కుల బహిష్కరణ పేరిట ఘోరం..
వరంగల్ జిల్లాలో ఘోర సంఘటన వెలుగుచూసింది. కులబహిష్కరణ పేరిట ఓ కుటుంబాన్ని ఘోరంగా అవమానించిన సంఘటన బుధవారం వెలుగుచూసింది. సభ్య సమాజం తలదించుకునే విధంగా.. ఇంట్లో మృతదేహం ఉందనే విషయాన్ని పట్టించుకోకుండా.. కుల బహిష్కరణ జరిగిన కుటుంబానికి తామెవ్వరం రామని తీర్మానించిన కులపెద్దలు మనవత్వాన్ని మరిచి ప్రవర్తించడం విస్మయానికి గురి చేసింది.
వరంగల్ జిల్లా మద్దూరు మండలం కూటిగల్ గ్రామానికి చెందిన సౌందర్య(19) ప్రేమించిన వాడు కాదన్నాడని మంగళవారం పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. చికిత్స పొందుతూ మృతిచెందిన ఆమెకు అంత్య క్రియలు నిర్వహించడానికి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో కులపెద్దల నుంచి అనూహ్య పరిణామం ఎదురైంది. ఇప్పటికే ఓ కూతురు కులాంతర వివాహం చేసుకున్న ఇంట్లో జరిగే కార్యానికి ఎవరు హాజరుకాకుడదని కులపెద్దలు నిర్ణయించారు.
దహన సంస్కారాల సమయంలో డప్పులు కొట్టేవారు, కుమ్మరివారు, చాకలివారు పాల్గొనకూడదని కులపెద్దలు ఆదేశించారు. దీంతో సౌందర్య కుటుంబ సభ్యులు కులపెద్దలకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదుచేశారు. కాగా.. సౌందర్య సోదరి వడ్ల లావణ్య(21) ఆరు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన విక్రమ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కులాంతర వివాహం చేసుకోవడంతో.. ఆమెను కులం నుంచి బహిష్కిరస్తున్నట్లు కులపెద్దలు తీర్పిచ్చారు. ఈ నేపథ్యంలో చెళ్లెలు మృతిచెందిందని తెలిసి విలపిస్తూ వచ్చిన లావణ్యను కులపెద్దలు సూటిపోటి మాటలతో బాదించడంతో పాటు నీ వల్లే మీ చెల్లెలు శవాన్ని ఎత్తడానికి కూడా ఎవరు రాలేదని నిందించడంతో.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.