వాయిదాల కోసం కోర్టులో లంచం
న్యాయం చేయాలని ‘ప్రజావాణి’లో మహిళ ఆత్మహత్యాయత్నం
దురాజ్‌పల్లి (సూర్యాపేట): కోర్టు వాయిదాలు ఇవ్వకుండా సివిల్ బెంచ్ క్లర్క్ లంచం కోసం వేధిస్తున్నాడని ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో ఇది చోటుచేసుకుంది. మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన కన్నెబోయిన లక్ష్మమ్మ భూ వివాద కేసుకు సంబంధించి హుజూర్నగర్ సివిల్‌కోర్టులో పేచీ నడు స్తోంది. ఈ విషయమై కోర్టులో హాజరుకావాల్సి ఉంది. అయితే సివిల్ బెంచ్ క్లర్క్ గోవర్దన్ వాయిదాలు ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడు.
ఇదేమిటని అడిగితే లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు బాధితురాలు ఆరోపించింది. పైగా తనతో అసభ్య కరంగా ప్రవర్తించాడని పేర్కొంది. రూ.3 వేలు ఇచ్చాక ఒకసారి పేచీ వచ్చిందని, ఆ తర్వాత ఇంకా లంచం ఇవ్వాలని వేధిస్తున్నాడని ఆరోపించింది. జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. కేసులో రాజీకి రావాలని.. లేదంటే చంపుతామని బెదిరిస్తున్నారని వాపోయింది. సోమవారం ప్రజావాణికి లక్ష్మమ్మ వచ్చింది. జేసీ వినతులు స్వీకరిస్తున్న సమయంలో.. ‘నాకు మీరైనా న్యాయం చేయండి’ అంటూ ఆమె వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్ప డింది. తేరుకున్న అధికారులు ఆమెను సముదాయించి పోలీసులకు అప్పగించారు.