డీసీ చైర్మన్, డెరైక్టర్లకు నాంపల్లి కోర్టు సమన్లు
సాక్షి, హైదరాబాద్: కరూర్ వైశ్యా బ్యాంక్(కేవీబీ) దాఖలు చేసిన చెక్‌బౌన్స్ కేసులో దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్(డీసీహెచ్ఎల్) చైర్మన్ టి.వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్మన్లు పీకే అయ్యర్, వినాయక్ రవిరెడ్డిలతోపాటు తొమ్మిది మంది డెరైక్టర్లు, ఇతర ఉద్యోగులకు నాంపల్లి కోర్టు ఇటీవల సమన్లు జారీ చేసింది. వీరందరినీ ఈ నెల 16న ప్రత్యక్షంగా హాజరై... చెల్లని చెక్కును ఎందుకిచ్చారో వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. బెంగళూరులోని ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రణా యంత్రం కొనుగోలు కోసం కరూర్ వైశ్యా బ్యాంక్ నుంచి రూ.75 కోట్ల రుణాన్ని డీసీహెచ్ఎల్ తీసుకుంది. రుణ చెల్లింపుల్లో భాగంగా రూ.50 కోట్లకు చెక్కులిచ్చింది. అయితే డీసీహెచ్ఎల్ ఖాతాల్లో నగదు నిల్వలు లేకపోవడంతో ఈ చెక్కులు బౌన్స్ అయ్యాయి. ఇదిలా ఉండగా బెంగళూరులోని ముద్రణా యంత్రంపై యాజమాన్య హక్కులను తమకు బదలాయించాలని కోరుతూ కేవీబీ రుణ వసూళ్ల ట్రిబ్యునల్(డీఆర్టీ)ను కూడా ఆశ్రయించింది. ఈ కేసు ఈ నెల 27న విచారణకు రానుంది.