రక్తపిశాచులయ్యే జబ్బు!
మెడిక్షనరీ
జలగలు రక్తం తాగుతాయి. దోమలూ రక్తాన్ని పీలుస్తుంటాయి. అది వాటి ఆహారం. అలా రక్తాన్ని ఆహారంగా తీసుకునే ప్రాణులను శ్యాంజీవోరస్ జీవులు అంటారు. డ్యాక్యులాలు అని పిలిచే దెయ్యాలు సైతం మనిషి మెడ దగ్గర కొరికి రక్తం పీలుస్తున్న కథలూ, సినిమాలు వచ్చాయి. కానీ అవన్నీ ఊహజనిత పాత్రలు. అయితే నిజంగానే రక్తాన్ని తాగాలనుకునే మానసిక వ్యాధి కూడా ఒకటి ఉంది. దీన్ని వైద్య పరిభాషలో ‘రెన్ఫీల్డ్స్ సిండ్రోమ్’ అని అంటారు.
రక్తాన్ని తాగే పిశాచాల పాత్రలను ‘వ్యాంపైర్స్’ అని అంటుంటారు. అలాగే రక్తాన్ని తాగాలనే తీవ్రమైన వాంఛ ఉండే ఈ జబ్బును ‘క్లినికల్ వ్యాంపైరిజమ్’ అని వ్యవహరిస్తారు. సాధారణంగా మన వేలికి ఏదైనా దెబ్బతగిలి రక్తస్రావం అవుతున్నప్పుడు గబుక్కున నోట్లో పెట్టుకుంటాం. దీన్ని ఆటోవ్యాంపైరిజమ్ అంటారు. ఇది అసంకల్పితంగా జరిగే ప్రక్రియ. కానీ కొందరిలో ఇలా మానవ రక్తాన్ని తాగాలనే వాంఛ ప్రబలుతుంది. దీన్నే క్లినికల్ వ్యాంపైరిజమ్ అంటారు. అయితే ఇది చాలా అరుదైన వ్యాధి.