కేజ్రీవాల్ యాంటీ హిందూ.. అందుకే పోటీ!
న్యూఢిల్లీ: స్వయం ప్రకటిత స్వామీజీ, బిగ్‌బాస్ టీవీ షో మాజీ కంటెస్టెంట్ స్వామి ఓం మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఢిల్లీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ‘హిందూ వ్యతిరేక వైఖరి’ ని అవలంబిస్తున్నారని, అందుకే తాను న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నానని తెలిపారు. హిందూమత చిహ్నమైన స్వస్తిక్‌ను ఆప్ గుర్తు అయిన చీపురుకట్ట తరుముతున్నట్టు కేజ్రీవాల్ చేసిన ట్వీట్‌ను ఆయన తప్పుబట్టారు. ఈ నెల 23న హిందూ సంఘాలు సమావేశమై.. తనను ఎన్నికల బరిలోకి దింపాలని నిర్ణయించాయని ఆయన చెప్పుకొచ్చారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలిచిన స్వామీ ఓంపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఓ మహిళను లైంగిక వేధించి.. బెదిరించినట్టు కూడా ఆయనపై కేసు నమోదైంది. ఓ టీవీ చానెల్ లైవ్ చర్చా కార్యక్రమంలో ఆయన ఓ మహిళ వక్త చెంప చెళ్లుమనిపించారు. గతంలో పలు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమైంది.