకతతో పాటు ఇటు రిటైలర్లు అటు కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షించడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) కొత్త విధానం ముసాయిదాపై కసరత్తు చేస్తోందని, వచ్చే 2–3 వారాల్లో సంబంధిత వర్గాల అభిప్రాయాల కోసం దీన్ని వెల్లడిస్తామని ప్రభు తెలిపారు. ‘ఈ–కామర్స్ వ్యాపార నిర్వహణను సులభతరం చేయడమనేది పాలసీ ప్రధాన లక్ష్యం. ఇటు రిటైలర్లకు... అటు వినియోగదారులకు ఇది ప్రయోజనకరంగా ఉండాలి. ఈ–కామర్స్ వ్యాపారంలో ధరలు, డిస్కౌంట్ల విషయంలో పూర్తి పారదర్శకత ఉండాలి‘ అని ఆయన చెప్పారు. ‘డిస్కౌంట్లు ఇవ్వొచ్చని గానీ ఇవ్వొద్దని గానీ మేం నిర్దేశించబోము. ఏది చేసినా పారదర్శకంగా ఉండాలన్నదే మా ఉద్దేశం‘ అని మంత్రి వివరించారు. వాణిజ్య శాఖ గతంలో తయారు చేసిన ముసాయిదాలోని సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకుని కొత్త ముసాయిదాను ఖరారు చేయనున్నట్లు చెప్పారు. మరోవైపు, భారత్‌లో తయారీ కేంద్ర ఏర్పాటు విషయంలో కొన్ని మినహాయింపులు కోరుతున్న అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ ప్రతినిధులతో వచ్చే నెల దావోస్‌లో భేటీ కానున్నట్లు సురేశ్ ప్రభు తెలిపారు. ఇప్పటికే యాపిల్‌తో చర్చలు జరుగుతున్నాయని, ఆ సంస్థ కోరుతున్న మినహాయింపులను ప్రభుత్వం పరిశీలించే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. -
ఏంజెల్ ట్యాక్స్‌పై స్టార్టప్‌లలో ఆందోళన
న్యూఢిల్లీ: ఏంజెల్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఆదాయ పన్ను శాఖ నోటీసులు పంపుతుండటం.. స్టార్టప్ సంస్థలను కలవరపెడుతోంది. పలు స్టార్టప్‌లు వీటిపై ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. దీనిపై ఆర్థిక శాఖతో చర్చిస్తున్నట్లు సైటు ట్విటర్లో పేర్కొన్నారు.మరోవైపు, పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) గుర్తింపు లేని స్టార్టప్స్‌కు మాత్రమే ఏంజెల్ ట్యాక్స్ నోటీసులు జారీ అవుతుండవచ్చని ఆదాయ పన్ను శాఖ అధికారి తెలిపారు. అటు ఈ నోటీసుల కారణంగా ఏంజెల్ ఇన్వెస్టర్లు, స్టార్టప్‌లు పన్నులపరమైన వేధింపులకు గురికాకుండా చూడాలని రెవెన్యూ విభాగం దృష్టికి తీసుకెళ్లినట్లు డీఐపీపీ వెల్లడించింది. స్టార్టప్‌లలో సిసలైన పెట్టుబడులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. ప్రారంభ దశలోని స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లను ఏంజెల్ ఇన్వెస్టర్లుగా వ్యవహరిస్తారు. ఇలాంటి ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధులతో పాటు మొత్తం పెట్టుబడులు రూ. 10 కోట్ల లోపే ఉంటే పన్నుల నుంచి మినహాయింపులు ఉంటున్నాయి. సముచిత మార్కెట్ రేటుకు మించి ప్రీమియంతో ఏంజెల్ ఇన్వెస్టర్ పెట్టుబడులు పెట్టారని భావించిన పక్షంలో అలా సేకరించిన అధిక మొత్తానికి 30 శాతం పన్ను రేటు వర్తిస్తుందని ఆదాయ పన్ను శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీన్నే ఏంజెల్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తున్నారు. -
రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే.. దేశాభివృద్ధి
సాక్షి, విజయవాడ: కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కలిసి పనిచేయాలని, రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. గన్నవరం విమానశ్రయంలో 611 కోట్ల రూపాయలతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ టెర్మినల్‌కు భూమి పూజ కార్యక్రంమంలో కేంద్ర పౌర విమానాయ శాఖ మంత్రి సురేష్ ప్రభు, సహాయ మంత్రి జయంత్ సిన్హాతో కలిసి పాల్గొన్న ఆయన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రవాణా రాకపోకాలు పెరగటం అభివృద్ధికి సూచిక అని పేర్కొన్నారు. గన్నవరం విమానశ్రయంలో సింగపూర్‌కే కాదు ప్రపంచ దేశాలకు సైతం విమాన సర్వీసులు రావాలని ఆకాంక్షించారు. అందమైన కృష్ణా నది, కూచిపూడి నాట్యం, జాస్మిన్ ప్లవర్ ఆకారాలలో న్యూ టెర్మినల్ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. రోడ్డు, రైలు, ఎయిర్, వాటర్ కనెక్టివిటీకి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తిరుపతి, రాజమండ్రి, కడప ఎయిర్ పోర్టుల అభివృద్ది కూడా జరగాల్సి ఉందన్నారు. 100 కొత్త విమానాశ్రయాలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్దికి అవసరమైన మౌళిక సౌకర్యాలు సమకూర్చుతున్నామని కేంద్ర పౌర విమానాయ శాఖ మంత్రి సురేష్ ప్రభు పేర్కొన్నారు. 65 బిలియన్ డాలర్స్ వెచ్చించి100 కొత్త విమానాశ్రాయాలు నెలకొల్పామని తెలిపారు. టెర్మినల్ పూర్తయిన తరువాత ఏపీకి ఐకాన్‌గా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందన్నారు. ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌తో పోటీగా ప్రయాణికులకు సౌకర్యాలు సమకూర్చుతున్నామన్నారు. వచ్చే రెండు రోజుల్లో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుందని తెలిపారు. -
కుట్రలను వెలికితీయండి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం వెనుక దాగిన కుట్రలను వెలికి తీయాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పౌర విమానయానశాఖ మంత్రి సురేష్‌ప్రభుకు లేఖ రాశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బి.ఎస్.భుల్లర్ నుంచి సంబంధిత సమాచారాన్ని ఆశిస్తున్నట్టు పేర్కొంటూ డీజీసీఏకు 13 ప్రశ్నలు సంధించారు. జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం వెనుక కుట్రలను వెలుగులోకి తెచ్చేందుకు రాజ్యసభ సభ్యుడిగా ఈ సమాచారాన్ని కోరుతున్నట్లు లేఖలో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. హత్యాయత్నం ఘటనపై దర్యాప్తునకు ఆదేశిస్తారని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. డైరెక్టర్ జనరల్‌కు ఎంపీ వి.విజయసాయిరెడ్డి ప్రశ్నలు ఇవీ.. - జె.శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఏరోడ్రమ్ ఎంట్రీ పర్మిట్(ఏఈపీ) కోసం దుండగుడు శ్రీనివాస్ లేదా అతడి యజమాని హర్షవర్దన్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీకి దరఖాస్తు సమర్పించారా? ఒకవేళ సమర్పిస్తే జె.శ్రీనివాసరావుకు నేర చరిత ఉన్న సంగతిని దరఖాస్తులో ప్రస్తావించారా? క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్న సంగతి ప్రస్తావించారా? - ఫ్యూజన్ రెస్టారెంట్లో పనిచేయడానికి అనుమతి ఇచ్చేముందు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ నిందితుడు శ్రీనివాసరావు గత చరిత్ర గురించి ఏపీ పోలీసులను నివేదిక కోరారా? కోరితే ఏపీ పోలీసుల నుంచి వచ్చిన జవాబు ఏమిటి? - జె.శ్రీనివాసరావుకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో పనిచేసేందుకు అవసరమైన అనుమతి ఉందా? అతడు అక్కడ ఏ ప్రాంతం/జోన్లో తిరిగేందుకు అనుమతి ఉంది? - జె.శ్రీనివాసరావు లేదా హర్షవర్దన్‌లు ఏఏఐకి చెందిన లాంజ్ ఆఫీసర్ నుంచి గానీ మేనేజర్ నుంచి గానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ అధికారి నుంచి గానీ ఎయిర్‌పోర్టులోని ముఖ్య ప్రాంతాల్లో తిరిగేందుకు అనుమతి తీసుకున్నారా? - విశాఖ ఎయిర్‌పోర్టులోని విమానాల్లో కూడా ఆహారం పంపిణీ చేసేందుకు జె.శ్రీనివాసరావు అనుమతి కలిగి ఉన్నాడా? ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌కు విభిన్న ఎయిర్‌లైన్ సంస్థలకు చెందిన విమానాల్లో ప్రయాణికులకు ఆహారం సరఫరా చేసేందుకు అనుమతి ఉందా? - ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్దన్ విశాఖపట్నం ఎయిర్‌పోర్టులోని అన్ని సున్నితమైన ప్రాంతాల్లో తిరగడం వాస్తవం కాదా? అది నిజమే అయితే అందుకు అనుమతి ఎవరు ఇచ్చారు? - ఏ నిబంధన కింద హర్షవర్దన్‌కు విశాఖ ఎయిర్‌పోర్టులో రెస్టారెంట్ నిర్వహించేందుకు అనుమతి మంజూరు చేశారు? రెస్టారెంట్ నిర్వహణలో హర్షవర్దన్ ఏవైనా నిబంధనలు ఉల్లంఘించారా? - సీఎం చంద్రబాబు విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రతిసారి హర్షవర్దన్ ఆయనకు స్వాగతం పలిపేందుకు విమానం వరకూ వెళ్లడం వాస్తవం కాదా? విమానం వరకూ వెళ్లి ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు హర్షవర్దన్‌కు ఎవరు అనుమతి ఇచ్చారు? - హర్షవర్దన్‌పై గానీ రెస్టారెంట్‌పై గానీ అందులో పనిచేసే సిబ్బందిపై గానీ ఏవైనా ఫిర్యాదులు నమోదయ్యాయా? - విశాఖపట్నం ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో పనిచేసేందుకు ఎవరెవరిని అనుమతించారు? - ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ పనివేళలు ఏమిటి? - సిబ్బందికి పని వేళలు రోస్టర్ ప్రకారం ఉంటాయా? జె.శ్రీనివాసరావు, ఇతర సిబ్బంది పని వేళలు ఏమిటి? - విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఎప్పుడు ఆడిట్ నిర్వహించింది? తనిఖీలు లేదా విచారణ చేసినప్పుడు హర్షవర్దన్ విషయంలో గానీ లేదా సిబ్బంది విషయంలో గానీ ఏవైనా అవకతవకలు గానీ నేరపూరిత చర్యలు గానీ నిబంధనల ఉల్లంఘన గానీ గుర్తించిందా? గుర్తిస్తే తీసుకున్న చర్యలేమిటి? -
వాణిజ్య వివాదాలపై అమెరికాతో చర్చలు: మంత్రి సురేష్ ప్రభు
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక వాణిజ్య సమస్యలను పరిష్కరించుకునే దిశగా భారత్, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. ఇందుకు సంబంధించి అమెరికా చేసిన ఆఫర్‌కు ప్రతిగా భారత్ మరో ప్రతిపాదన చేసినట్లు ఆయన వివరించారు. భారత్ నుంచి దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా భారీగా సుంకాలు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతిగా అమెరికా నుంచి దిగుమతయ్యే పప్పులు, ఉక్కు, ఇనుము వంటి సుమారు 29 ఉత్పత్తులపై సుంకాలను నవంబర్ 2 నుంచి పెంచనున్నట్లు భారత్ ప్రకటించింది. అయితే, తాజాగా ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను వాయిదా వేసిన నేపథ్యంలో మంత్రి వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. -
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం; స్పందించిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టాలని సీఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంతో సహా అన్ని శాఖలను ఆదేశించారు. ఎవరు బాధ్యులో గుర్తించాలని విమానయాన శాఖ కార్యదర్శికి సూచించినట్టు వెల్లడించారు. వైఎస్ జగన్‌పై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. విచారణ జరిపి దోషిని శిక్షిస్తామన్నారు. తక్షణమే దర్యాప్తు మొదలు పెట్టాలని ఆదేశించామని, విచారణ జరుగుతోందని సురేశ్ ప్రభు ట్విటర్లో పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న సురేశ్ ప్రభు అదనంగా పౌర విమానయాన శాఖను చూస్తున్నారు. అశోక్‌గజపతి రాజు ఈ పదవికి రాజీనామా చేయడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిఫారసు మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనకు మార్చిలో విమానయాన శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. Shocked by attack on Mr Jagan Reddy,Asked all agencies to investigate matter thoroughly,including @CISFHQrs .Asked secretary civil aviation to fix responsibility.I strongly condemn this cowardly attack,we will punish the guilty.Investigations are underway, started immediately — Suresh Prabhu (@sureshpprabhu) October 25, 2018 సంబంధిత కథనాలు: వైఎస్ జగన్‌పై హత్యాయత్నం! సెల్ఫీ తీసుకుంటానని నవ్వూతూ వచ్చాడు.. ‘ఎయిర్‌పోర్టులోకి కత్తులు అనుమతిస్తారా?’ ఇది పిరికిపందల చర్య: ఓవైసీ నిందితుడి జేబులో లెటర్ : పథకం ప్రకారమే దాడి -
25 నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసు నడపాల్సిందే
సాక్షి, అమరావతి: విజయవాడ– సింగపూర్ విమాన సర్వీసులు ఎట్టి పరిస్థితుల్లో ఈనెల 25 నుంచి ప్రారంభించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సీట్లు భర్తీ కాకపోతే ఆ నష్టాన్ని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఇస్తామని ఫ్రభుత్వం ఇచ్చిన హామీతో ఇండిగో సర్వీసులు నడపడానికి ముందుకొచ్చింది. గన్నవరం విమానాశ్రయంలో అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించడానికి తగిన మౌలిక వసతులు లేవంటూ కస్టమ్స్, ఎయిర్పోర్టు్ట అధికారులు మధ్య వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం సచివాలయంలో ఆయాశాఖల అధికారులతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కింద రూ.18 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చినా జాప్యం చేయడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై త్వరలోనే ఆర్థిక మంతి అరుణ్‌జైట్లీ, విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభుకు లేఖ రాయనున్నట్లు సీఎం తెలిపారు. -
60 బిలియన్ డాలర్లతో 100 కొత్త విమానాశ్రయాలు!
న్యూఢిల్లీ: రానున్న 10–15 ఏళ్లలో 100 కొత్త విమానాశ్రయాలను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలియజేశారు. ఇందుకు దాదాపు 60 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.2 లక్షల కోట్లు) వ్యయం అవుతుందని మంగళవారమిక్కడ ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. గత మూడేళ్లుగా విమాన ప్రయాణికుల డిమాండ్ పుంజుకోవడంతో దేశీ విమానయాన రంగం రెండంకెల వృద్ధిని నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయాలను మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) 120కి పైగానే ఏరోడ్రోమ్స్‌ను నిర్వహిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఎయిర్‌పోర్టులను నిర్మించాలనేది మా వ్యూహం’ అని ప్రభు వివరించారు. కొత్తగా ఎయిర్‌కార్గో విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వెల్లడించారు. 2037 నాటికి భారత్‌కు సంబంధించి మొత్తం వార్షిక విమాన ప్రయాణికుల సంఖ్య (విదేశీ, దేశీ ప్రయాణికులు) 52 కోట్లకు చేరుతుందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ అసోసియేషన్ (ఐఏటీఏ) అంచనా వేస్తోంది. 2010లో ఈ సంఖ్య 7.9 కోట్లుగా ఉండగా... 2017 నాటికి రెట్టింపు స్థాయిలో 15.8 కోట్లకు పెరిగింది. మరో పదేళ్లలోపే జర్మనీ, జపాన్, స్పెయిన్, బ్రిటన్లను అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా (ప్రయాణికుల పరంగా) భారత్ అవతరించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. -
లాజిస్టిక్స్‌లో పెట్టుబడుల వెల్లువ
న్యూఢిల్లీ: లాజిస్టిక్స్ రంగంలో 2025 నాటికి 500 బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ. 34.5 లక్షల కోట్లు) పెట్టుబడులు రాగలవని వాణిజ్య మంత్రి సురేశ్ ప్రభు చెప్పారు. దీంతో లక్షల కొద్దీ ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. అలాగే దేశీయంగా వ్యాపారాలకు, అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్య కార్యకలాపాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోగలవని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ దిశగా సమగ్రమైన వ్యూహాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన, పాలనాపరమైన చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రూపొందించిన ఇండియా లాజిస్టిక్స్ లోగోను సోమవారం ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. మిగతా దేశాలతో పోలిస్తే లాజిస్టిక్స్ వ్యయాలు భారత్‌లో అత్యధికంగా.. స్థూల దేశీయోత్పత్తిలో 14 శాతంగా ఉన్నాయి. ‘2025 నాటికి ఇన్ఫ్రా సహా లాజిస్టిక్స్‌లో పెట్టుబడులు 500 బిలియన్ డాలర్లకు చేరతాయి. ప్రపంచ వాణిజ్యంలో మన వాటాను మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో లాజిస్టిక్స్‌దే కీలక పాత్ర’ అని ప్రభు చెప్పారు. భారీ లాజిస్టిక్స్ వ్యయాలు.. పోటీ తత్వంపైనా, సరకు రవాణాపైనా ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. లాజిస్టిక్స్‌కి సంబంధించిన వర్గాలన్నింటినీ ఒకే చోట చేర్చేలా వాణిజ్య శాఖ ప్రత్యేకంగా జాతీయ లాజిస్టిక్స్ పోర్టల్‌ను తయారు చేస్తోందని వివరించారు. ఎగుమతి.. దిగుమతి వ్యయాలు, దేశీయంగా వాణిజ్య వ్యయాలను తగ్గించేందుకు సమగ్రమైన వ్యూహాన్ని కూడా రూపొందిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. సెంటర్ ఫర్ లాజిస్టిక్స్ ఏర్పాటుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ)తో లాజిస్టిక్స్ విభాగం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. -
త్వరలో కొత్త కేంద్ర పారిశ్రామిక విధానం
సాక్షి, హైదరాబాద్: త్వరలో కేంద్రం కొత్త పారిశ్రా మిక విధానాన్ని ప్రకటించనున్నట్లు కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. తోలు పరిశ్రమ వంటి సంప్రదాయ రంగాల పరిశ్రమలను పునరుద్ధరించడంతో పాటు భవిష్యత్తు కలిగిన కొత్త రంగాల్లో పరిశ్రమలను ప్రోత్సహించడంపై కొత్త విధానం దృష్టి పెడుతుం దన్నారు. గురువారం రాయదుర్గంలో ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ) నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. వస్తు ఉత్పత్తిలో ప్రత్యేకత సాధించిన జిల్లాలను గుర్తించి ఈ కొత్త విధానం ద్వారా ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు. 100 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులను అదనంగా విదేశీ మార్కెట్లకు పంపాలన్న లక్ష్యంతో ఈ విధానం తీసుకొస్తున్నట్లు చెప్పారు. దేశ తోలు పరిశ్రమల రంగాన్ని నవీకరించడం, పునరుద్ధరించడంలో భాగంగా ఎఫ్‌డీడీఐ భవనాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు. భవన నిర్మాణానికి స్థలం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సవాళ్ల ను ఎదుర్కొంటూ దశాబ్దాలుగా తోలు పరిశ్రమ దేశంలో మనుగడ సాధించగలిగిందని, విదేశీ పరిశ్రమల నుంచి ప్రస్తుతం ఎదురవుతున్న పోటీని సమర్థంగా అధిగమించాల్సి ఉందన్నారు. ప్రపంచ మార్కెట్‌ను ఆకర్షించేలా.. తోలు పరిశ్రమల పునరుద్ధరణకు కేంద్రం ఇప్పటికే రూ.2,600 కోట్ల ప్యాకేజీ ప్రకటించిందని సురేశ్ ప్రభు అన్నారు. ఆధునిక యంత్రాల కొనుగోళ్లు, శిక్షణ, మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు ఈ నిధులను వినియోగిస్తున్నామన్నారు. కొత్త భవనంలో విద్యార్థులకు సదుపాయాలు కల్పించామని, దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థల్లో ఇదొకటి అని చెప్పారు. తోలు ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఆకర్షణీయ డిజైన్లు కీలకమని, ఇక్కడి విద్యార్థులు ప్రపంచ మార్కెట్‌ను ఆకర్షించే డిజైన్లకు రూపకల్పన చేసి తోలు వస్తువుల ఎగుమతుల పెంపునకు దోహదపడాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, వాణిజ్య శాఖ జాయింట్ సెక్రెటరీ అనిత, ఎఫ్‌డీడీఐ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్సిన్హా, కార్యదర్శి వివేక్ తదితరులు పాల్గొన్నారు. -
పేదరిక నిర్మూలన మోదీతోనే సాధ్యం
వరంగల్ రూరల్ జిల్లా: తెలంగాణ రాష్ట్రం రాక ముందు..వచ్చాక ఎలాంటి మార్పు రాలేదని, తెలంగాణాలో కానీ దేశంలో కానీ పేదరిక నిర్మూలన జరగాలంటే ఒక్క మోదీతోనే సాధ్యం తప్ప టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలతో కాదని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు వ్యాఖ్యానించారు. జనచైతన్య యాత్రలో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలకేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక బీజేపీ పాలిత ప్రాంతాల్లో ప్రజలు ఆనందంగా ఉన్నట్లుగా తెలంగాణ ప్రజలు కూడా ఆనందంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చాక దేశాన్ని, రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలించిందని, అయినా కూడా ఇక్కడి ప్రజలు పనుల నిమిత్తం ముంబై వెళ్లాల్సి వచ్చిందంటే.. ఈ ప్రాంతాన్ని ఎలా అణగదొక్కారో అర్ధం అవుతుందన్నారు. రైతులకు లబ్ధి చేకూరేలా..పంటకు మద్ధతు ధర ప్రకటించి.. నా ద్వారా మోదీ ఇక్కడి ప్రజలకు సందేశం పంపించారని తెలిపారు. మోదీ తీసుకున్న నిర్ణయంతో పట్టణాల్లో ఉన్న ప్రజలు జీవిస్తున్నట్లుగా.. రైతులు కూడా ఉండాలని అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రైతు కుటుంబంలో ఏ ఎక్కరైనా అనారోగ్యం బారిన పడితే ఆ కుటుంబం అప్పుల పాలయ్యే పరస్థితి ఏర్పడుతుందని.. ఆ పరిస్థితి మారేందుకు ఆయుష్మాన్ భవ పథకం తీసుకురాబోతున్నామని వెల్లడించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులతో ఇక్కడి ప్రభుత్వం కారణంగా లబ్ధి పొందలేకపోతున్నారని అన్నారు. అలాంటి పరిస్థితి మారాలంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని వ్యాఖ్యానించారు. వరంగల్‌తో జనసంఘ్ పార్టీ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. అందుకే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే..ఈ జిల్లాకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు ఇప్పించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. దేశ రక్షణ కోసం వరంగల్ ప్రజలు ముందుంటారు కాబట్టి మీరంతా బీజేపీ జెండా పట్టుకుని మద్ధతుగా నిలవాలని కోరారు. తాను ఇక్కడ పుట్టనప్పటికీ..తనను ఈ తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభ సభ్యుడిగా పంపి మంత్రిని చేసినందుకు మీకు రుణపడి ఉంటానని తెలిపారు.