సుజ్లాన్ షేర్ల కోసం ఓపెన్ ఆఫర్
- ప్రమోటర్ల నుంచి 23 శాతం వాటా కొన్న సన్‌ఫార్మా దిలీప్ సంఘ్వి
- మరో 26 శాతం వాటాకు షేరుకు రూ. 18 ధరపై ఆఫర్
- 20 శాతం ఎగసిన షేరు ధర
న్యూఢిల్లీ: పవన విద్యుదుత్పత్తిలో ఉపయోగపడే విండ్ టర్బైన్లు తయారు చేసే సుజ్లాన్ ఎనర్జీ షేర్ల కోసం డీఎస్ఏ(దిలిప్ సంఘ్వి ఫ్యామిలీ అండ్ అసోసియేట్స్) ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద ఒక్కో షేర్‌ను రూ.18 చొప్పున 26 శాతం వాటాను(157.64 కోట్ల షేర్లు) కొనుగోలు చేయనున్నామని డీఎస్ఏ తెలిపింది. ఈ ఓపెన్ ఆఫర్ కోసం రూ.2,838 కోట్లు కేటాయించింది.
సుజ్లాన్ ఎనర్జీలో 23 శాతం వాటా కొనుగోలు (రూ.1,800 కోట్లతో) కోసం సుజ్లాన్ ఎనర్జీ, సన్ ఫార్మాకు ప్రమోటర్ అయిన దిలిప్ సంఘ్వి, కుటుంబ సభ్యులు(డీఎస్ఏ) మధ్య గత వారంలో ఒప్పందం కుదిరింది. ఈ డీల్ తర్వాత సుజ్లాన్ ఎనర్జీలో డీఎస్ఏ వాటా 23 శాతంగా, సుజ్లాన్ గ్రూప్ చైర్మన్ తులసి తంతి కుటుంబానికి 24 శాతం చొప్పున వాటాలుంటాయి. ఒప్పందం ప్రకారం యాజమా న్య నియంత్రణ తంతి కుటుంబానికే ఉంటుంది.
వెయ్యి కోట్లు పెరిగిన మార్కెట్ క్యాప్
ఈ పరిణామాల నేపథ్యంలో సుజ్లాన్ ఎనర్జీ షేర్ ధర సోమవారం ఎన్ఎస్ఈలో 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 23 వద్ద ముగిసింది. ఒక్క సోమవారం రోజే ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,089 కోట్లు పెరిగి రూ.7,606 కోట్లకు చేరింది.